Share News

శ్రీకృష్ణుడి ఆంతరంగిక శక్తి.. రాధ

ABN , Publish Date - Sep 06 , 2024 | 05:57 AM

‘‘ఓ నారదా! ఇది సత్యం, సత్యం. మళ్ళీ మళ్ళీ ఇదే సత్యం, ఇదే సత్యం అని చెబుతున్నాను. రాధ కృప లేనిదే... నా కృపను ఎవరూ పొందలేరు’’ అని నారద మహర్షికి స్వయంగా శ్రీకృష్ణుడు వివరించినట్టు ‘నారద పురాణం’ చెబుతోంది. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడితో...

శ్రీకృష్ణుడి ఆంతరంగిక శక్తి.. రాధ

హరేకృష్ణ

సత్యం సత్యం పునః సత్యం సత్యమేవ పునః పునః

వినా రాధా ప్రసాదేన మత్ప్రసాదో న విద్యతే

‘‘ఓ నారదా! ఇది సత్యం, సత్యం. మళ్ళీ మళ్ళీ ఇదే సత్యం, ఇదే సత్యం అని చెబుతున్నాను. రాధ కృప లేనిదే... నా కృపను ఎవరూ పొందలేరు’’ అని నారద మహర్షికి స్వయంగా శ్రీకృష్ణుడు వివరించినట్టు ‘నారద పురాణం’ చెబుతోంది. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడితో సమానుడు కానీ, అధికుడు గానీ మరొకరు లేరు. బలంతో ఆయనను ఎవరూ జయించలేరు. అంతేకాదు, ఆయన బలవంతంగా నిర్వర్తించాల్సిన కార్యాలేవీ ముల్లోకాల్లోనూ లేవు. శ్రీకృష్ణుడు ఏది చేసినా... కేవలం ఆనందానుభూతికోసం, తన స్వీయసంకల్పంతో మాత్రమే నిర్వహిస్తాడు. మరి అంతటి శ్రీకృష్ణుడు సైతం రాధ మీద ఆధారపడడం ఏమిటి?

శ్రీకృష్ణుడు అజేయుడు అయినప్పటికీ... ఆయనలో ఒక అద్భుతమైన గుణం ఉంది. అదే భక్తుల ప్రేమకు వశం కావడం. ఆయన తన భక్తుల విశుద్ధమైన సేవలకు మాత్రమే బద్ధుడు. ఎలాంటి స్వలాభాపేక్షా లేకుండా, నిస్వార్థంతో చేసే సేవ భగవంతుణ్ణే కట్టిపడేసేటంత గొప్పది. శ్రీకృష్ణుడు సర్వాకర్షకుడు. అయితే ఆయనను ఆకర్షించే శక్తి మరేదైనా ఉందా అంటే... అవుననే చెప్పాలి. ఆ శక్తే శ్రీకృష్ణుడి ఆంతరంగిక శక్తిస్వరూపిణి అయిన శ్రీరాధికాదేవి.


దేవీ కృష్ణమయీ ప్రోక్తా రాధికా పరదేవతా

సర్వలక్ష్మీమయీ సర్వకాన్తిః సమ్మోహినీ పరా

‘‘దివ్య దేవతా స్వరూపిణి అయిన రాధారాణి శ్రీకృష్ణుని అర్థాంగి. సర్వలక్ష్ములలో ఆమే ప్రధానురాలు. సర్వాకర్షకుడైన భగవంతుణ్ణి సైతం ఆకర్షించగలిగే ఆకర్షణ ఆమెలో ఉంది. ఆమే దేవదేవుని ఆది ఆంతరంగిక శక్తి’’ అని ‘శ్రీచైతన్య చరితామృతం’ చెబుతోంది. అత్యుత్తమ భక్తికి ఆమె నిదర్శనం. శ్రీకృష్ణుడికి చేసే సకల సేవలు ఆమె ద్వారానే స్వామికి చేరుతాయి. రాధిక అంటే ‘అత్యున్నత ఆరాధన’ అని అర్థం. ఆమె విశుద్ధ భక్తితత్త్వం కలిగినది కనుకనే... శ్రీకృష్ణుడు ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు.

‘‘బృందావనధామంలో విశుద్ధ భక్తులందరూ రాధారాణి కృప కోసం ప్రార్థిస్తారు. పూర్ణత్వం తాలూకు శక్తితత్త్వానికి ఆమె ప్రతిరూపం. ఈ భౌతిక ప్రపంచంలో పరిపూర్ణమైన స్త్రీ రూపాన్ని ఆమె పోలి ఉంటుంది. అటువంటి తల్లి అయిన రాధ కృప... భక్తిశ్రద్ధలు కలిగిన వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఆమె కృప పొందిన భక్తులను శ్రీకృష్ణుడు తక్షణమే స్వీకరిస్తాడు. కాబట్టి భక్తులు ముందుగా రాధ కృప కోసం ప్రార్థించాలి. తద్వారా భక్తియుత సేవల పట్ల మనలో నిద్రాణమై ఉన్న సహజమైన ప్రేమను తిరిగి మేల్కొలపగలుగుతాము’’ అని హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదులు తన ‘శ్రీమద్భాగవత’ వ్యాఖ్యానంలో తెలిపారు. రాధ ఆవిర్భవించిన పవిత్రమైన రోజు రాధాష్టమి. ఇది కృష్ణాష్టమికి పదిహేను రోజుల తరువాత వస్తుంది. ఈ పర్వదినాన రాధాకృష్ణులకు పుష్పాంజలి సమర్పిస్తూ ‘‘ఓ రాధారాణి! దీనుడినైన నాపై దయచూపమని... దయచేసి నీ కృష్ణుడికి తెలియజేయి’’ అని ప్రార్థించాలి.


శ్రీచైతన్యుల పరంపరలో ఆచార్యులైన శ్రీల ప్రభుపాదులు... ఆ భగవత్ర్పేమను లోకానికి అందజేసిన మహనీయులు. భగవంతుడితో జీవుడు తన అనుబంధాన్ని పునఃస్థాపించుకోవడానికి ఆయన అందించిన అత్యంత సరళమైన మార్గమే హరినామ సంకీర్తన. ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే... హరే రామ హరే రామ రామ రామ హరే హరే’ అనే మహామంత్రాన్ని జపిస్తూ... శ్రీ చైతన్య మహాప్రభువును ఆశ్రయించినవారు.... అజ్ఞానాంధకారమయమైన ఈ కలియుగాన్ని సులభంగా దాటగలరు. జీవితంలో పరిపూర్ణత సాధించగలరు.

(11న రాధాష్టమి) శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ

అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్‌,

హైదరాబాద్‌, 9396956984

Updated Date - Sep 06 , 2024 | 05:57 AM