Share News

మంచి మిత్రుడు

ABN , Publish Date - Sep 18 , 2024 | 06:04 AM

రాజు, రాకేష్‌ అనే ఇద్దరు మిత్రులు వెంకటాపురం అనే ఊరిలో ఉండేవారు.వారిద్దరూ చదువులో ఆటపాటల్లో అన్ని చోట్లా ఒక్కటిగా ఉండేవారు. ఒకరి ఇంట్లో కష్టాలకు,సమస్యలకు మరొకరు తోడుగా,సాయంగా ఉండేవారు.

మంచి మిత్రుడు

రాజు, రాకేష్‌ అనే ఇద్దరు మిత్రులు వెంకటాపురం అనే ఊరిలో ఉండేవారు.వారిద్దరూ చదువులో ఆటపాటల్లో అన్ని చోట్లా ఒక్కటిగా ఉండేవారు. ఒకరి ఇంట్లో కష్టాలకు,సమస్యలకు మరొకరు తోడుగా,సాయంగా ఉండేవారు. ఊరిలో మిగతా వారికి కూడా చేతనైనంత సాయపడేవారు. ఊరి వారంతా వారిని చూపించి, స్నేహితులంటే ఇలా ఉండాలి అని చెప్పుకునే వారు. ఒక రోజు వారిద్దరూ సరదాగా నడుచుకుంటూ ఊరవతలికి షికారుకి వెళ్లారు. మాటల మధ్య ఇద్దరికీ వాదన పెరిగి, రాకేష్‌ ను రాజు చెంప మీద కొట్టాడు.దానికి బాధపడ్డ రాకేష్‌ పక్కన ఇసుకలో ప్రాణమిత్రుడైన రాజు ‘నన్ను ఇవాళ చెంప మీద కొట్గాడు’ అని రాశాడు. అలా ముందుకు వెళ్లాక దారిలో బురద ఉన్నది చూసుకోకుండా రాకేష్‌ అందులో కాలు వేసి జారి పడ్డాడు. అతని బట్టలు మొత్తం మురికి అయిపోయాయి. బురదలో నుంచి లేవలేక పోతుంటే రాజు చేయి అందించి, పైకి లేపడమే కాకుండా తన ఒంటి మీద ఉన్న చొక్కా విప్పి రాకేష్‌ కి ఇచ్చి అతన్ని ఇంటికి తీసుకెళ్లి దిగబెట్టాడు. తరువాత రాకేష్‌ ఒక పదునైన చిన్న రాయి తీసుకుని, దగ్గరలో ఉన్న బండరాయి మీద ఇలా చెక్కాడు.‘ ఇవాళ నా ప్రాణ మిత్రుడైన రాజు నన్ను బురదలో నుంచి పైకి లాగి సాయంచేసి, ఇంటి వద్ద దిగబెట్టాడు’ అని. ఇది గమనించిన రాజు రాకే్‌షను ఇలా అడిగాడు ‘మొన్న నిన్ను కొడితే ఇలాగే ఇసుక మీద రాశావు ఇవాళ రాయి మీద రాశావు ఏమిటి మిత్రమా ఇదంతా? అని అడిగాడు. దానికి రాకేష్‌ ‘మిత్రుడనే కాదు రాజూ ఎవరు చేసిన తప్పునైనా ఇసుక మీది రాతలాగా వెంటనే మరచిపోవాలి. కానీ సాటి మనుషులు చేసిన సాయం మాత్రం బండరాయి మీద చెక్కిన రాత లాగా ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి, అందుకే అది ఇసుకలోనూ, దీన్ని రాతి మీదా చెక్కాను’అని చెప్పాడు. రాకేష్‌ మంచి మనసుకు మంచి ఆలోచనలుచూసిన రాజు అలాంటి మంచి మిత్రుడిని కలిగి ఉన్నందుకు ఎంతో గర్వ పడ్డాడు.

Updated Date - Sep 18 , 2024 | 06:04 AM