Share News

గాంధీజీకి పిఠాపురం రాజుల సాయం

ABN , Publish Date - Apr 28 , 2024 | 04:55 AM

పిఠాపురం... ఒకప్పుడు దక్షిణ భారత దేశంలో అతి పెద్ద సంస్థానాల్లో ఒకటి. కానీ ఇప్పుడు దాని చరిత్ర గురించి తెలిసిన వారు తక్కువే

గాంధీజీకి పిఠాపురం రాజుల సాయం

పిఠాపురం... ఒకప్పుడు దక్షిణ భారత దేశంలో అతి పెద్ద సంస్థానాల్లో ఒకటి. కానీ ఇప్పుడు దాని చరిత్ర గురించి తెలిసిన వారు తక్కువే! వచ్చే నెల జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఊరు నుంచి పవన్‌ కళ్యాణ్‌ పోటీకి దిగటంతో దేశం వ్యాప్తంగా మళ్లీ పిఠాపురం పేరు వినబడుతోంది. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల అభివృద్ధికి పిఠాపురం రాజ కుటుంబం ఎంతో కృషి చేసింది. సూర్యారాయాంద్ర నిఘంటువును రాయించటం... తొలి టైప్‌ రైటర్‌ను తయారు చేయటంలో పాలు పంచుకోవటం... కాకినాడలో పీఆర్‌ కాలేజీ, హైస్కూల్‌లను స్థాపించటం... ఇలా చెప్పుకొంటూ పోతే తెలుగు జాతి అభివృద్ధిలో వారికొక ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. అలాంటి పిఠాపురం రాజ కుటుంబానికి, మాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

మా నాన్న ధన్‌రాజ్‌గిర్‌కు పిఠాపురం యువరాజు రామారావు (మహారాజా సూర్యారావు కుమారుడు) మంచి స్నేహితుడు. ఆయన హైదరాబాద్‌కు తరచూ వస్తూ ఉండేవారు. ఆయనను నేను ‘రామ అంకుల్‌’ అని పిలిచేదాన్ని. ఆ తర్వాతి కాలంలో రామ అంకుల్‌ కుమారుడు సూర్యారావు, కోడలు భారతీదేవి నాకు మంచి మిత్రులయ్యారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో గాంధీజీకి, కాంగ్రెస్‌ ఉద్యమానికి దక్షిణ భారత దేశంలో సాయం చేసినవారిలో పిఠాపురం రాజ కుటుంబీకులు కూడా ఉన్నారు. దీంతో వీరికి గాంధీజీ, నెహ్రూజీ, జిన్నా, రాజగోపాలచారి వంటి జాతీయోద్యమ నాయకులతో స్నేహసంబంధాలు ఉండేవి. రామ అంకుల్‌... విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌కు కూడా దగ్గరగా ఉండేవారు. శాంతినికేతన్‌కు తరచూ వెళ్లేవారు. అంకుల్‌ పేరు తలుచుకోగానే... ఆయన జిన్నాకు రాసిన ఉత్తరం, ఆయనతో షికార్‌ (వేట)కు వెళ్లిన సందర్భాలు, నాకు టెన్నిస్‌ నేర్పించటానికి ఆయన చేసిన ప్రయత్నాలు... అన్నీ ఒక దాని వెనక మరొకటి గుర్తుకొచ్చాయి.


ఆ రోజుల్లో రామ అంకుల్‌ ‘ఆలిండియా లాన్‌ టెన్నిస్‌ అసోషియేషన్‌’ ప్రెసిడెంట్‌గా ఉండేవారు. దాంతో ఆయనకు దేశ వ్యాప్తంగా అనేకమంది క్రీడాకారులతో మంచి పరిచయాలు ఉండేవి. నాన్న కూడా అప్పుడప్పుడూ టెన్నిస్‌ ఆడేవారు. అందువల్ల జ్ఞాన్‌బాగ్‌ ప్యాలె్‌సలోనే ఒక టెన్నీస్‌ కోర్టు ఉండేది. ఒకసారి రామ అంకుల్‌ పెద్ద వాళ్ల రాకెట్‌తో నాకు టెన్నిస్‌ నేర్పించే ప్రయత్నం చేశారు. రాకెట్‌ పెద్దది. నా చేతులేమో చిన్నవి. అది చూసి నాన్నకు చాలా కోపం వచ్చింది. స్నేహితుడు కాబట్టి రామ అంకుల్‌ ముందు ఏమీ అనలేదు కానీ... ఆ తర్వాత మా ఎదురుగా ఆయనను గట్టిగా తిట్టేశారు. మా చిన్నప్పుడు హిందూ, ముస్లింల మధ్య కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తలు ఉండేవి. ఈ విషయంపై మహ్మద్‌ ఆలీ జిన్నాకు రామ అంకుల్‌ ఒక ఉత్తరం రాశారు. ‘‘హిందూ- ముస్లింల మధ్య ప్రశాంతమైన, న్యాయబద్ధమైన ఒప్పందం ఒకటి ఉండాలి. ఇది జరిగితే దేశమంతా ప్రశాంతత ఏర్పడుతుంది’’ అనేది ఆ ఉత్తరం సారాంశం. ఈ ఉత్తరానికి జిన్నా తనదైన శైలిలో జవాబు కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఒకసారి జిన్నా కనిపిస్తే... ‘‘హిందూ-ముస్లింల విషయంలో మీకు... గాంధీజీకి మధ్య ఒప్పందం కుదరలేదు. అలాంటప్పుడు మీ ఇద్దరూ కలిసి నవ్వుతూ ఎలా మాట్లాడుకోగలుగుతున్నారు?’’ అని రామ అంకుల్‌ అడిగారుట. అప్పుడు జిన్నా... ‘‘నో ఛాయిస్‌’’ అని సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఈ విషయాలన్నిటినీ నాకు సూర్యారావు చెబుతూ ఉండేవాడు. గాంధీజీ మద్రాసు వచ్చినప్పుడు రామ అంకుల్‌ ఆయనకు భూరి విరాళం ఇచ్చారు. ఆ సందర్భంలో జరిగిన సభలోనే గాంధీజీ తాను బహిరంగ సభల్లో కేవలం హిందీలోనే మాట్లాడతానని ప్రకటించినట్లు జ్ఞాపకం. రాజాజీతో కూడా రామ అంకుల్‌కు మంచి స్నేహ బంధం ఉండేది. రాజాజీ మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను అంకుల్‌ తరచూ కలుస్తూ ఉండేవారు.


రామ అంకుల్‌ అనగానే గుర్తుకొచ్చే మరో జ్ఞాపకం షికార్‌. ఆ రోజుల్లో రాజ కుటుంబాల్లో పిల్లలందరికీ షూటింగ్‌ నేర్పించేవారు. నాకు చిన్నప్పటి నుంచి జీవాలను చంపటం ఇష్టముండేది కాదు. కానీ నాన్న నన్ను షికార్‌కు తీసుకువెళ్తూ ఉండేవారు. తమ్ముడు మాత్రం ‘‘జీపులో నీకు సీటు వేస్ట్‌’’ అని ఏడిపించేవారు. ఒకసారి రామ అంకుల్‌ మా ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఒక రైతును పులి చంపింది అనే సమాచారమొచ్చింది. దాంతో ఆ పులిని వేటాడటానికి నేను, నాన్న, రామ అంకుల్‌ వెళ్లాం. రాత్రంతా ముగ్గురం ఒక మంచె మీద కూర్చుని ఎదురుచూశాం. కానీ ఆ రోజు పులి రాలేదు. మరుసటి రోజు సాయంత్రం పులి సంచారాన్ని కొందరు గ్రామస్థులు గమనించి నాన్నకు చెప్పారు. నాన్న వెళ్లి ఆ పులిని చంపి, మా టెంట్‌ వద్దకు తీసుకువచ్చారు. ఇలాంటి ఇంకో సంఘటన బాందీపూర్‌లో జరిగింది. సాధారణంగా రాజకుటుంబాలన్నిటికీ ఊటీలో హాలిడే హోమ్స్‌ ఉండేవి. కోటగిరిలో పిఠాపురం, కొచ్చిన్‌ ప్యాలె్‌సలు, సీడర్స్‌లో సాలార్‌జంగ్‌ అంకుల్‌కు వుడ్‌కాల్‌ హాల్‌ ప్యాలె్‌సలు ఉండేవి. మరోసారి ఊటీ లవ్‌ డేల్‌లోని మా హాలీడే హోమ్‌లో రాజ కుటుంబీకులందరూ కలిశారు. రాత్రి డిన్నర్‌ అయిన తర్వాత నేను, తమ్ముడు చున్ను, రామ అంకుల్‌ ఒక జీపులో, అమ్మానాన్న మరో జీపులో బాందీపూర్‌ అడవికి బయలుదేరాం. ఆ రోజుల్లో బాందీపూర్‌ ప్రాంతంలో చాలా పులులు ఉండేవి. ఆ అడవిలో ప్రతి చెట్టు, పుట్ట అంకుల్‌కు తెలుసు. దాంతో పులులు మన ముందుకు వచ్చినప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉండాలి? వాటి అడుగు జాడలను ఎలా గుర్తుపట్టాలి? లాంటి విషయాలన్నింటినీ చెబతుండగా, ఈ లోపు ఒక పులి మా జీపు ముందర నుంచి జంప్‌ చేసి వెళ్లిపోయింది. చున్ను కాల్చటానికి ప్రయత్నించాడు. అప్పుడు రామ అంకుల్‌... ‘‘అసలు ఫన్‌ ముందు ఉంది’’ అని డ్రైవర్‌ను జీపు స్లో చేయమన్నారు. లైట్లు కూడా డిమ్‌ చేయించారు. దూరంగా ఆ వెన్నెల రాత్రిలో ఏనుగులు, ఎలుగుబంట్లు లాంటి జంతువులు, చిలకల్లాంటి పక్షులు అన్నీ ఒక చోట ఉండటం చూశాం. ఆ దృశ్యాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేదు. అలాగే నాకు పుస్తకాలు ఇష్టమని తెలిసి రామ అంకుల్‌ అప్పుడప్పుడూ పుస్తకాలు బహూకరించేవారు. శేషేంద్రతో వివాహం జరిగిన తర్వాత కూడా అనేక సందర్భాలలో ఆయన జ్ఞాన్‌బాగ్‌కు వచ్చారు.

రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌


రాజ కుటుంబాలతో సంబంధాలు...

రామ అంకుల్‌కు ఇద్దరు సోదరీమణులు. ఒక చెల్లెలు ప్రిన్సెస్‌ సీతాదేవిని బరోడా మహారాజు సాయాజిరావుకు ఇచ్చి వివాహం చేశారు. మా చిన్నప్పుడు అదొక పెద్ద సంచలనం. రెండో చెల్లి ప్రిన్సెస్‌ కమలను కూచ్‌బిహార్‌ యువరాజు ఇంద్రజిత్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ఇలా పిఠాపురం రాజవంశీయులు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్నారు.

గచ్చిబౌలిలో పులులు...

ప్రస్తుతం గచ్చిబౌలి ఉన్న ప్రాంతాన్ని ఒకప్పుడు యల్మల అని పిలిచేవారు. అక్కడ ఒక రైల్వే లైన్‌ కూడా ఉండేది. చుట్టుపక్కల అంతా అడవి. కొన్నిసార్లు ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాలపై పులులు దాడులు చేసి ఆవులను, మేకలను చంపేసేవి. కొన్నిసార్లు మనుషులనూ చంపేవి. ఆ సమయంలో పులల నుంచి రక్షించమని నాన్న దగ్గరకు గ్రామ ప్రజలు వచ్చేవారు. సాయంత్రానికి ఆ ప్రాంతానికి మొత్తం అందరం వెళ్లేవాళ్లం. ఆ పరిమిత సమయంలోనే మా కోసం టెంట్‌లు, వాటిలో ఫోల్డింగ్‌ బెడ్‌లు, పక్కనే టాయిలెట్స్‌ ఏర్పాట చేసేవారు. అందరికీ వంటలు వండేవారు. రాత్రి పార్టీ కోసం సంగీత బృందం, రాత్రి అడవిలోకి వెళ్లటానికి జీపులు, గన్నులు అన్నీ సిద్ధంగా ఉంచేవారు.

Updated Date - Apr 28 , 2024 | 07:02 AM