Share News

Parenting : పిల్లలతో ఎలా మాట్లాడాలి?

ABN , Publish Date - Oct 19 , 2024 | 05:04 AM

పిల్లలతో మాట్లాడడం, వాళ్లచేత మాట్లాడించడం ఒక కళ. ముఖ్యంగా అయిదు నుంచి పదేళ్ల మధ్య వయసు పిల్లలతో అయితే మరీ సున్నితమైన అంశమనే చెప్పాలి. ఈ వయసు పిల్లలు కనిపించిన ప్రతీదాని గురించి ప్రశ్నిస్తూ వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

Parenting : పిల్లలతో ఎలా మాట్లాడాలి?

పేరెంటింగ్‌

పిల్లలతో మాట్లాడడం, వాళ్లచేత మాట్లాడించడం ఒక కళ. ముఖ్యంగా అయిదు నుంచి పదేళ్ల మధ్య వయసు పిల్లలతో అయితే మరీ సున్నితమైన అంశమనే చెప్పాలి. ఈ వయసు పిల్లలు కనిపించిన ప్రతీదాని గురించి ప్రశ్నిస్తూ వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలోనే మాట్లాడడం నేర్చుకుంటారు. తల్లిదండ్రులు పిల్లల ప్రశ్నలకు సమాధానాలిస్తూ వాళ్లని కూడా మాట్లాడనివ్వాలి. సంభాషణను మధ్యలోనే ముగించే ప్రయత్నం చేయకూడదు. పిల్లలు మాట్లాడుతూ దగ్గరకు వచ్చినపుడు వారిని గమనిస్తూ చిరునవ్వుతో స్వాగతించాలి. ప్రశాంతంగా వాళ్లు చెప్పే మాటలు వినాలి. అప్పుడే పిల్లలు తమ భావాలను తల్లిదండ్రులతో పంచుకోవడం అలవాటు చేసుకుంటారు. పిల్లలు అల్లరి చేయడం సహజం. ఇది అందరికీ తెలిసిందే! అయినా కొంతమంది తల్లిదండ్రులు పరుషమైన పదాలతో పిల్లలపై తమ కోపాన్ని విసుగును ప్రదర్శిస్తుంటారు. దీనివల్ల పిల్లలు స్తబ్దుగా మారే ప్రమాదముంది. ఇలా కాకుండా పిల్లలతో ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? అనే అంశాలు తెలుసుకుందాం!

  • పిల్లలు స్కూల్‌ నుంచి ఇంటికి రాగానే ఆ రోజు జరిగిన విషయాలన్నీ తల్లిదండ్రులతో చెప్పాలనుకుంటారు. వాళ్లని చెప్పనివ్వాలి. మధ్యలో మాట్లాడుతూ పిల్లలను తప్పు పట్టడం, వాళ్లని కోప్పడడం చేయకూడదు. ఇలా చేస్తే పిల్లలు స్కూల్‌ విషయాలు ఇంట్లో చెప్పడానికి ఆసక్తి చూపరు.


  • స్కూల్‌ నుంచి కానీ, తోటి పిల్లల తల్లిదండ్రుల నుంచి కానీ, ఇరుగు-పొరుగు వారి నుంచి కానీ ఏదైనా కంప్లయింట్‌ వచ్చినపుడు వెంటనే పిల్లలను తప్పు పట్టకూడదు. కంప్లయింట్‌ ఇచ్చినవారికి సామరస్యంగా సర్దిచెప్పాలి. పిల్లలను దగ్గరికి పిలిచి వారితో సౌమ్యంగా మాట్లాడుతూ అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పిల్లల తప్పు ఉంటే ఇంకోసారి అలా చేయకుండా బుజ్జగింపు ధోరణిలో నచ్చచెప్పాలి. పిల్లలపై తమకున్న ప్రేమను తెలుపుతూ మాట్లాడాలి.

  • పిల్లలను ప్రతిదానికీ విమర్శించడం, కఠినమైన పదాలతో తిట్టడం, ఏ పనిచేసినా వాళ్లని తక్కువ చేయడం, తోటి పిల్లలతో పోల్చడం, వాళ్లపై నెగెటివ్‌ కామెంట్స్‌ చేయడం, వెటకారంగా మాట్లాడడం వల్ల వాళ్లలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఆత్మన్యూనత, ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. తల్లిదండ్రులపై ద్వేషభావం ఏర్పడుతుంది. ఇలా కాకుండా పిల్లలు చెప్పిన మాట విని క్రమశిక్షణతో మెలగాలంటే వారికి సమస్య, సందర్భాలను సూటిగా చిన్న పదాలతో వివరిస్తూ సౌమ్యంగా సంభాషించాలి.

  • పిల్లలు చేసిన పనికి వారిని తిట్టకుండా వాళ్లు ఏమి చేయాలో చెప్పి చేయించాలి. ‘గదిలోనుంచి వచ్చేటపుడు ఫ్యాన్‌ ఆఫ్‌ చేయాలని నీకెన్నిసార్లు చెప్పాలి’ అనే బదులు ‘గదిలో ఫ్యాన్‌ అనవసరంగా తిరుగుతుందమ్మా’ అని చెప్పవచ్చు. సమస్యను వివరిస్తూ సందర్భానుసారంగా పిల్లలు చేయాల్సిన పని వారికి అర్థమయ్యేలా మాట్లాడాలి.

  • పిల్లలకు సమాచారమిస్తూ చేయాల్సిన పనిని కూడా చెప్పేస్తే పిల్లలకు విషయం సులువుగా అర్థమవుతుంది. ‘ఎన్నిసార్లు చెప్పినా ట్యాబ్‌ ఎక్కడ పడితే అక్కడ పెడతావెందుకు?అనవసరంగా కొన్నాను’ అనే బదులు ‘ట్యాబ్‌ డైనింగ్‌ టేబుల్‌ మీద పెడితే పొరబాటున నీళ్లు పడి పాడవుతుంది. ఇక్కడ నుంచి తీసెయ్‌’ అని చెప్పవచ్చు.


  • పిల్లలకు పెద్ద పెద్ద లెక్చర్స్‌, స్పీచ్‌లు నచ్చవు. ఎంత తక్కువగా చెప్తే అంత తొందరగా అర్థం చేసుకుంటారు. ‘ఎన్నిసార్లు చెప్పినా వాటర్‌ బాటిల్‌ మర్చిపోతావేంటి’ అనే బదులు ‘నాన్నా వాటర్‌ బాటిల్‌’ అంటే చాలు.

  • పిల్లలు చేయాల్సిన పనిని సూచిస్తూ నోట్‌ రాసినా కూడా వాళ్లు సంబరపడతారు. నోటితో చెప్పినదాని కంటే ఇది ప్రభావవంతంగా ఉంటుంది. చెప్పుల స్టాండ్‌ మీద ‘కీప్‌ యువర్‌ స్లిప్పర్స్‌ హియర్‌’ అని రాసిన పేపర్‌ను క్లిప్‌ చేయవచ్చు.

  • మర్యాదతో కూడిన కమ్యూనికేషన్‌ను తల్లిదండ్రులు పాటిస్తుంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు.

Updated Date - Oct 19 , 2024 | 05:04 AM