Parenting : పిల్లలకు అర్థమయ్యేలా..!
ABN , Publish Date - Oct 28 , 2024 | 05:04 AM
క్రమశిక్షణ పేరుతో పిల్లలపై ఎన్నో ఆంక్షలు పెడుతుంటారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు మితిమీరి స్వేచ్ఛనిస్తే మరికొంతమంది తాము చెప్పినట్టే వినాలని కట్టడి చేస్తుంటారు.
పేరెంటింగ్
క్రమశిక్షణ పేరుతో పిల్లలపై ఎన్నో ఆంక్షలు పెడుతుంటారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు మితిమీరి స్వేచ్ఛనిస్తే మరికొంతమంది తాము చెప్పినట్టే వినాలని కట్టడి చేస్తుంటారు. దీనివల్ల పిల్లలు పెడదారి పట్టే అవకాశం ఉంది. అలాకాకుండా పిల్లలను ఎలా పెంచాలో తెలుసుకుందాం!
పిల్లల పట్ల తల్లిదండ్రులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి. పిల్లల ఆసక్తిని గమనించి అనుకున్నది సాధించేలా ప్రోత్సహించాలి.
ఇతరులకు సహాయ సహకారాలు అందించడం అలవాటు చేయాలి. దీనివల్ల పిల్లలు ప్రతిఒక్కరితో స్నేహంగా మెలగడం నేర్చుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పిల్లలను భాగస్వాములను చేస్తే వారిలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.
తల్లిదండ్రులు ప్రతిరోజూ పిల్లలతో కొంత సమయం గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. పిల్లలు చదువుతున్న పాఠశాల, ఉపాధ్యాయులు, స్నేహితుల విషయాలన్నీ అడిగి తెలుసుకోవాలి. పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను అడగాలి. వాటి పరిష్కారాలను చర్చించాలి. అప్పుడే పిల్లలు తమ భావాలను పంచుకోవడం నేర్చుకుంటారు.
పిల్లలకు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం నేర్పించాలి. ఆ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా స్వీకరించాలో వివరించాలి. ఏ పనినైనా కష్టమనుకోకుండా ఇష్టంతో పూర్తిచేసేలా ప్రోత్సహిస్తే పిల్లల్లో పోరాడే సామర్థ్యం అలవడుతుంది.
పిల్లలు ఏమి అడిగినా వాటిని వెంటనే తెచ్చివ్వాలని అనుకోవద్దు. తల్లిదండ్రులు ‘నో’ చెప్పడానికి వెనకాడకూడదు. ఆర్థిక పరిస్థితి, ప్రత్యామ్నాయాలను సరళంగా వివరిస్తూ పిల్లలకు ఆలోచించే అవకాశం కల్పించాలి.