Professor Mrinalini : మన సాహిత్యం తెరకెక్కదా?
ABN , Publish Date - Aug 25 , 2024 | 01:15 AM
మన దర్శక, నిర్మాతలు, నటులు పెద్దగా సాహిత్యాన్ని చదవరు. కాబట్టి గొప్ప తెలుగులో సాహిత్యం ఉందనే విషయం వారికి తెలిసే అవకాశం చాలా తక్కువ. అదే తమిళం, మలయాళంలో మంత్రులతో సహా చాలామంది పుస్తకాలు చదువుతారు.
‘‘మలయాళ సాహితీ దిగ్గజం వాసుదేవన్ నాయర్ రాసిన తొమ్మిది కథల ఆంథాలజీ సిరీస్ ‘మనోరతంగల్’. కేరళలో సాహిత్య, సినిమా రంగాలు కలిసున్నాయనడానికి ఇదొక నిదర్శనం. తమిళంలోనూ ‘పొన్నియన్ సెల్వన్’ నవల సినిమాగా వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి ప్రయత్నాలు తెలుగులో మచ్చుకైనా సాగడంలేదన్నది సినీ, సాహిత్యాభిమానుల ఆవేదన. ఈ సందర్భంగా తెలుగు సాహిత్యం తెరకెక్కదా? అలాంటి ప్రయత్నాలు ఇక్కడెందుకు జరగడంలేదు? తదితర విషయాలపై ప్రముఖ సాహిత్య విమర్శకురాలు ప్రొఫెసర్ మృణాళిని చెబుతున్న అభిప్రాయమిది.
మన దర్శక, నిర్మాతలు, నటులు పెద్దగా సాహిత్యాన్ని చదవరు. కాబట్టి గొప్ప తెలుగులో సాహిత్యం ఉందనే విషయం వారికి తెలిసే అవకాశం చాలా తక్కువ. అదే తమిళం, మలయాళంలో మంత్రులతో సహా చాలామంది పుస్తకాలు చదువుతారు. నటులు ఆధారంగా కథ రాసుకోవడం మనకున్న అతి పెద్ద జాడ్యం.
గ్లోరిఫై చేసిన నెగెటివిటీని, క్రౌర్యాన్ని మాత్రమే మనవాళ్లు స్వీకరిస్తారు తప్ప... ఒక బలహీనత ఉన్న, సహజమైన వ్యక్తి కథా నాయకుడిగా ఉండే కథలను, నవలలను మనవాళ్లు స్వీకరించలేరు. సాహిత్యంలోని షేడ్స్‌ను సినిమాల్లోకి తీసురావడానికి వాళ్ళ స్టార్‌డమ్, అభిమానగణం అడ్డుపడతాయి.
అలాంటప్పుడు సాహిత్యం నుంచి సినిమాకు కథ తీసుకోడానికి ఆస్కారం ఉండదు. ఉత్తమ సాహిత్యం స్టార్ డమ్‌కు లొంగదు. అదే మలయాళంలో చూడండి... మమ్ముట్టి ‘కాథల్- ది కోర్’ సినిమాలో హోమోసెక్సువల్ పాత్ర పోషించారు. సూపర్‌స్టార్ స్థాయిలోని నటుడు అలాంటి పాత్రలో నటించాడంటే... నటుడిగా అతను ఎంతటి నిజాయితీపరుడు కాకపోతే అలా చేయగలడు.
ఆ నిజాయితీ మన తెలుగు నటుల్లో లేదు. ఒకప్పుడు ‘దేవదాసు’, ‘బాటసారి’, ‘అర్థాంగి’ లాంటి సూపర్‌హిట్ సినిమాలన్నీ నవలల ఆధారంగా వచ్చినవే.! ఇక 1960, 70 దశకాలలో కోడూరి కౌసల్యాదేవి, యద్దనపూడి సులోచనారాణి తదితరుల కథలు, నవలలు... ప్రేమ కథా, కుటుంబ కథా చిత్రాలుగా వచ్చాయి. ఆ నవలలు ఎంతగా హిట్ అయ్యాయో... సినిమాలూ అంతగా హిట్ అయ్యాయి.
ఇప్పుడు ఆ జానర్ పనికిరాదు. ఇప్పుడు మంచి క్లాసిక్ నవలలను సినిమాగా తీయాలంటే... ట్రెండ్‌కు తగినట్టు వాటిని మలచగలిగే దక్షత దర్శకులకు ఉండాలి. ఉదాహరణకు గోపీచంద్, బుచ్చిబాబు, చలం, విశ్వనాథ సత్యనారాయణ, కొ.కు రచనలు సినిమాగా తీయాలంటే దర్శకులకు సాహిత్యాభిరుచి ఒక్కటే చాలదు, తాత్విక దృక్కోణమూ ముఖ్యం.
అందుకే మనం క్లాసిక్ నవల అని చెప్పుకోదగ్గది ఏదీ సినిమాగా రాలేదు. విశ్వనాథ ‘వేయిపడగలు’ లాంటి క్లాసిక్స్ రచనలు కొన్ని టెలివిజన్ ధారావాహికలుగా వచ్చాయి. కొంతవరకు మంచి నవలను సినిమాగా తీసినవాటిల్లో ‘బలిపీఠం’, ‘ఇదెక్కడి న్యాయం’ లాంటివి ఉన్నాయి. చలం ‘దోషగుణం’ కథను ‘గ్రహణం’ పేరుతో ఇంద్రగంటి మోహన్‌కృష్ణ చక్కగా తీశారు. ‘కన్యాశుల్కం’ నాటకం తర్వాత ‘దోషగుణం’ క్లాసిక్స్‌కు కాస్త న్యాయం చేసిన సినిమాగా చెప్పవచ్చు.
ఆ ట్రెండ్ కొనసాగలేదు...
ఎంటీ వాసుదేవన్ నాయర్ మలయాళంలో మంచి రచయిత మాత్రమే కాదు, సినిమాలకు దర్శకత్వం వహించినవాడు కూడా. జయమోహన్ కూడా ‘పొన్నియన్ సెల్వన్’ లాంటి సినిమాలకు మాటలు రాశారు. సాహిత్య రచయితలు సినిమాలకు కూడా రాయడం, ఆ రెండూ కలిసిమెలసి ఒకే రకమైన స్థాయిలో కొనసాగడం వేరే భాషల్లో చూస్తాం. మనదగ్గర సినిమా అన్నది వేరే స్థాయిలో ఉంటుంది.
అది సాహిత్య స్థాయికి రావడం లేదు. కొందరు ప్రముఖ రచయితలు ఆనాడు సినిమా కథలు రాద్దామని వెళ్లి భంగపడి బయటకు వచ్చారు. ఉదాహరణకు గోపీచంద్, రావిశాస్త్రి తదితరులు. మంచి రచయితలను వినియోగించుకోవడం మన సినిమా వారికి చేతకాలేదు.
అదే బుచ్చిబాబు రాసిన మూలకథకు దేవులపల్లి కృష్ణశాస్త్రి సృజన తోడవడంతో ‘మల్లీశ్వరి’లాంటి కథ పుట్టింది. ఆ ట్రెండ్ తర్వాత కొనసాగలేదు. బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది’ నవలను సినిమాగా తీస్తానని ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ప్రకటించాడు. క్రిష్ కూడా కొంతవరకు ప్రయత్నిస్తున్నాడు. అయితే, ‘కొండపొలం’ నవలను సినిమాగా తీసే క్రమంలో కమర్షియల్ ఎలిమెంట్‌కు లొంగిపోయాడు. ఒక నవల లేదా కథను సినిమాగా తీయాలంటే, దాని ఫోకస్ పాయింట్‌ను పట్టుకోకపోతే ఆ రచనకు న్యాయం జరగదు.
- ప్రొఫెసర్ సి.మృణాళిని
కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్