Share News

Navya : అశ్వత్థామ అసలు కథ

ABN , Publish Date - Jul 12 , 2024 | 01:33 AM

మహా భారతం గురించి ప్రస్తావించేటప్పుడు పెద్దగా చర్చకురాని, మరుగున పడిన పాత్రల్లో ఒకరు... అశ్వత్థామ. ఇటీవల ‘కల్కి’ సినిమాతో ఆ పాత్ర సర్వత్రా చర్చనీయాంశమయింది.

Navya : అశ్వత్థామ అసలు కథ

భారతకాలంలోని మహారథుల్లో అశ్వత్థామ. ఒకరు. మహారథి అంటే 60వేల మందితో పోరాడగలిగే శక్తి కలిగినవాడు. అయితే పాండవులన్నా, శ్రీకృష్ణుడన్నా అతనికి ఈర్ష్య. తను మహావీరుడిననీ, శివుడినుంచి వరం పొందినవాడిననీ, దివ్యాస్త్ర సంపన్నుడిననీ అహంకారం. పాండవులను సమూలంగా రూపుమాపాలని ప్రయత్నించిన అతను శాపగ్రస్తుడిగా మిగిలిపోవడానికి దారితీసిన ఘట్టాలు... మహాభారతంలోని ‘సౌప్తిక పర్వం’లో కనిపిస్తాయి.

హా భారతం గురించి ప్రస్తావించేటప్పుడు పెద్దగా చర్చకురాని, మరుగున పడిన పాత్రల్లో ఒకరు... అశ్వత్థామ. ఇటీవల ‘కల్కి’ సినిమాతో ఆ పాత్ర సర్వత్రా చర్చనీయాంశమయింది. అశ్వత్థామ ఎంతటి యోధుడో, అతని స్వభావం ఎలాంటిదో మహాభారతంలో... వివిధ సందర్భాల్లో వ్యాసుడు వివరించాడు. అతని తండ్రి ద్రోణుడు, రాజైన ద్రుపదుడు సహాధ్యాయులు.

అశ్వత్థామ పుట్టిన తరువాత... కుటుంబ పోషణ కోసం ద్రుపదుడి దగ్గరకు వెళ్ళిన ద్రోణుడికి అవమానం జరిగింది. దానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో కురు రాజులను ద్రోణుడు ఆశ్రయించి... పాండవులకు, కౌరవులకు శస్త్రాస్త్ర విద్యల్లో శిక్షణ ఇచ్చాడు. అశ్వత్థామ కూడా తండ్రి దగ్గర విద్యలు నేర్చి మహా వీరుడయ్యాడు. భారతకాలంలోని మహారథుల్లో అతనొకడు.

మహారథి అంటే 60వేల మందితో పోరాడగలిగే శక్తి కలిగినవాడు. అయితే పాండవులన్నా, శ్రీకృష్ణుడన్నా అతనికి ఈర్ష్య. తను మహావీరుడిననీ, శివుడినుంచి వరం పొందినవాడిననీ, దివ్యాస్త్ర సంపన్నుడిననీ అహంకారం. పాండవులను సమూలంగా రూపుమాపాలని ప్రయత్నించిన అతను శాపగ్రస్తుడిగా మిగిలిపోవడానికి దారితీసిన ఘట్టాలు... మహాభారతంలోని ‘సౌప్తిక పర్వం’లో కనిపిస్తాయి.


మహా భారత యుద్ధంలో తను మరణించినట్టు మభ్యపెట్టి... తన తండ్రిని పాండవులు వధించడంతో అశ్వత్థామ ఆగ్రహోదగ్రుడయ్యాడు. నిద్రిస్తున్న ద్రౌపది కుమారులైన అయిదుగురు ఉపపాండవులను, ద్రోణుణ్ణి చంపిన దుష్టద్యుమ్నుణ్ణి సంహరించాడు. ఇది విన్న ద్రౌపది... భీముణ్ణి పంపించి అశ్వత్థామను చంపించకపోతే ప్రాయోప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది. ‘‘అశ్వత్థామ అడవులు పట్టిపోయి ఉంటాడు. అతణ్ణి చంపినట్టు నిదర్శనం ఏమిటి?’’ అని అడిగాడు ధర్మరాజు. ‘‘అతని శిరస్సుపైన సహజమైన రత్నం ఉంది. దాన్ని తెస్తేనే నేను బతుకుతాను’’ అంది ద్రౌపది.

అశ్వత్థామ సంహారానికి భీముడు, అతని రథ సారథిగా నకులుడు బయలుదేరారు. కురుక్షేత్రం దగ్గర ఆగి... ‘‘అశ్వత్థామ ఎక్కడున్నాడో తెలుసా?’’ అని అక్కడివారిని అడిగారు. ‘‘అశ్వత్థామ వ్యాసుడి ఆశ్రమానికి వెళ్ళాడు’’ అని వారు చెప్పారు. ఈలోగా ధర్మరాజును కలవడానికి వచ్చిన శ్రీకృష్ణుడికి విషయం తెలిసింది.

అప్పుడు కృష్ణుడు ‘‘ధర్మరాజా! భీముడు ఒక్కడే వెళ్ళాడా? అది ప్రమాదం. మనం కూడా వెళ్ళడం మంచిది. ఎందుకంటే... అశ్వత్థామ దగ్గర బ్రహ్మశిరోనామకాస్త్రం ఉంది. పుత్రవాత్సల్యంతో దాన్ని ద్రోణుడు అతనికి ఇచ్చాడు. అయితే అశ్వత్థామది కోపిష్టి స్వభావం అని ఆయనకు తెలుసు. కాబట్టి... ఎప్పుడైనా పాండవులమీద దాన్ని ప్రయోగిస్తాడని అనుమానపడ్డాడు.

అందుకే అర్జునుడికి కూడా ఆ అస్త్రాన్ని ఇచ్చాడు. అందుకే అర్జునుడంటే అశ్వత్థామకు ఈర్ష్య. ఆ అస్త్రాన్ని మనుషుల మీద ప్రయోగిస్తే ఎన్నో విపత్తులు కలుగుతాయి. కాబట్టి ‘‘ఎన్ని ఆపదలు ఎదురైనా... వేరే విధంగా తప్పించుకోవాలి తప్ప దీన్ని మాత్రం ప్రయోగించకు’’ అని అశ్వత్థామకు ద్రోణుడు చెప్పాడు. కానీ ఆ మాటలు అతని చెవికెక్కలేదు. అంతేకాదు.. శివుడి వరం వల్ల తనకు మరణం లేదనీ, తన దగ్గర బ్రహ్మశిరోనామకాస్త్రం ఉందనీ, దాంతో ముల్లోకాలనూ కాల్చి బూడిద చెయ్యగలననీ అతనికి అహంకారం.

మీరు అరణ్యవాసంలో ఉన్నప్పుడు... ఒకసారి నా దగ్గరకు అశ్వత్థామ వచ్చాడు. ‘‘ఈ అస్త్రాన్ని నా తండ్రి తపస్సుకు మెచ్చి అగస్త్య మహాముని ఇచ్చాడు. దీన్ని తీసుకొని... నాకు నీ సుదర్శన చక్రం ఇవ్వు’’ అని అడిగాడు. అతని మనసులోని ఉద్దేశం నాకు అర్థమయింది. నా చక్రం, కత్తి, గద చూపించి... ‘‘నువ్వు నీకు ఏది కావాలంటే అది తీసుకో. బదులుగా నువ్వు నాకు ఆ అస్త్రాన్ని ఇవ్వక్కర్లేదు.

ఎందుకంటే స్నేహితుడికి ఏదైనా ఇచ్చినప్పుడు బదులుగా మరొకటి తీసుకోకూడదు’’ అన్నాను. అశ్వత్థామ సంతోషంతో సుదర్శన చక్రాన్ని ఎడమ చేతితో ఎత్తబోయాడు, కుదరలేదు కుడిచేత్తోనూ కదిలించలేకపోయాడు. తన బలమంతా ఉపయోగించి రెండు చేతులతో ప్రయత్నించాడు. కానీ ఎత్తలేక... అలిసిపోయాడు. ‘‘నేను పన్నెండేళ్ళు హిమాలయాల్లో తీవ్రమైన తపస్సు చేసి దీన్ని సంపాదించాను. దీన్ని ఎవ్వరూ... ఆఖరికి అర్జునుడు కూడా కావాలని అడగలేదు. నువ్వు అడిగావు.


ఇంతకీ దీంతో ఎవరిమీద యుద్ధం చేస్తావు?’’ అని అశ్వత్థామను అడిగాను. ‘‘నువ్వు చక్రం ఇస్తే... నిన్ను బతిమాలైనా నీతోనే యుద్ధం చేద్దామనుకున్నాను. అయితే ఈ చక్రం ధరించడానికి నువ్వే తగినవాడివి. ఇది లేకపోయినా నాకు నష్టమేం లేదు. నీతో యుద్ధం చెయ్యడానికి నా దగ్గర ఉన్న మహా అస్త్రాలు చాలు’’ అన్నాడు. అతనిలో అంత మహా అహంకారానికి కారణం... బ్రహ్మశిరోనామకాస్త్రం. అతను అధర్మ ప్రవర్తకుడు. క్రూరకర్మలు చేసేవాడు. భీముడికి ఏమైనా కావచ్చు’’ అంటూ ధర్మరాజు, అర్జునులతో కలిసి బయలుదేరాడు శ్రీకృష్ణుడు.

వ్యాసుడి ఆశ్రమానికి ఉద్రేకంగా వెళ్తున్న భీముణ్ణి వాళ్లు చూశారు. వాళ్ళు ఆగమన్నా భీముడు ఆగలేదు. ఆశ్రమంలో ఒక చోట... అశ్వత్థామ తపస్సులో ఉన్నాడు. పెద్దగా అరుస్తూ తనవైపు వస్తున్న భీముణ్ణి, అతని వెనకు అర్జునుణ్ణి, ధర్మరాజును చూశాడు అశ్వత్థామ. అంతకుముందు రాత్రి తాను చేసిన ఘోరాలు గుర్తుకువచ్చాయి. అతనిలో అధైర్యం మొదలైంది. వెంటనే రెల్లు పరక తీసుకున్నాడు. బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని దానిలో ఆవహింపజేశాడు. ‘అపాండవం కావాలి’ అనుకుంటూ ప్రయోగించాడు. ఆ బాణంలోంచి పుట్టిన మహాగ్ని... అన్ని దిక్కులకూ మహోగ్రంగా విజృంభించింది.

ఇది చూసిన కృష్ణుడు ‘‘అర్జునా! అది మరో అస్త్రంతో ఆగదు. నువ్వు కూడా ఆ అస్త్రాన్నే ప్రయోగించు. నిన్నూ, నీ సోదరులనూ రక్షించుకో’’ అన్నాడు.

అర్జునుడు తన గురువైన ద్రోణుణ్ణి స్మరించి... అస్త్రాన్ని అస్త్రం హతమార్చాలి అనుకుంటూ ప్రయోగించాడు. అది వెళ్ళి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని ఢీకొన్నాయి. దీంతో మూడు లోకాల్లో అల్లకల్లోలం చెలరేగింది. జరగబోయే మహోత్పాతాన్ని గుర్తించిన నారదుడు... వ్యాసాశ్రమంలో ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడితో కలిసి అర్జునుణ్ణీ, అశ్వత్థామను శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. ‘‘ఈ భూమి మీద ఎందరో వీరులు పుట్టారు, మరణించారు. మనుషుల మీద ఎవరైనా బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించారా?’’ అని మునులిద్దరూ ప్రశ్నించారు.


అప్పుడు అర్జునుడు ‘‘అస్త్రంతో అస్త్రాన్ని శాంతింపజేయడం కోసం... మరో మార్గం లేక దీన్ని ప్రయోగించాను. మీరు కోరితే ఉపసంహరిస్తాను. కానీ అతను మమ్మల్ని దహించేస్తాడు. మా క్షేమం మీరే చూడాలి’’ అంటూ అస్త్రాన్ని ఉపసంహరించాడు. నిజానికి ఆ అస్త్రాన్ని ప్రయోగించాక.... ఉపసంహరించడం దేవతల వల్ల కూడా కాదు. అలా ఉపసంహరించినవాళ్ళను అది చంపుతుంది. కానీ గురుభక్తి, తపశ్శక్తి కలిగినవాడు, దానగుణం, సత్యశీలత ఉన్నవాడు కాబట్టి అర్జునుడు ఆ పని చేయగలిగాడు. అది చూసిన మునులు ఆశ్చర్యపోయారు.

అశ్వత్థామ కూడా ఉపసంహరించబోయాడు. కానీ సాధ్యం కాలేదు. అప్పుడు వ్యాసుడితో... ‘‘భీముడు అధర్మ యుద్ధంలో దుర్యోధనుణ్ణి చంపాడు. ఇప్పుడు నన్ను చంపడానికి వచ్చాడు. ఆ ఆగ్రహంతో... ప్రాణభయంతో నాకు మతిపోయి ఈ అస్త్రాన్ని ప్రయోగించాను. అది పాండవ సంతతినంతటినీ తుడిచిపెట్టేస్తుంది. అది పాపమైనా సరే నేను భరిస్తాను’’ అన్నాడు అశ్వత్థామ.

‘‘శిష్యుడనే వాత్సల్యంతో అర్జునుడికి నీ తండ్రి ఆ అస్త్రాన్ని ఇచ్చాడు. దాన్ని నీకు హాని కలిగించడం కోసం కాకుండా... నీ అస్త్రం ఉపశమించేలా చెయ్యడానికే అర్జునుడు ప్రయోగించాడు. మేము వద్దని చెప్పగానే ఉపసంహరించాడు. ఈ మహాస్త్రాన్ని మనుషుల మీదకు ప్రయోగించినవారికి కీడు తప్పదు. ఇప్పుడు నీ అస్త్రం అతని అస్త్రంతో అణగారిపోతుంది. అది జరిగిన దేశంలో పన్నెండేళ్ళు వానలు పడవు. కాబట్టి దాన్ని అలాగైనా ఉపసంహరించు. నీ శిరోరత్నాన్ని అర్జునుడికి ఇవ్వు. ఇదే సంధి మార్గం’’ అని హితవు చెప్పాడు వ్యాసుడు.

‘‘కౌరవుల సంపద అంతటినీ లాక్కున్న పాండవులకు రత్నాలకు కరువా? ఈ రత్నం ఉంటే దేవ రాక్షసులు, జంతువులు, చోరుల భయం ఉండదు. ఆకలి, దాహం, నిద్ర, అనారోగ్యాలు బాధించవు. అలాంటి రత్నం వీళ్ళకు ఎందుకు ఇవ్వాలి? కానీ నువ్వు ఆజ్ఞాపించావు కాబట్టి ఇచ్చేస్తాను. కానీ నా అస్త్రం మాత్రం పాండవ స్త్రీల గర్భాలను నాశనం చేసి కాని శాంతించదు’’ అన్నాడు అశ్వత్థామ.

‘‘అలాగే... అయితే మరో దానికి మాత్రం ఆశపడకు’’ అన్నాడు వ్యాసుడు.

ఆయన మాటల్లోని అర్థాన్ని అశ్వత్థామ గ్రహించాడు. ‘అది మాత్రం ఎందుకు వదిలెయ్యాలి? అన్నిటినీ అంతం చేస్తాను’ అని మనసులో అనుకున్నాడు. కానీ ‘‘అలాగే చేస్తాను’’ అని వ్యాసుడితో చెప్పాడు.

కృష్ణుడికి విషయం అర్థమయింది. ‘వ్యాసుడికి మాట ఇచ్చినట్టే ఇచ్చి.. తనకు నచ్చినట్టు చేస్తాడు. దీన్ని నేను ఆపుతాను’ అనుకున్నాడు మనసులో. ‘‘పాండవుల సంతతిని నాశనం చేసి పాపానికి ఒడిగడుతున్నావు. గర్భాలన్నీ నాశనం చేస్తున్నావు. వాళ్ళకు ఒక్క వంశాంకురాన్నైనా మిగుల్చు. ఆ ఒక్క గర్భాన్ని నీ అస్త్రంతో నాశనం కాకుండా ఆపు’’ అన్నాడు అశ్వత్థామతో.

‘‘ఉత్తర గర్భాన్ని కాపాడాలని నువ్వు అనుకుంటున్నావని నాకు తెలుసు. నేను మాత్రం వదిలిపెట్టను’’ అని స్పష్టం చేశాడు అశ్వత్థామ.

‘‘నువ్వు నాశనం చేసినా నేను రక్షించి, దీర్ఘాయువు పోస్తాను’’ అన్నాడు కృష్ణుడు.

‘‘అస్త్రంతో తగలబడిపోయేవాణ్ణి బతికిస్తానంటున్నావ్‌. నువ్వెంత నేర్పరివో చూద్దాం’’ అంటూ ‘పాండవ స్త్రీల గర్భాలన్నీ నాశనం కావాలి’ అని అనుకొని అశ్వత్థామ ఆ అస్త్రాన్ని వదిలిపెట్టాడు.


‘‘నీ కళ్ళముందే ఆ బిడ్డ, అతని వంశం కళకళలాడుతూ ఉంటుంది. నేను ఆ బిడ్డని రక్షిస్తాను. నిన్ను మాత్రం... గర్భంలో ఉన్న పిల్లల్ని చంపిన పాపం కట్టికుదుపుతుంది. తిండిలేక అల్లాడతావు. దుర్వాసనతో ఉండే రక్తాన్ని శరీరానికి పూసుకొని మూడువేల ఏళ్ళు దేవులాడుతూ ఉంటావు’’ అంటూ శ్రీకృష్ణుడు శపించాడు.

వ్యాసుడు కూడా అశ్వత్థామకు శాపం ఇస్తూ... ‘‘ఇంతటి పాతకానికి పాల్పడ్డావు. నా మాటను లెక్క చెయ్యలేదు. తిండీ తిప్పలు లేకుండా, ఎటువంటి సహాయం లేకుండా... మూడు వేల ఏళ్ళు దుర్గంధమైన రక్తంతో భూమి మీద తచ్చాడుతూ ఉంటావు’’ అన్నాడు.

‘‘నువ్వూ చిరంజీవివే. మనుషులలోనే ఉంటావు.

నేను నీ దగ్గరే ఉంటాను...’’ అని వ్యాసుడికి చెబుతూ...

తన శిరోరత్నాన్ని పాండవులకు ఇచ్చేసి, తపోవనంలోకి నడిచాడు అశ్వత్థామ. గత యుగాల నుంచి భూమిమీద ఇప్పటికీ మిగిలి ఉన్న ‘చిరంజీవులు’గా పురాణాలు

వర్ణించిన వారిలో అశ్వత్థామ ఒకరు. వారిలో శాపగ్రస్తుడు మాత్రం అతనొక్కడే.

Updated Date - Jul 12 , 2024 | 01:33 AM