Share News

Thangalaan : ఆ తరహా సినిమాలెవ్వరూ తీయలేదు

ABN , Publish Date - Aug 17 , 2024 | 11:30 PM

హీరో కొత్తవాడైనా, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అయినా... తన సిద్ధాంతాలకు అంగుళం కూడా పక్కకు జరగకుండా కథ నడిపించే విలక్షణ దర్శకుడు పా.రంజిత్‌. ‘తంగలాన్‌’తో సరికొత్త ప్రపంచాన్ని వెండి తెరపై ఆవిష్కరించిన ఆయన ‘నవ్య’తో పంచుకున్న సినీ విశేషాలు...

Thangalaan : ఆ తరహా సినిమాలెవ్వరూ తీయలేదు
విలక్షణ దర్శకుడు పా.రంజిత్‌

హీరో కొత్తవాడైనా, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అయినా... తన సిద్ధాంతాలకు అంగుళం కూడా పక్కకు జరగకుండా కథ నడిపించే విలక్షణ దర్శకుడు పా.రంజిత్‌. ‘తంగలాన్‌’తో సరికొత్త ప్రపంచాన్ని వెండి తెరపై ఆవిష్కరించిన ఆయన ‘నవ్య’తో పంచుకున్న సినీ విశేషాలు...

‘తంగలాన్‌’కు ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?

మేము ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్‌ వస్తోంది. మన సమాజంలోని అన్ని వర్గాల వారు ఈ సినిమాను చూసి ప్రశంసిస్తున్నారు. మేము చెప్పాలనుకున్న విషయాన్ని వారు అర్థం చేసుకుంటున్నారు. నా ఉద్దేశంలో ఇలాంటి సినిమాను ఇప్పటిదాకా ప్రేక్షకులు చూడలేదు. ఇదొక కొత్త తరహా సినిమా.

మీరు తీసే సినిమాలు, వాటిలో. చెప్పే కథలు భిన్నంగా ఉంటాయి. మీరు ఈ తరహా కథలను ఎంచుకోవటానికి కారణమేదైనా ఉందా?

నేను ఒక సినిమాను ‘ఎందుకు తీయాలనుకుంటున్నాను’ అని ప్రశ్న వేసుకున్నప్పుడు - ‘నా కథను నేను ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నాను’ అనే సమాధానం వస్తుంది. ‘నా కథను ఎందుకు చెప్పాలనుకుంటున్నాను?’ అని మళ్లీ ప్రశ్న వేసుకుంటే - ‘ఇతరులు ఎవరు నా కథను సినిమా రూపంలో తీయరు కాబట్టి...’ అనే సమాధానం లభిస్తుంది. సుమారు వందేళ్ల సినిమా చరిత్రలో- ఈ తరహా సినిమాలను ఎవరు తీయలేదు. అందువల్ల సినిమాల దర్శకత్వ విషయంలో ‘నా పాత్ర ఏమిటి?’ అనే విషయాన్ని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటాను.

మీ సినిమా ప్రస్థానం ఎలా మొదలైంది?

నేను కాలేజీలో చదువుకొనే రోజుల్లో పెయింటర్‌ అవ్వాలనుకొనేవాడిని. ఆ సమయంలో నేను కొన్ని ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కు వెళ్లాను. అక్కడ అనేక విదేశీ సినిమాలు చూశాను. అవి ఆ దేశ సంస్కృతి సంప్రదాయాలను, రాజకీయ సిద్ధాంతాలను, సమాజంలోని వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేవి. అయితే అవి నేను చూసిన తమిళ సినిమాలకు భిన్నంగా ఉండేవి. ‘ఈ సినిమాలు భిన్నంగా ఎందుకు ఉన్నాయి?’ అనే ప్రశ్న నన్ను తొలిచివేయటం మొదలెట్టింది. నా దేశం గురించి, ప్రజల గురించి, సంస్కృతి గురించి పుస్తకాలు, కథలు చదవటం ప్రారంభించాను. రకరకాల రాజకీయ సిద్ధాంతాల గురించి తెలుసుకున్నాను ఈ క్రమంలో నన్ను బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ సిద్ధాంతాలు, కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల అమితంగా ప్రభావితుడినయ్యాను. అంబేడ్కర్‌ నాకు చాలా నేర్పారు. ఆయన సిద్ధాంతాలలో ఉన్న సారాన్ని, నా జీవితాన్ని ప్రజలకు సినిమా రూపంలో చెప్పాలని నిర్ణయించుకున్నా. అంబేడ్కర్‌ అప్పటి దాకా ఉన్న దారి నుంచి బయటకు వచ్చి... ఒక కొత్త పంథాను చూపించారు. రకరకాల పద్ధతులను అనుసరించారు. ఆయన రాజకీయాలను నేను అవగాహన చేసుకున్నాను. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి. కళలు, ప్రజలు ఎందుకు కలసి పనిచేయాలనే విషయంపై మావో అనేక పుస్తకాలు రాశారు.

తొలి రోజుల్లో మీరు అనుకున్న రీతిలో సినిమా తీయటం సులభమయిందా? ఏవైనా కష్టాలు ఎదురయ్యాయా?

నేను సినిమా రంగానికి రాకముందు ‘సినిమా తీయటం ఇంత సులభమా?’ అనిపించేది. నాకు అనేక ఆలోచనలు ఉండేవి. సినీ రంగానికి వచ్చిన తర్వాత సినిమా తీయటం ఎంత కష్టమో అర్థమయింది. తొలి రోజుల్లో నేను వెంకట ప్రభు అనే డైరక్టర్‌ దగ్గర పనిచేశా. ఆయన నాకు విపరీతమైన స్వేచ్ఛను ఇచ్చారు. నేను అనేక విషయాలు ఆయనతో చర్చించేవాడిని. అప్పుడే నేను సినిమాలు చేయగలననే నమ్మకం వచ్చింది. నా తొలి సినిమా - నా కథే! ఆ తర్వాత ‘అట్టకత్తి’, ‘మద్రాసు’ సినిమాలు తీశాను.

మీ తరహా కథలను చెప్పి స్టార్స్‌ను ఒప్పించటం కష్టమయిందా?

మొదట్లో చాలా కష్టమయ్యేది. వాస్తవానికి మొదట్లో నాకు పెద్ద నటులతో సినిమా తీయాలని ఉండేది కాదు. ఎందుకంటే వారు నా కథల్లో కలగజేసుకొనే అవకాశం ఉంది. అంతే కాకుండా నా దగ్గర మాస్‌ మసాలా స్టోరీలు కూడా ఏవీ లేవు. అందువల్లే మొదట్లో నేను ఒక మంచి ప్రొడ్యుసర్‌ కోసం వెతికేవాడిని. అదృష్టవశాత్తు నాకు సి. కుమార్‌ దొరికారు. ఆయనకు కూడా సినీ రంగం కొత్తే! మేమిద్దరం కలిసి ‘అట్టకత్తి’ తీశాం. దీనితో నాకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ‘మద్రాసు’ స్ర్కిప్ట్‌ తయారుచేసుకున్నా. ఇది పూర్తిగా పొలిటికల్‌ ఫిల్మ్‌. ముందు కార్తీతో చేద్దామనుకున్నాం.

కానీ ఆయన బిజీగా ఉండటం వల్ల డేట్స్‌ కుదరలేదు. ఇతర హీరోలకు చెప్పాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పెద్ద హీరోలతో చేయాలంటే- కాంబినేషన్స్‌ కుదరాలి. హీరోలకు టెక్నీషియన్స్‌ విషయంలో కొన్ని చాయి్‌సలు ఉంటాయి. వాటినే కోరుకుంటారు. కానీ నేను నా టీమ్‌తోనే చేయాలని అనుకునేవాడిని. చివరకు మళ్లీ కార్తీనే పెట్టుకున్నాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. నా తరహా సినిమాలకు ఒక మోడల్‌ లేదు. అంటే అవి ఆడుతాయో లేదో, వాటిని ఎన్ని డబ్బులు వస్తాయో తెలీదు. కాబట్టి అందరూ భయపడేవారు. ‘మద్రాసు’ ఒక మోడల్‌ను క్రియేట్‌ చేసింది. ఆ తర్వాత నాతో పనిచేయటానికి అనేకమంది ముందుకు వచ్చారు.

‘కాలా’, ‘కబాలి’ - ఈ రెండు సినిమాలలో- సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో పనిచేశారు కదా! మీ అనుభవాలేమిటి?

రజనీకాంత్‌ సార్‌తో పనిచేయటం భిన్నంగా ఉంటుంది. నేను ఆయన సినిమాలు చాలా చూశాను. కానీ ఆయనతో సినిమా చేసేముందు ఆయనను ఒక స్టార్‌ అనుకోలేదు. ఒక ఆర్టిస్టు అనుకున్నానంతే! ‘కబాలి’లో నేను ఎలా అనుకున్నానో ఆయన ఆలా చేశారు. నేను తొలిసారి ఆయనకు ‘కబాలి’ స్ర్కిప్ట్‌ చెప్పినప్పుడు ఆయన చాలా ఎగ్జైట్‌ అయ్యారు. ‘‘దీనిలో నాకు వయస్సు ఎక్కువ. నాకు ఎలాంటి డ్యూయెట్స్‌ లేవు. ఎక్కువ ఫైట్స్‌ లేవు. పైగా నాకో కూతురు ఉంది. వాస్తవానికి దగ్గరగా ఉంది. నేను ఫ్రెష్‌గా చేద్దామనుకుంటున్నా. ఈ కథ తప్పకుండా చేస్తా’’ అన్నారు. అయితే అక్కడ ఆయనకు నేను ఒక షరతు పెట్టాను. ‘‘సర్‌... ఇది నా స్ర్కిప్ట్‌. దీనిలో ఎలాంటి మార్పులు చేయను. మీకు ఇష్టమయితే చేద్దాం. లేకపోతే ఇక్కడితో వదిలేద్దాం’’ అన్నాను. ఆయన నా షరతుకు అంగీకరించారు. ఆ సినిమాలో ఆయన నాకు పూర్తిగా సహకరించారు. ‘కబాలి’ తర్వాత ఆయన పేరు మరింత పెరిగింది. సినిమా హిట్‌ అయిన తర్వాత ఆయన దగ్గరకు వెళ్తే- ‘‘నీతో తొమ్మిది సినిమాలు చేయాలనుంది. చేద్దామా’’ అన్నారు. నేను షాక్‌ తిన్నా. ‘కాలా’ తర్వాత కూడా ఆయన అదే మాట మీద ఉన్నారు. ఆయనకు నా రాజకీయ సిద్ధాంతాలు, పనితీరు అర్థమయ్యాయి.

త్వరలో ఏ సినిమాలు చేయబోతున్నారు?

‘తంగలాన్‌’ విజయాన్ని ఆస్వాదిస్తున్నా. తమిళంలో ఒకటి, హిందీలో ఒకటి సినిమాలు చేయాలి. హిందీలో ‘బిర్సా ముండా’ జీవిత కథను తీస్తున్నా.


నిర్మాణాత్మకమైన విమర్శను నేను ఎప్పుడూ కోరుకుంటాను. దాని నుంచి నేర్చుకుంటాను. విమర్శ నన్ను తీర్చిదిద్దుతుంది. అయితే బాధ్యత లేకుండా చేసే విమర్శలను నేను పట్టించుకోను. ఎవరైనా నన్ను అన్నప్పుడు బాధపడతాను.

నా ఆలోచనలను ఎటువంటి ఫిల్టర్స్‌ లేకుండా చెప్పగలటమే స్వేచ్ఛ అంటే! అయితే అది చాలా కష్టమైన విషయం. అన్నిసార్లు నేను అనుకున్నది చెప్పలేను.

ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశానికి అంబేడ్కర్‌ దృష్టి కోణం చాలా అవసరం. అంబేడ్కర్‌ ఒక ఆధునిక భారత దేశాన్ని నిర్మించాలని అనుకున్నాడు. కుల వ్యవస్థను కూకటి వేళ్లతో సహా పెకిలించాలనుకున్నాడు. వ్యవస్థను సంపూర్తిగా మార్చాలనుకున్నాడు. ఆయన నిర్మించాలనుకున్న ఆధునిక భారతంలో ఎటువంటి అసమానతలు ఉండవు. ‘క్యాస్ట్‌ ఇన్‌ ఇండియా’ లాంటి పుస్తకాలు చదివితే మనకు ఆయన దృష్టి కోణం అర్థమవుతుంది. ‘‘మేము ఆధునికులం’’ అని చెప్పుకొనేవారిలో ఎక్కువమంది ఆయన పుస్తకాలను చదవరు. చాలామంది ఆయన దళితుల కోసం మాత్రమే అనుకుంటారు. అది చాలా తప్పు. ఆయన ఆధునిక భారత దేశ ప్రజలందరివాడు.

హైరార్కీని తొలగించాలనుకుంటాను. మానవ వ్యవస్థ నన్ను నిలవనివ్వదు. దీని నుంచి బయటకు వెళ్లిపోవాలనుకుంటాను. ఎటువంటి హైరార్కీని నేను సహించలేను. కొన్నిసార్లు మనకు తెలియకుండానే హైరార్కీలో నివసిస్తూ ఉంటాం. అలాంటి సమయాల్లో నన్ను నేను సరిచేసుకుంటూ ఉంటా. ఇది జీవితాంతం నిరంతరంగా జరిగే ప్రక్రియ. దీన్ని ప్రాక్టీస్‌ చేయటం చాలా కష్టం.

కులం ఆధునికతను అల్లుకుపోతోంది. కులం అనేది మనకు పల్లెటూర్లలో కనిపిస్తుంది. పట్టణాలలో పైకి కనిపించదు. మన దేశంలో నివసించే ప్రతి వ్యక్తిలోను ఈ కుల భావన ఉంటుంది. చాలామందికి కులం ఒక సంపద లాంటిది. ఇది హోదా ఇస్తుంది. అందువల్లే దాన్ని వదలుకోవటానికి ఎవరు ఇష్టపడరు. నా ఉద్దేశంలో అంబేడ్కర్‌ సిద్ధాంతాలను అనుసరిస్తే- దీన్ని సమూలంగా నిర్మూలించగలం.

సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - Aug 18 , 2024 | 05:14 AM