మరణానికి ప్రణాళిక..!!
ABN , Publish Date - Aug 02 , 2024 | 04:11 AM
‘‘పుట్టిన ప్రతి ఒక్కడూ గిట్టక మానడు. గిట్టినవాడు మళ్ళీ పుట్టకమానడు. అనివార్యమైన ఈ విషయం గురించి శోకించడం తగదు’’ అని శ్రీకృష్ణుడు ‘భగవద్గీత’లో చెప్పాడు.
జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్యచ
తస్మాద పరిహార్యర్ధే న త్వం శోచితు మర్హసి
కర్మనే కార్యంగా స్వీకరించి జీవించాలి..
‘‘పుట్టిన ప్రతి ఒక్కడూ గిట్టక మానడు. గిట్టినవాడు మళ్ళీ పుట్టకమానడు. అనివార్యమైన ఈ విషయం గురించి శోకించడం తగదు’’ అని శ్రీకృష్ణుడు ‘భగవద్గీత’లో చెప్పాడు. ఈ యదార్థం అంతిమ సంస్కారాలు జరిగే సమయంలో... ఘంటసాల గళంలో వినిపిస్తూ ఉంటుంది. అసలు వినవలసినవాడు పార్థివదేహంగా మారి... దాన్ని వినలేడు. మిగిలినవారు విన్నా దాన్ని పట్టించుకోరు. ప్రతి మనిషి జీవితకాల చక్రంలో ఎనిమిది దశలు ఉంటాయి. అవి గర్భస్థ దశ, బాల్యం, విద్య, సంసారం, సంపాదన, విరామం, విముక్తం, చివరకు నిర్యాణం. ఈ దశలలో ఎదురయ్యే బాధలను, కన్నీళ్ళను, సుఖాలను, దుఃఖాన్ని, క్రోధాన్ని, ఆవేశాన్ని జయించాలంటే, కర్మనే కార్యంగా స్వీకరించి జీవించాలంటే, స్థిత ప్రజ్ఞుడిగా ఉండాలంటే... ఈ ఒక్క శ్లోకంలోని మర్మాన్ని అర్థం చేసుకుంటే చాలు. జీవితం ఒడుదొడుకులు లేకుండా ఉంటుంది. కార్యోన్ముఖంగా సాగుతుంది. ‘కర్మ’ అంటే తలరాత కాదు. మనం చేసే ప్రతి పనినీ ‘కర్మ’ అనే అంటారు. కర్మ సిద్ధాంతం అంటే తన లక్ష్యాన్ని తానే ఎంచుకొని, శ్రమించి పోరాడడం, సాధించడం.
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ...
అని కూడా చెప్పాడు గీతాచార్యుడు. మనం ధరించిన వస్త్రాలను విడిచిపెట్టి, వేరొక దుస్తులను ఎలా ధరిస్తామో... అలాగే ఆత్మ ఒక శరీరాన్ని విడిచిపెట్టి... కొత్త శరీరంలోకి వెళుతుంది. ఇది నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. కాబట్టి దీనికోసం సుదీర్ఘంగా చింతించవద్దని అర్థం. మనమందరం గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... శరీరం ధాతు సమ్మేళనం. మరణించిన తరువాత ఆ ధాతువులు పంచభూతాలలో కలుస్తాయి. ప్రకృతిలో (పరమాత్మలో) విలీనం అవుతాయి. కాబట్టి అనివార్యమైన మరణం కోసం ప్రణాళిక వేసుకోవాలి. మానసిక, ఆధ్యాత్మిక, కుటుంబ, సమాజ శ్రేయస్సుకు అది అత్యవసరం.
కుటుంబంలో చర్చించాలి:
విద్య, ఉద్యోగం, ఆస్తి, అంతస్తులు, ఆరోగ్యం, బీమా... ఇలా అన్నిటి గురించీ మనం చర్చిస్తాం. కానీ జీవితంలో తప్పనిసరిగా సంభవించే మరణం గురించి ఆలోచించడానికి భయపడతాం. అలాంటి ఆలోచనను అపశకునంగా భావిస్తాం. చర్చ జరిగినప్పుడే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. జీవన లక్ష్యాల గురించి ఆలోచిస్తాం. మానసిక, ఆర్థిక, అంతిమ సంస్కార, అనంతర సంస్కార ప్రణాళిక రూపొందించుకోగలుగుతాం. ‘‘అహనీ అహని భూతాని గచ్చంతిహ యమాలయం... శేషః స్థిరత్వం ఇచ్ఛంతి కిమాశ్చర్యమతః పరం... ప్రతి క్షణం ఎందరో చనిపోతూనే ఉన్నారు. కానీ బతికి ఉన్నవారికి మేము కూడా ఒక రోజు మరణిస్తామనే ఆలోచనే రాదు. ఇది చాలా ఆశ్చర్యకరం. ఇది వాస్తవం’’ అని శ్రీకృష్ణభగవానుడు చెప్పాడు. దాన్ని ఇప్పటికీ మనం అర్థం చేసుకోలేదు.
చర్చ ఎందుకు జరగాలంటే:
మరణం అనివార్యం అని తెలిసినప్పుడు మనిషిలో భయం తగ్గుతుంది. లక్ష్య సాధన కోసం ధైర్యం పెరుగుతుంది. పదవి విరమణ ప్రణాళిక మాదిరిగానే నిర్యాణ (మరణ) ప్రణాళిక ద్వారా... మరణించే వరకూ ఎలా బతకాలి, ఏం చెయాలి అనేది నిర్థారించుకోగలం. ఆరోగ్యం కోసం, కుటుంబం కోసం, ఆస్తుల పంపకం కోసం ప్రణాళికలు రూపొందించుకోగలం. మరణం మరో ప్రయాణానికి నాంది అని గ్రహించి... దాన్ని సంతోషంగా స్వీకరించగలం.
అంతిమ సంస్కారం:
ఏ వ్యక్తికైనా మరణానంతర కార్యక్రమాలు కూడా గౌరవప్రదంగా ఉండాలి. అంతిమ సంస్కారం ఎక్కడ జరగాలి, ఎలా జరగాలి, ఎవరు చేయాలనే విషయంలో స్పష్టత ఉండాలి. పార్థివ శరీరానికి కూడా సజీవుడైన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇవ్వాలి. దశదిన కర్మ, సంతాప సభలు కూడా శోక సమావేశాల్లా కాకుండా... మృతుడైన వ్యక్తితో తమ అనుబంధాలను, గత స్మృతులను ఆత్మీయులు తలచుకొనేలా ఉండాలి. స్మారక చిహ్నాల్లాంటి వాటిని కోరుకొనే ఉంటారు. వీటన్నింటికీ అయ్యే ఖర్చు కుటుంబానికి భారం కాకుండా ముందే ఆర్థికమైన ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఇలాంటివి ఆలోచించడం కష్టంగాను, భయంగాను అనిపిస్తుంది. కానీ అవతార పురుషులకు కూడా మరణం తప్పలేదు. కాబట్టి జన్మ, కర్మ, మరణం, పునర్జన్మ అనేవి తప్పించుకోలేనివని గమనించాలి.
ఆత్మీయ సందేశం:
మనం మన జీవితకాలంలో ఎందరినో కలుసుకుంటాం. కానీ ఎన్నో సంఘటనలను మనకు అత్యంత సన్నిహితులైన బంధు మిత్రులతో పంచుకోం. మన అనుభవాలను, అనుభూతులను ఆడియో లేదా వీడియో రూపంలోని ఒక సందేశం ద్వారా... మరణానంతరం మన సన్నిహితులకు అందించేలా వినూత్నమైన ఆలోచన చేయవచ్చు. మీరు ప్రత్యక్షంగా చెప్పలేని విషయాలు... మీ తదనంతరం వారికి తెలియడం వల్ల మీపట్ల వారి ఆత్మీయత మరింత పెరుగుతుంది.
మానసిక దృఢత్వం అవసరం
చావు భయం చాలా మందిని పిరికివాళ్ళుగా చేస్తుంది. అది లక్ష్య సాధనకు అవరోధంగా మారుతుంది. మరణం అనివార్యం అని అర్థం చేసుకున్నప్పుడు, లక్ష్య సాధనలో మరణం కూడా ఒక ఆయుధంగా మారుతుంది.
- డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మాజీ ఎంపీ