Share News

Muni Mutkami : కృషి మిత్ర

ABN , Publish Date - Jun 24 , 2024 | 01:58 AM

‘‘వ్యవసాయం లాభసాటిగా మారాలి. రైతులు హుందాగా జీవించాలి. గ్రామాల నుంచి వలసలు ఆగిపోవాలి. ఇవీ నా కలలు’’ అని చెబుతుంది పద్ధెనిమిదేళ్ళ మునీ ముత్కామీ.

Muni Mutkami : కృషి మిత్ర

‘‘వ్యవసాయం లాభసాటిగా మారాలి. రైతులు హుందాగా జీవించాలి. గ్రామాల నుంచి వలసలు ఆగిపోవాలి. ఇవీ నా కలలు’’ అని చెబుతుంది పద్ధెనిమిదేళ్ళ మునీ ముత్కామీ. కరువు గడ్డగా పేరుపడిన తమ ప్రాంతంలో... మార్పుకోసం ఆమె చేపట్టిన చిన్న ప్రయత్నం రైతులకు ఆశారేఖగా మారింది. ‘కృషిమిత్ర’గా గుర్తింపు పొందిన మునీ కథ ఇది.

‘‘మాది ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లాలో కుర్తి అనే గ్రామం. కోయ తెగకు చెందిన కుటుంబం. మా జిల్లా దుర్భిక్షానికి మారుపేరైన గిరిజన ప్రాంతంరైతులు ఎక్కువగా వరినే పండిస్తూ ఉంటారు. వర్షపాతం సరిగ్గా ఉండకపోవడానికి తోడు సంప్రదాయికమైన సాగు పద్ధతులు, పొలాల్లోకి జంతువులు యథేచ్ఛగా ప్రవేశిస్తూ ఉండడం... ఇవన్నీ వారి జీవితాలను దుర్భరం చేశాయి. ఏటా అప్పో సప్పో చేసి పంటలు వేయడం, తీవ్ర నష్టాలపాలు కావడం, యువకులు, మధ్య వయస్కులు తమ కుటుంబాలను గ్రామాల్లోనే వదిలేసి, పొట్టపోసుకోవడం కోసం వేరే ప్రాంతాలకు... ప్రధానంగా సరిహద్దుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళడం మామూలైపోయింది.

ఇవన్నీ చూస్తూ పెరిగాను. ఈ పరిస్థితులు మారాలంటే ఏం చెయాలనే ఆలోచన నన్ను వేధించేది. నేను ఎనిమిదో తరగతితో చదువు ఆపేసినా... పత్రికలు చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడమంటే ఆసక్తి. మూడేళ్ళ కిందట మల్కన్‌గిరి ప్రాంతంలో... రాష్ట్రప్రభుత్వ భాగస్వామ్యంతో స్వామినాథన్‌ ఫౌండేషన్‌ ఒక ప్రాజెక్ట్‌ ప్రారంభించిందనే వార్త నన్ను ఆకర్షించింది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, గిరిజనుల జీవితాలను మెరుగుపరచడానికి రబీ సీజన్‌ కోసం ఉచితంగా విత్తనాలను, పరికరాలను ఆ ఫౌండేషన్‌ అందిస్తోందని తెలిసింది. మా ప్రాంతంలో రబీ సాగు చేయరు. దానివల్ల రైతులకు కలిగే లాభాల గురించి తెలుసుకోవడానికి ఫౌండేషన్‌ ప్రతినిధులను సంప్రతించాను. క్షేత్రస్థాయిలో అవగాహన పెంచడం కోసం అవగాహన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనీ, ఆసక్తి ఉంటే హాజరు కావచ్చనీ వారు చెప్పారు. నేను ఉత్సాహంగా ‘‘సరే’’ అన్నాను.


సేంద్రియ పద్ధతుల ద్వారా ఫలసాయాన్ని పెంచే ఆధునిక పద్ధతులు ఎన్నో నేర్చుకున్నాను. వాటిలో... వ్యవసాయంలో రబీ విత్తనాల ప్రాధాన్యత, భూసారాన్ని పెంచడం, చీడపీడల నివారణ, జంతువులు చొరబడకుండా నిరోధించడానికి పొలం చుట్టూ కంచెల ఏర్పాటు, సేంద్రియ వర్మీ కంపోస్ట్‌ తయారీ పద్ధతులు... ఇలా ఎన్నో ఉన్నాయి. రబీ సాగు వైపు మా ఊరి రైతులు మొగ్గు చూపిస్తే... విత్తనాలను, ఇతర ప్రాజెక్ట్‌ ఉపకరణాలను ఉచితంగా అందిస్తామని అధికారుల నుంచి హామీ తీసుకున్నాను.

ఇరు పక్షాలకూ ప్రతినిధిని...

‘‘రైతులను ఒప్పించడం మాకు పెద్ద సమస్యగా మారింది. కొత్త పద్ధతుల్లోకి మారడానికి వారు త్వరగా ఇష్టపడరు. వాళ్ళకూ, మాకూ మధ్య నువ్వు వారధిలా పని చేస్తే... వారిలో అవగాహన పెంచడం, ఈ ప్రాంతంలో నైపుణ్యాభివృద్ధి కోసం చర్యలు చేపట్టడం మాకు సులువవుతుంది’’ అని అధికారులు చెప్పారు. నాకు మా గిరిజన తెగలు మాట్లాడే మాండలికంతో పాటు ఒరియా కూడా బాగా వచ్చు. అందుకే... సదస్సుల్లో శాస్త్రవేత్తలు, అధికారులు చెప్పిన విషయాలను స్థానికులకు అర్థమయ్యేలా వివరించేదాన్ని. అధికారులతో పాటు దాదాపు ప్రతి గ్రామం తిరిగాను. అక్కడి రైతుల సమస్యలు తెలుసుకొని, అధికారులకు రాతపూర్వకంగా అందజేస్తూ వచ్చాను. ఒక విధంగా అటు ఆ ప్రాజెక్టుకు, ఇటు రైతులకు... ఇరుపక్షాలకూ నేను ప్రతినిధిని.

నేను తెలుసుకున్న ఆధునిక వ్యవసాయ పద్ధతులన్నీ గ్రామస్తులకు నేర్పాను. పెసర సాగు చేయాలని సూచిస్తే... అయిష్టంగానే వాళ్ళు ఒప్పుకొన్నారు. ముప్ఫై ఎకరాల్లో వేసిన పెసర పంటకు మంచి ఫలసాయం రావడంతో... మరుసటి ఏడాది ఎక్కువమంది రైతులు పెసర, మినప పంటలను... వరితో పాటు అదనంగా మరో యాభై ఎకరాల్లో వేశారు. జంతువులు చొరబడకుండా కంచె ఏర్పాటు చేశాం. పంటల్లోని వైవిధ్యం లాభసాటి అని మా ప్రాంత గిరిజన రైతులు ఇప్పుడు గ్రహించారు. జొన్న, వేరుశనగ, కూరగాయల సాగుతో అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. వారు పండించినదానిలో వ్యక్తిగత అవసరాలకు సరిపోయేంత దాచుకొని... మిగిలినదాన్ని మార్కెట్‌లో లాభానికి అమ్ముకొనేలా ప్రోత్సహిస్తున్నాం.

గ్రామాల్లో రైతుల అవసరాలను గుర్తించి, సాగులో వారికి ఎదురవుతున్న సవాళ్ళను అధికారులు, శాస్త్రవేత్తల దృష్టికి తీసుకురావడానికి మా జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నాను. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వారికి అందించడానికి ప్రయత్నిస్తున్నాను. కిందటి ఏడాది ‘ఒడిశా లైవ్‌లీహుడ్‌ మిషన్‌’ నన్ను ‘కృషిమిత్ర’గా గుర్తించి సత్కరించింది. ఏ గ్రామానికి వెళ్ళినా... ప్రజలు నన్ను అభినందిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఇప్పుడు ఆపేసిన నా చదువును మళ్ళీ ప్రారంభించాలనుకుంటున్నాను. తద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికీ, ప్రజలకు మరింత సాయపడడానికీ వీలుంటుంది. ఎవరూ గ్రామాలు విడిచి వెళ్ళకుండా... తమ సొంత భూముల ద్వారానే మంచి ఆదాయం పొందుతూ హుందాగా జీవించాలనేది నా కోరిక. అది నెరవేరేదాకా కృషి చేస్తూనే ఉంటాను.’’

Updated Date - Jun 24 , 2024 | 01:58 AM