Share News

కళ్లు నీళ్లు కారకుండా...

ABN , Publish Date - Nov 12 , 2024 | 05:22 AM

కొంతమంది వెలుగును చూడలేరు. ఎండ వెలుగులోకి వెళ్లగానే కళ్ల నుంచి నీరు కారిపోతూ ఉంటాయి. ఈ పరిస్థితి ఇబ్బందిగా ఉండేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

కళ్లు నీళ్లు కారకుండా...

కంటి రక్ష

కొంతమంది వెలుగును చూడలేరు. ఎండ వెలుగులోకి వెళ్లగానే కళ్ల నుంచి నీరు కారిపోతూ ఉంటాయి. ఈ పరిస్థితి ఇబ్బందిగా ఉండేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లను రక్షించడం కోసం, కళ్లలో ఉండే, లాక్రిమల్‌ గ్రంథులు ప్రేరేపితమై కళ్లకు తేమనివ్వడం కోసం నీళ్లను స్రవిస్తాయి. అయితే కొందర్లో ఈ గ్రంథులు అవసరానికి మించి పని చేస్తూ ఉంటాయి. మరీముఖ్యంగా డ్రై ఐ సిండ్రోమ్‌, అలర్జీలు ఉన్న వాళ్లలో ఈ గ్రంథులు అతిగా స్పందిస్తాయి. దాంతో వెలుగును చూసిన వెంటనే కళ్ల నుంచి నీరు స్రవించడం మొదలుపెడుతుంది. ఈ లక్షణానికి తోడు నొప్పి, మంట, దురద, చూపులో మార్పు లాంటి అదనపు లక్షణాలు కనిపిస్తే, ఆ పరిస్థితిని ‘కెరటైటిస్‌’గా పరిగణించి, వైద్యులను కలవాలి. ఫొటోఫోబియా ఉన్నవాళ్ల కళ్లు వెలుగును తట్టుకోలేవు. ఈ కోవకు చెందినవాళ్లు వెలుగులోకి రాగానే కళ్లను చికిలిస్తూ ఉంటారు. ఈ లక్షణాన్ని కూడా వైద్యులు కచ్చితంగా అంచనా వేయగలుగుతారు. అత్యధిక అతినీలలోహిత కిరణాలకు బహిర్గతం కావడం, గాలి కాలుష్యాల వల్ల కూడా వెలుగుకు కళ్లు అతిగా స్పందించి నీళ్లు కారతాయి. ఇలాంటి సమస్య ఉన్నవాళ్లు అతినీలలోహిత కిరణాలను అడ్డుకునే చలువ కళ్లద్దాలు వాడుకోవడంతో పాటు, వైద్యులు సూచించే కంటి చుక్కలు కూడా వాడుకోవాలి. కళ్లలోని కన్నీటి నాళాలు వాతావరణ ప్రభావాలకు గురి కాకుండా అన్ని వైపులా మూసి ఉండే చలువ కళ్లజోడులను పెట్టుకోవాలి.

Updated Date - Nov 12 , 2024 | 05:22 AM