Share News

Shri Krishnashtami : శరణాగతితో ఆత్మసాక్షాత్కారం

ABN , Publish Date - Aug 23 , 2024 | 05:34 AM

శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే ఆయన తత్త్వాన్ని తెలుసుకోవాలి. శ్రీమన్నారాయణుడు కొత్త అవతారాన్ని ధరించినప్పుడు... అంతకు ముందు అవతారంలో తాను ప్రబోధించిన విషయాలను అవగాహనా లోపంతో సరిగ్గా అర్థం చేసుకోకుండా..

Shri Krishnashtami : శరణాగతితో ఆత్మసాక్షాత్కారం

సహజయోగ

  • 26న శ్రీకృష్ణాష్టమి

శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే ఆయన తత్త్వాన్ని తెలుసుకోవాలి. శ్రీమన్నారాయణుడు కొత్త అవతారాన్ని ధరించినప్పుడు... అంతకు ముందు అవతారంలో తాను ప్రబోధించిన విషయాలను అవగాహనా లోపంతో సరిగ్గా అర్థం చేసుకోకుండా, మితిమీరిన, విపరీతమైన వైఖరులను అనుసరిస్తున్న ప్రజలను సంస్కరించడానికి ఆ కొత్త అవతారంలో ప్రయత్నిస్తాడు.

ఈ కారణం వల్లనే భగవంతుడు మళ్ళీ మళ్ళీ అవతరిస్తూ ఉంటాడు. రామావతారంలో అత్యంత ఆదర్శవంతంగా ఆయన జీవించాడు. ‘శ్రీరాముడిలా మనం కూడా బంధరహితులుగా ఉందాం’ అనుకున్న ప్రజలు వివిధ అపోహలతో కఠినమైన జీవితాన్ని గడిపారు. వారిని మునులు, యోగులు ఎంతో క్రమశిక్షణలో పెట్టేవారు. క్రమశిక్షణను ఉల్లంఘించేవారికి కఠిన ప్రాయశ్చిత్తాలు ఉండేవి. దీనితో ప్రజలు గంభీరమైన జీవితానికి అలవాటు పడిపోయారు.

ఆ తరువాత... ఈ చరాచర సృష్టి అంతా ఒక లీల అని, ఆనందమయమని నిరూపించడానికి శ్రీకృష్ణావతారం వచ్చింది. ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా, ఆడుతూ పాడుతూ, ఎలాంటి అరమరికలు, కఠిన నియమ నిబంధనలు లేకుండా ఎలా ఉండాలో ఆయన తన జీవితం ద్వారా ప్రత్యక్షంగా చూపించాడు.


శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు. శ్రీకృష్ణునికి మనం సంపూర్ణంగా శరణాగతులైతే... మనలోని యోగ స్థితిని స్థిరపరచుకోవచ్చు.. భగవంతుడి శక్తితో మన అంతర్గత శక్తి కలయికే యోగం. అది ఆత్మసాక్షాత్కారం ద్వారా సాధ్యమవుతుంది. శ్రీకృష్ణుడు విరాట్‌ పురుషుడు. కదనరంగంలోకి స్వయంగా దూకకుండానే...

సమస్త దుష్ట శక్తులతో పోరాటం సాగించాడు. ఆయన జీవితం ఎంతో మనోహరంగా, సృజనాత్మకంగా, ప్రేమతత్త్వంతో నిండి ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు దుఃఖితుడై ఉన్నప్పుడు గీతా బోధతో కర్తవ్యం బోధించాడు. స్థితప్రజ్ఞత గురించి, ఆధ్యాత్మికత గురించి, సంపూర్ణ బంధరాహిత్యం గురించి చాలా వివరంగా చెప్పాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా... మన అంతరంగంలోనూ, బాహ్యంగానూ ఉన్న దుష్ట శక్తులతో పోరు సాగించాలని ఉపదేశించాడు.

మనకు ఉన్న ఆధ్యాత్మిక మార్గాల్లో భక్తి ఒకటి. అది మన అంతర్గత సూక్ష్మ శరీర వ్యవస్థలో ఎడమ పార్శ్వానికి సంబంధించినది. భక్తి అంటే భగవంతుణ్ణి కీర్తించడం, అర్పణ భావంతో ఉండడం, మంచి కర్మలు నిర్వర్తించడం. ఆ విధంగా భగవంతుడికి మనం దగ్గరవుతాం. ఇది ఋషులు, మతాలు ఆమోదించిన పద్ధతి. అయితే దీన్ని మనం ఎలా ఆచరిస్తున్నాం?


దైవంతో అనుసంధానం కాకపోతే... దైవం పట్ల సంపూర్ణ సమర్పణ భావాన్ని ఎలా కలిగి ఉండగలం? అనన్య భక్తి మన అంతరంగంలో ఉంటే దైవంతో ఐక్యత సాధించగలం. మరొకటి కర్మ సిద్ధాంతం. అంటే మనం మన కార్యాలను బంధరాహిత్యంతో నిర్వహించడం. ఇది అంత సులభం కాదు. మనల్ని మనం నిర్మలంగా మార్చుకోవడం కోసం... ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందిన మహర్షులను దర్శిస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నం. అన్ని రకాల కర్మ కాండలను ఆచరిస్తున్నాం. ఇది కర్మయోగం.

సహజయోగ ప్రకారం... ఇది మన శరీరంలోని కుడి పార్శ్వానికి సంబంధించినది. కానీ మనం ఏ కర్మలు చేసినా వాటి ఫలాలు ఎలా ఉంటాయో చెప్పలేమనీ, కాబట్టి భగవంతుడి ఆశీస్సులు లభించడానికి ఫలానా కర్మలే చెయ్యాలని చెప్పడానికి వీలు లేదనీ అన్నాడు శ్రీకృష్ణుడు. ‘‘కర్మలు చెయ్యడం నీ పని. వాటి ఫలితాలను ఆశించకూడదు’’ అని చెప్పాడు. ఆత్మసాక్షాత్కారం పొందినవారిని, ధర్మమార్గం అనుసరించేవారిని, ధర్మబద్ధమైన కర్మలను ఆచరించేవారిని శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు.

మూడోది విచక్షణ. దీన్నే మనం జ్ఞానమార్గం అంటాం. ఇది మధ్యేమార్గం. దీనిద్వారా మనం పరిణామం పొందుతాం. లౌకిక విషయాలకు అతీతమైన శక్తిని పొందినప్పుడు... సంపూర్ణ, నిర్మల, సూక్ష్మ జ్ఞానాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరూ జ్ఞానమార్గంలోకి వెళ్ళలేరని, దానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం, స్థితి ఉండాలని చాలామంది చెబుతారు. కానీ అది సరికాదు. అందరూ జ్ఞానమార్గాన్ని అనునసరించవచ్చు. దానికి దోహదపడే సూక్ష్మ శరీర వ్యవస్థ అంతర్గతంగా మనలోనే నిర్మాణమై ఉంది. మనకు పుత్రధర్మం, పితృధర్మం, పతిధర్మం, పత్నీధర్మం, దేశధర్మం... ఇలా అనేక ధర్మాలు ఉన్నాయి.


‘సర్వ ధర్మాన్‌ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ... అన్ని ధర్మాలను వదిలిపెట్టు. నన్ను శరణాగతి వేడు’’ అన్నాడు శ్రీకృష్ణుడు. ధర్మాలన్నిటినీ ఆయనకు సమర్పిస్తే... అవి ఒక సమ స్థితికి వస్తాయి. ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత...

ఉత్తమ ధర్మాలను మనలో ఆయన స్థిరపరుస్తాడు. మనలో శ్రీకృష్ణుడి గుణగణాలు జాగృతి చెందడం చాలా ముఖ్యం. ఆయన పద్ధతి తేనెలా ఎంతో మధురంగా ఉంటుంది. అందుకే ఆయన ఆశీస్సులు పొందాలనుకొనే ప్రజలు ‘మాధవ’ అని సంబోధించారు. అయితే దుర్మార్గులకు ఆయన అతి భయంకరుడు.

శ్రీకృష్ణుడు సామూహికతకు ప్రాధాన్యత ఇస్తాడు. సామూహికంగా మనకున్న సంబంధాలను ఉపయోగించుకుంటూ... సత్యం, ప్రేమ, కరుణ, ఆత్మసాక్షాత్కారాలను సాకారం చేసుకోవాలి. కుండలినీ ఉత్థానం ద్వారా ఆత్మసాక్షాత్కారం పొంది, సహజయోగ సాధనతో స్థితప్రజ్ఞ స్థితిని సాధించవచ్చునని శ్రీమాతాజీ నిర్మలాదేవి నిరూపించారు.

మన అంతర్గత సూక్ష్మ శరీర నాడీ వ్యవస్థలో ఏడు చక్రాలు ఉంటాయి. వాటిలో విశుద్ధ చక్రంలో... అధిష్ఠాన దేవతగా శ్రీకృష్ణుడు ఆసీనుడై ఉంటాడు. ఆయన చెప్పిన ధర్మ సూత్రాలను, అనుసరించిన ధర్మ మార్గాలను మనం అనుసరిస్తే ఆయన అనుగ్రహానికి పాత్రులం అవుతాం.

Updated Date - Aug 23 , 2024 | 05:34 AM