Share News

Navya : ఈ పరుగు... నాన్న కల కోసమే!

ABN , Publish Date - Jul 20 , 2024 | 05:48 AM

ఈ అమ్మాయి.. పదమూడేళ్ల వయసులో స్కూల్‌ రన్నింగ్‌ పోటీల్లో పాల్గొని ఓడిపోయింది. ‘ఓడిపోయినా పర్వాలేదు.. మళ్లీ గెలవొచ్చు’ అంటూ భుజం తట్టారు ఆ అమ్మాయి తండ్రి శ్రీనివాసరావు. ఓడిన ఆ అమ్మాయే..

Navya : ఈ పరుగు... నాన్న కల కోసమే!

ఈ అమ్మాయి.. పదమూడేళ్ల వయసులో స్కూల్‌ రన్నింగ్‌ పోటీల్లో పాల్గొని ఓడిపోయింది. ‘ఓడిపోయినా పర్వాలేదు.. మళ్లీ గెలవొచ్చు’ అంటూ భుజం తట్టారు ఆ అమ్మాయి తండ్రి శ్రీనివాసరావు. ఓడిన ఆ అమ్మాయే.. ఆగష్టు తొమ్మిదో తేదీ పారిస్‌ ఒలింపిక్స్‌లో రన్నింగ్‌ చేయటానికి రెడీగా ఉంది. పేరు జ్యోతిక శ్రీ. ప్రస్తుతం పోలెండ్‌లో ఉన్న ఈ రన్నర్‌ తన పరుగుల ప్రయాణాన్ని ‘నవ్య’తో పంచుకుందిలా...

‘పోలెండ్‌లోని ఇండియా క్యాంప్‌లో ఉన్నా. ఐదు రోజులయ్యింది ఇక్కడికొచ్చి. ముఖ్యంగా యూరప్‌ వాతావరణానికి అలవాటు పడవచ్చు. విదేశీ కోచ్‌ల శిక్షణ ఉంటుంది. ఇక్కడినుంచి ఒలింపిక్స్‌ వేదిక పారిస్‌కి దగ్గర కూడా. ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో పుట్టిన నేను.. ఒలింపిక్స్‌ దాకా వచ్చానంటే.. నమ్మశక్యం కాదు. అయితే నాన్న ఎప్పుడో నమ్మారు. ప్రపంచ స్థాయికి వెళ్తానని నాన్న కల కన్నారు. అదే నిజమైంది.

నాన్న ప్రోత్సాహకానికి మాటల్లేవు...

పదమూడేళ్ళ వయసులో మా స్కూల్‌లో పీఈటీ వంద మీటర్ల పరుగు పందేనికి నన్ను ఎంపిక చేశారు. నాకు చదువంటేనే ఆసక్తి. తప్పదు కాబట్టి పోటీల్లో పాల్గొన్నా. నాలుగో స్థానం వచ్చింది. పరుగులో ఓడిపోయా. ‘గెలిచిన ముగ్గురుకీ ఆయాసం వచ్చింది. నాకేమీ రాలేదు నాన్న. నేను ఇంకా పరిగెత్తుతా’ అన్నాను. అంతే.. ‘ఇది ఓటమి కాదు. నువ్వు మరింత వేగంగా పరిగెత్తగలవు. వెయ్యి మీటర్లు కూడా పరిగెత్తే సత్తా నీది’ అన్నారు నాన్న. సీతారామయ్య సర్‌ దగ్గరకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పించారు. నాన్న పెద్దగా చదువుకోలేదు. బీరువాలు తయారు చేసే వర్క్‌షాప్‌. ఈ ఆటలేందీ? అని కొందరు అన్నారు.

అవేమీ పట్టించుకోలేదు. మంచి శిక్షణ ఇప్పించారు. జోనల్‌ చాంపియన్‌ షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ వచ్చింది. వైజాగ్‌లో జాతీయ స్థాయి పోటీ జరిగింది. అందులో తప్పుగా 400 మీటర్లు రాయకుండా.. వెయ్యి మీటర్ల పరుగు పందెం అని రాశారు. దీంతో పరిగెత్తా.


కాంస్య పతకం గెలుచుకున్నా. ఆ తర్వాత 400 మీటర్లు పరుగుపందెం నేషనల్స్‌ స్థాయిలో కేరళలో జరిగింది. అక్కడ రజత పతకం సాధించాను. వీటివల్ల టర్కీలోని ప్రపంచగేమ్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌కు అర్హత సాధించా. ఇందుకోసం మా స్థానిక ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణగారు లక్ష రూపాయలు సాయం అందించారు. నాకు పదో తరగతిలో 9.7 శాతం గ్రేడింగ్‌ వచ్చింది. పదికి పది రాలేదని బాధపడ్డా. ‘నీకు జాతీయస్థాయిలో రెండు పతకాలు వచ్చాయి. రాష్ట్రస్థాయి చదువుల్లో మూడు శాతం తగ్గినా.. ఇబ్బంది లేదు. నీకు ఇంకా మంచి భవిష్యత్‌ ఉంది’ అంటూ నాన్న ప్రోత్సహించారు.

ప్రతి గెలుపులో నాన్న ఉన్నారు...

మా అమ్మ పేరు లక్ష్మి నాగ వెంకటేశ్వరి. నాకో అక్క ఉంది. తన పేరు కీర్తి సత్యశ్రీ. మా నాన్నగారు బాడీబిల్డింగ్‌లో రాష్ట్రస్థాయిలోనూ పాల్గొన్నారు. అయితే ఆర్థిక పరిస్థితి వల్ల తన కలను వదిలేశానని చెప్పేవారు. ఆటల్లోనే నువ్వు పేరు తెచ్చుకోవాలమ్మా అనేవారు. నాన్న మాటే.. నాకు వేదం. నా ప్రతి గెలుపులో నాన్న ఉన్నారు. పదోతరగతి తర్వాత ఇంటర్‌ చదవడానికి విజయవాడకు వెళ్లా. ఖర్చులు ఎక్కువయ్యాయి. అయినా శిక్షణ ఇప్పించారు. కోచ్‌ వినాయక్‌ ప్రసాద్‌ శిక్షణలో రాటుదేలాను. అండర్‌ 18 విభాగంలో జూనియర్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌ షిప్‌ కొట్టాను. గోల్డ్‌ మెడల్‌ సాధించా. నాన్న ఆనందానికి అవధుల్లేవు. హైదరాబాద్‌లోని ప్రముఖ కోచ్‌ నాగపురి దగ్గర చేరి మెళకువలు తెలుసుకున్నా.


మాకోసం జీవితం అంకితం...

ఆసియన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌ వరల్డ్‌ రిలేలో సత్తా చాటాను. అప్పుడే మోకాలి నొప్పి వల్ల ఇబ్బంది పడ్డాను. అందుకే ఆసియన్‌ గేమ్స్‌ ఆడలేకపోయా. గాయం మానిన తర్వాత ఫిట్‌నెస్‌ సాధించా. ఒలింపిక్స్‌కు అర్హత సాధించటం చాలామంది క్రీడాకారులకు జీవితకాలం కల. నాన్న గురించి ఇంకో విషయం చెప్పాలి. గతేడాది మా ఇంటిని అమ్మారు. అక్క పెళ్లి చేశారు. నాకోసం తెచ్చిన అప్పులను కట్టారు. మేం రేకుల షెడ్డులో ఉంటున్నాం... అదికూడా మా వర్క్‌షాప్‌లో. ఇప్పుడు చెప్పండి? మా నాన్న మిగతా వారికంటే ప్రత్యేకమే కదా! మాకోసం జీవితాన్ని అంకితం చేశారు. 400 మీటర్లు రిలే పరుగు పందెంలో ఒలింపిక్‌ పతకాన్ని గెలవాలన్నది మా నాన్న కల. అదే నా కల’’.

పి.సి.హెచ్‌. కృష్ణమూర్తి, తణుకు

నేను బాడీబిల్డర్‌ను. జిల్లా స్థాయిలో సత్తా చాటాను. అబ్బాయి పుడితే మిస్టర్‌ ఇండియా చేయాలనుకున్నా. నాకు ఇద్దరు అమ్మాయిలు. జ్యోతిక శ్రీ.. మా చిన్నమ్మాయి. ఏదైనా సాధించాలనే మొండిఘటం. కష్టపడుతుంది. సాధన చేస్తుంది. గత రెండేళ్లనుంచీ ఇండియన్‌ కోచ్‌లు, విదేశీ కోచ్‌ల నిర్వహణలో రోజుకు ఆరుగంటలు శిక్షణ తీసుకుంది. ఇల్లు అమ్ముకున్నా.. రేకుల షెడ్డులో ఉంటున్నా... నాకెలాంటి బాధలేదు. సంతృప్తిగా ఉంది. మా అమ్మాయి నేను ఊహించిన దానికంటే మెరుగైన విజయాలు అందుకుంది. యూరప్‌కు బయలుదేరేముందు ‘పతకంతో వస్తాను నాన్న’ అన్నది. ఫలితాలు ఎలా ఉంటాయో మనకు తెలీదు. అయితే నా బిడ్డ ఒలింపిక్స్‌ దాకా వెళ్లింది. తండ్రిగా గర్వపడుతున్నా! ఇంతకంటే నాకేం కావాలి?

- దండి శ్రీనివాసరావు

Updated Date - Jul 20 , 2024 | 06:17 AM