Share News

Navya : అదరగొట్టిన ఆయేషా

ABN , Publish Date - Jul 29 , 2024 | 04:10 AM

‘‘నేను జీవించే సమాజం... పుట్టి పెరిగిన ప్రాంతం... వాటి అభివృద్ధికి చేతనైన సాయం చేయాలనేది చిన్నప్పటి నుంచీ నా ఆకాంక్ష. వయసుతో పాటు నాలో సామాజిక చింతన కూడా పెరుగుతూ వచ్చింది.

Navya : అదరగొట్టిన ఆయేషా

రష్యాలోని ఉలియనోవ్‌స్క్‌ నగరం. ‘బ్రిక్స్‌’ దేశాల ‘యూత్‌ మినిస్టర్స్‌’ సదస్సు జరుగుతున్న ప్రాంగణం. ఓ యువతి... వేదికను అలంకరించింది. సామాజిక అంశాలు... అందులో యువత పాత్రపై అనర్గళంగా మాట్లాడింది. ఆ ప్రసంగానికి సభాస్థలి చప్పట్లతో మార్మోగింది. ఆమె ఎవరో కాదు... మన తెలుగు అమ్మాయే. పేరు... ఆయేషా. తెలుగు రాష్ట్రాల నుంచి ‘బ్రిక్స్‌’కు వెళ్లిన ఏకైక వ్యక్తి ఆమె. ఆ విశేషాలను ‘నవ్య’తో పంచుకుంది.

‘‘నేను జీవించే సమాజం... పుట్టి పెరిగిన ప్రాంతం... వాటి అభివృద్ధికి చేతనైన సాయం చేయాలనేది చిన్నప్పటి నుంచీ నా ఆకాంక్ష. వయసుతో పాటు నాలో సామాజిక చింతన కూడా పెరుగుతూ వచ్చింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబం మాది. మా నాన్న షేక్‌ రెహమాన్‌ లారీ డ్రైవర్‌. అమ్మ మదీనా బీబీ గృహిణి.

నాకు ఇద్దరు అక్కలు. విశాఖలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తయింది. అనంతరం విజయనగరం సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీలో మెడిసినల్‌ కెమిస్ర్టీలో పీజీ చదివాను. ప్రస్తుతం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో సింథటిక్‌ కెమిస్ర్టీలో పీహెచ్‌డీ చేస్తున్నా. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా మా నాన్న మమ్మల్ని చదివిస్తున్నారు. ఆయన ప్రోత్సాహంతోనే ఇక్కడివరకు రాగలిగాను.

సామాజిక స్పృహ...

ఎప్పుడూ మన గురించి మనమే కాదు... తోటివారి గురించి కూడా ఆలోచించాలి. సమాజానికి ఎంతోకొంత తిరిగి ఇవ్వాలి. ఆ లక్ష్యంతోనే చదువుతోపాటు సామాజిక సేవలో కూడా భాగం అయ్యాను. వివిధ స్వచ్ఛంద సంస్థలు, స్నేహితులతో కలిసి హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లోని మురికివాడల్లో పర్యటిస్తున్నాను.

అక్కడి ప్రజలకు పరిశుభ్రత, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నాను. శానిటరీ నేప్కిన్స్‌ పంపిణీ, నిరుపేదలు, వీధుల్లో జీవించేవారికి వస్త్రాలు అందిస్తున్నాను. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన కల్పిస్తున్నాను. మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. తద్వారా పర్యావరణ పరిరక్షణలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించే ప్రయత్నం.


విద్యార్థి ఉద్యమాల్లో...

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి వచ్చాక సామాజిక కార్యక్రమాలు మరింతగా ఊపందుకున్నాయి. దాంతోపాటు విద్యార్థి పోరాటాల్లోనూ భాగమయ్యాను.

ఇటీవల మా యూనివర్సిటీ అధ్యక్ష ఎన్నికల్లో ఏబీవీపీ తరుఫున పోటీ చేశాను. ప్రెసిడెంట్‌ పదవికి పోటిపడిన తొలి ముస్లిం యువతిని నేనే. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయాను. అలాగని చేతులు ముడుచుకుని కూర్చోలేదు. విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉన్నాను.

‘బ్రిక్స్‌’కు అలా...

నాలోని ఈ సేవా భావం, పోరాడే తత్వమే నాకు ‘బ్రిక్స్‌’ (బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల ‘యూత్‌ మినిస్టర్స్‌’ సదస్సులో పాల్గొనే అవకాశం తెచ్చి పెట్టింది. ఈ నెల 22 నుంచి 25 వరకు రష్యాలోని ఉలియనోవ్‌స్క్‌ నగరంలో ఈ సదస్సు జరిగింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆహ్వానం మేరకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలల్లో దరఖాస్తులు వచ్చాయి.

అందులో నుంచి వడపోసి, పధ్నాలుగు మందిని ఎంపిక చేశారు. వారిలో నేనూ ఉన్నాను. సామాజిక సేవా విభాగంలో నన్ను ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సదస్సులో పాల్గొన్నది నేనొక్కదాన్నే. ఇది నాకు ఎంతో గర్వంగా అనిపించింది.


అనూహ్య స్పందన...

సభ ముగింపు రోజు నాకు మాట్లాడే అవకాశం లభించింది. విభిన్న అంశాల్లో సహకరించుకొంటున్న ‘బ్రిక్స్‌’ దేశాలు, యువతకు సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రసంగించాను. ముఖ్యంగా సంస్కృతి, యువ నాయకత్వం పెంపుదల, సామాజిక సేవా కార్యక్రమాలు, వీటిల్లో యువత భాగస్వామ్యంపై పరస్పరం సహకరించుకోవాలని సూచించాను. అందుకు ఒక వేదిక కల్పించాలని ‘బ్రిక్స్‌’ను కోరాను.

ఇది ఆయా దేశాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతం కావడానికి, మరింతమంది యువత సేవ వైపు మళ్లేందుకు దోహదం చేస్తుందని వివరించాను. నా సూచనలకు ప్రతినిధుల నుంచి అనూహ్య స్పందన లభించింది.

ప్రసంగం అనంతరం సభా ప్రాంగణం చప్పట్లతో మర్మోగింది. పలువురు ప్రశంసలు కూడా అందుకున్నాను. నా ప్రతిపాదనలకు ఈ స్థాయిలో మద్దతు లభిస్తుందని అస్సలు అనుకోలేదు. కేంద్ర మంత్రి రక్ష నిఖిల్‌ ఖడ్జే కూడా నన్ను ప్రత్యేకంగా అభినందించారు. ఇది నాలో ఎనలేని స్ఫూర్తి నింపింది. భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలు కొనసాగించడానికి, యువత గొంతుకై నిలబడడానికి ఈ సదస్సు నాకు ప్రేరణ ఇచ్చింది.’’

బి. శ్రీనివాసరావు / ఎం.శివప్రసాద్‌

Updated Date - Jul 29 , 2024 | 04:10 AM