Navya : అడగాల్సింది ఆయననే
ABN , Publish Date - Jun 14 , 2024 | 12:03 AM
సద్బోధ ఒక రాజ్యంలోని అడవిలో ఒక సన్యాసి ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఉండేవాడు. ఆయనను చాలామంది ప్రజలు దర్శించుకొనేవారు. వారిని చూసినప్పుడల్లా ‘అయ్యో! వీరందరూ నా కోసం ఇక్కడికి వస్తున్నారు. అడవిలో ప్రయాణించి అలసిపోతున్న వీరికి నేను ఎలాంటి సదుపాయాలూ చేయలేకపోతున్నాను’ అని ఆయన బాధపడేవాడు.
సద్బోధ
ఒక రాజ్యంలోని అడవిలో ఒక సన్యాసి ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఉండేవాడు. ఆయనను చాలామంది ప్రజలు దర్శించుకొనేవారు. వారిని చూసినప్పుడల్లా ‘అయ్యో! వీరందరూ నా కోసం ఇక్కడికి వస్తున్నారు. అడవిలో ప్రయాణించి అలసిపోతున్న వీరికి నేను ఎలాంటి సదుపాయాలూ చేయలేకపోతున్నాను’ అని ఆయన బాధపడేవాడు. కానీ వందల మందికి వసతి కల్పించే స్థోమత సన్యాసి అయిన అతనికెక్కడిదీ? కాబట్టి రాజ్యాన్ని పాలించే రాజు దగ్గరకు వెళ్ళి... సహాయం కోరాలనుకున్నాడు.
ఆ సన్యాసి ఒక రోజు... రాజ మందిరానికి వచ్చాడు. సాధువులకు, సన్యాసులకు ఆ చక్రవర్తి మందిర ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉండేవి. ద్వారపాలకులు ఆయనకు స్వాగతం పలికారు. ఆ సమయంలో ఆ రాజు తన ధ్యానమందిరంలో ప్రార్థన చేస్తున్నాడు. సన్యాసిని ద్వారపాలకులు అక్కడికి తీసుకువెళ్ళి, ఆసనం మీద కూర్చోబెట్టారు.
‘‘ఓ దైవమా! నాకు ధనాన్ని ఇవ్వు. సంపదను అనుగ్రహించు’’ అంటూ దేవుణ్ణి ఆ రాజు వేడుకోవడం ఆ సన్యాసికి వినిపించింది. వెంటనే కుర్చీలోంచి లేచాడు.
ఆ శబ్దానికి వెనక్కి తిరిగిన రాజు.. ఆయనను కూర్చోమని సైగ చేశాడు. ప్రార్థన ముగించుకొని సన్యాసి దగ్గరకు వచ్చి ‘‘మీరు నన్ను కలుసుకోవడానికి వచ్చారు. కానీ నాతో ఒక్క మాట మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇంతకీ మీకు ఏం కావాలి?’’ అని అడిగాడు.
‘‘ప్రభూ! ఆ సంగతి చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలచుకోలేదు. నేను బయలుదేరుతున్నాను’’ అన్నాడు సన్యాసి.
‘‘కాదు. మీరు చెప్పి తీరాల్సిందే’’ అని బలవంతపెట్టాడు రాజు.
‘‘చాలామంది జనం నా ఆశ్రమానికి వస్తూ ఉంటారు. వారికి ఎలాంటి సౌకర్యాలు కలిఁంచలేకపోతున్నాను. అందుకని మిమ్మల్ని డబ్బు అడగడానికి ఇక్కడికి వచ్చాను’’ అని చెప్పాడు సన్యాసి.
‘‘మరి నన్ను అడగకుండానే వెళ్ళిపోతున్నారేం?’’ అని ప్రశ్నించాడు రాజు.
‘‘నేను మిమ్మల్ని యాచించడం కోసం వచ్చాను. మీరు కూడా యాచకుడేనని తెలుసుకున్నాను. మీరు డబ్బు కోసం, సంపదల కోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అప్పుడు నాకు అనిపించింది... ఒక యాచకుణ్ణి నేనెందుకు యాచించాలి? నేరుగా ఆ భగవంతుణ్ణే యాచిస్తే సరిపోతుంది కదా!’’ అని చెబుతూ బయటకు నడిచాడు.
ఒక సందర్భంలో... రామకృష్ణ పరమహంస తన శిష్యులకు ఈ కథ చెబుతూ... ‘‘పేదవారు తమ ఇబ్బందులు తీరాలని కోరుకుంటారు. సంపన్నులు ఇంకా సంపద కావాలని తపిస్తారు. దానికోసం ఇరువురూ దేవుణ్ణి రకరకాలుగా ప్రార్థిస్తారు. సర్వప్రాణులకూ పోషకుడు ఆ భగవంతుడే. మన కర్మను మనం ఆచరిస్తూ, ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తే మనకు కావలసినవన్నీ ఆయనే ఇస్తాడు. కాబట్టి మనకు ఏది కావలసినా కోరాల్సిందీ, ప్రార్థించాల్సినదీ ఆయననే’’ అని ఉపదేశించారు.