Mosquito Researchers : వాళ్లు దోమలను ఆకర్షిస్తారు
ABN , Publish Date - Sep 21 , 2024 | 12:19 AM
దోమలు బాగా కుడుతున్నాయని కొందరిని అదే పనిగా ఫిర్యాదు చేయడం చూస్తూనే ఉంటాం. నిజంగానే దోమలు అలా కొందరినే పనిగట్టుకుని ఎక్కువగా కుడతాయా?
దోమలు బాగా కుడుతున్నాయని కొందరిని అదే పనిగా ఫిర్యాదు చేయడం చూస్తూనే ఉంటాం. నిజంగానే దోమలు అలా కొందరినే పనిగట్టుకుని ఎక్కువగా కుడతాయా? అంటే నిజమేనని అంటున్నారు పరిశోధకులు. దీనికి కారణం వాళ్ల శరీరం నుంచి వచ్చే ఒకరకమైన వాసనే అని అంటున్నారు. ఆ వాసనకు దోమలు ఆకర్షితమవుతాయట. అంటే వాళ్లకు తెలియకుండానే దోమలను ఆకర్షిస్తుంటారు. శరీరం నుంచి వచ్చే చెమటలో ఉండే రకరకాల కెమికల్స్ కీటకాలను ఆకర్షిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
దోమలు దాదాపు 60 అడుగుల దూరం నుంచే వాసనలు పసిగడతాయి. అలాగే రాత్రి 10 నుంచి ఉదయం 2 గంటల మధ్య దోమలు ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నట్టు వీరి అధ్యయనంలో తేలింది. ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలతో దోమల కదలికలను ట్రాక్ చేసి మరీ ఈ విషయాలను వెల్లడించారు. దోమలు కార్బాక్సిలిక్ యాసిడ్, బ్యుటిరిక్ యాసిడ్‌లకు ఎక్కువ ఆకర్షితమవుతాయి. ఈ కార్బాక్సిలిక్ యాసిడ్‌ను మనిషి చర్మంపైన బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది. ఆ వాసనకు ఆకర్షితమయ్యే దోమలు వచ్చేస్తాయి.
ప్రాణాంతకమైన మలేరియా దోమలు కుట్టడం వల్ల వస్తుందన్న సంగతి తెలిసిందే. ప్లాస్మోడియం అనే పరాన్నజీవి మనిషి రక్తంలో చేరినప్పుడు మలేరియా వస్తుంది. మలేరియా సోకిన వ్యక్తిని దోమ కుట్టినప్పుడు రక్తంతో పాటు ఆ పరాన్నజీవి దోమలోకి చేరుతుంది. దోమ పొట్టలో ఈ పరాన్నజీవి వృద్ధి చెందుతుంది. మరో మనిషిని కుట్టినప్పుడు అతనికి వ్యాపింపజేస్తుంది. ఇలా మలేరియా విస్తరిస్తూ పోతుంది. మలేరియా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 6 లక్షల మంది చనిపోతున్నారు. ఇందులో ఐదేళ్లలోపు పిల్లల సంఖ్యే ఎక్కువ.