ఆకారం, ఆహార్యం... అన్నిట్లోనూ మర్మాలే!
ABN , Publish Date - Sep 06 , 2024 | 06:04 AM
అంటూ శ్రీగణేశ చతుర్థి రోజున శ్రీ సిద్ధి వినాయక వ్రతం చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. పై శ్లోకం ఆ మహా గణపతి రూపాన్ని వర్ణిస్తుంది. ఆయన రూపంలోని ప్రతి అంశంలో ప్రతీకాత్మకత ఉంది. మంత్ర, జ్యోతిష శాస్త్రాల్లో, వేదాంతంలో...
విశేషం
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాంకుశధరం దేవం ఽధ్యాయేత్ సిద్ధి వినాయకం...
అంటూ శ్రీగణేశ చతుర్థి రోజున శ్రీ సిద్ధి వినాయక వ్రతం చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. పై శ్లోకం ఆ మహా గణపతి రూపాన్ని వర్ణిస్తుంది. ఆయన రూపంలోని ప్రతి అంశంలో ప్రతీకాత్మకత ఉంది. మంత్ర, జ్యోతిష శాస్త్రాల్లో, వేదాంతంలో గణపతి అవయవాల నుంచి ఆహార్యం వరకూ ప్రతిదానికీ ఒక నిర్వచనం ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాం:
గజాననం: వినాయకుడిది ఏనుగు తల. అది అనంతమైన జ్ఞానానికీ, యోగశక్తికీ, మేధస్సుకూ, పరిపూర్ణతకూ చిహ్నం.
చిన్న కళ్ళు: చిన్నవిగా ఉండే ఆయన నేత్రాలు ఏకాగ్రతకు చిహ్నాలు. మాయామయమై, తప్పుదోవ పట్టించే లోకాన్ని నిశితంగా పరిశీలించి, ఏది వాస్తవమో దాన్నే పరిశీలించమని చెబుతాయి.
త్రినేత్రం: వినాయకుడి మూడో కన్ను ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక.
వక్ర తుండం: వంపు తిరిగిన తొండం ఓంకారానికి సంకేతం. మానవాళికి భ్రాంతి కలిగించే మాయకు వక్రమని పేరు. చెడు సంస్కారాలకు కూడా అది చిహ్నం. వాటిని నిర్మూలించేవాడు గణపతి.
శూర్పకర్ణం: గణపతి చెవులు పెద్దవిగా, నోరు చిన్నదిగా ఉంటుంది. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. అప్పుడే మనిషి పరిపూర్ణుడవుతాడన్నది దీని వెనుక పరమార్థం. లోకంలోని ఆర్తుల ప్రార్థనలను తన పెద్ద చెవులతో గణపతి ఆలకిస్తాడు. అలాగే ‘శూర్ప’ అంటే చేట. వ్యర్థాలను తొలగించడం చేట చేసే పని. అజ్ఞానాన్ని తొలగించి, కేవలం జ్ఞానాన్ని మాత్రమే అందించే దైవం గణపతి అని ఇది సూచిస్తుంది.
లంబోదరం: విఘ్నేశ్వరుడి పొట్ట విశ్వానికి చిహ్నం. విశ్వాన్ని తనలో భరించే సామర్థ్యం, సర్దుబాటు తత్వ్తాన్ని లంబోదరుడు ప్రదర్శిస్తున్నాడు. అలాగే, జీవితంలో ఎన్నో విషయాలు ఎదురవుతూ ఉంటాయి. అవి మంచివైనా, చెడువైనా సమానంగా, ప్రశాంతంగా స్వీకరించాలని అది సూచిస్తుంది.
నాగబంధం: విఘ్నేశుడి ఉదరానికి ఉండే నాగబంధం కుండలినీ శక్తికి ప్రతీక.
ఏకదంతం: ఏకదంతుడిగా వినాయకుడు విఖ్యాతుడు. ఎందుకంటే ఆయన రెండు దంతాల్లో ఒకటి విరిగి ఉంటుంది. పూర్తిగా ఉన్న దంతం వివేకానికీ, విరిగిన దంతం భావోద్వేగాలకూ సూచికలు. భావోద్వేగాలను వివేకంతో గెలవాలని అవి చెబుతాయి.
అభయహస్తం: గణేశుడి నాలుగు చేతుల్లో ఒకటి అభయహస్తం. లోకానికి ఆయన రక్షకుడని అది చెబుతుంది.
అంకుశం: వినాయకుడి రెండో చేతిలో గొడ్డలి ఉంటుంది. అది అజ్ఞానాన్ని ఖండిస్తుంది.
పాశం: విఘ్నేశుని మూడో చేతిలో ఉండే పాశం విఘ్నాలను తొలగిస్తుంది. కోరికలను నిర్మూలిస్తుంది.
జపమాల, మోదకం, పద్మం: గజాననుడి నాలుగో చేతిలోని వస్తువులు ఆలంకారాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వాటిలో జపమాల జ్ఞాన సంపదకు సంకేతం. సాధన చేస్తే ఫలం లభిస్తుందని మోదకంతో ఉన్న హస్తం చెబుతుంది. తామర పువ్వు మానవ జీవితంలో అత్యంత ఉన్నత స్థితిగా చెప్పే ఆత్మ వివేకానికీ, మోక్షానికీ చిహ్నం.
మూషిక వాహనం: సమదర్శనానికి చిహ్నం. అలాగే ఎలుకను కోరికలకు ప్రతీకగా చెబుతారు. కోరికలను అదుపులో పెట్టాలి తప్ప అవి మనమీద స్వారీ చేయకూడదనేది మూషికవాహనంలోని సందేశం.