Share News

Shwetha mantri : నవ్విస్తూనే నిలదీస్తారు

ABN , Publish Date - Nov 11 , 2024 | 02:34 AM

సమస్యలపై నిలదీయడం శ్వేతా మంత్రి నైజం. వైకల్యంతో ఉన్నవారి ఇబ్బందుల గురించి గట్టిగా మాట్లాడినందుకు ఆమె అవహేళనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు అవే మాటలకు హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ జోడించి... స్టాండప్‌ కమెడియన్‌గా ప్రేక్షకుల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నారు.

Shwetha mantri  : నవ్విస్తూనే నిలదీస్తారు

సమస్యలపై నిలదీయడం శ్వేతా మంత్రి నైజం. వైకల్యంతో ఉన్నవారి ఇబ్బందుల గురించి గట్టిగా మాట్లాడినందుకు ఆమె అవహేళనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు అవే మాటలకు హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ జోడించి... స్టాండప్‌ కమెడియన్‌గా ప్రేక్షకుల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నారు.

‘‘మార్పునకు హాస్యం కూడా ఒక సాధనంగా ఉపయోగించవచ్చనే ఆలోచన నాకు రావడానికి ముందు... ఎన్నో వైఫల్యాలను భరించాను. వైకల్యాలతో ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే సమస్యలను, సవాళ్ళను వివరిస్తూ ఒక చిత్రాన్ని తీశాను. అది ఆదరణ పొందలేదు సరికదా... నేను అవహేళనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘‘ప్రతిదానికీ ప్రభుత్వం మీదో, అధికారుల మీదో, సమాజం మీదో ఫిర్యాదులు ఎందుకు చేస్తారు? మీకు అందుబాటులో ఉన్న వనరుల్ని వినియోగించుకొని బాగుపడండి’’ అని ఒక అధికారి నా ముఖం మీదే అన్నారు. ఎంతో అవమానంగా అనిపించింది. ఇక మా బాధలు ఎవరితో చెప్పుకోవాలనే నైరాశ్యం ఆవరించింది.

  • ఆ ప్రశ్న వేధించింది...

మా సొంత ఊరు మహారాష్ట్రలోని పుణే. నేను ‘స్పైనా బైఫిడా’ అనే సమస్యతో పుట్టాను. దీనివల్ల వెన్నెముక సరిగ్గా అభివృద్ధి కాదు. నా పరిస్థితి చూసి తల్లడిల్లిన నా తల్లితండ్రులు ఎన్నో ఆసుపత్రులకు తిరిగారు. శస్త్రచికిత్సలు, ఫిజియో థెరపీ చేయించారు. అప్పటివరకు నిలబడలేకుండా ఉన్న నేను క్రచెస్‌ ఉపయోగించి నడిచే స్థితికి వచ్చాను. నాకు ఏడేళ్ళు వచ్చేవరకూ ఎవరో ఒకరు నన్ను ఎత్తుకొని తీసుకువెళ్ళి, బడిలో దించి వచ్చేవారు. ఆ తరువాత ఆటోలో కష్టపడి నన్ను ఎక్కించాల్సి వచ్చేది. అక్కడ దిగాక తోటి విద్యార్థుల సాయంతో తరగతి గదిలోకి వెళ్ళేదాన్ని. శారీరకంగా, మానసికంగా అది ఎంతో బాధగా అనిపించేది. కానీ చదువంటే నాకు ఇష్టం కాబట్టి ఓర్చుకున్నాను. కాలేజీకి వచ్చాక... మావాళ్ళు నాకు ఎలక్ట్రికల్‌ ఛైర్‌ కొన్నారు. కానీ తరగతి గదివరకూ దాన్ని నడిపించుకు వెళ్ళే సదుపాయం లేదు. అక్కడే కాదు, వైకల్యంతో ఉన్నవారికి అనువుగా ఉండే సౌకర్యాలు చాలా చోట్ల ఉండేవి కావు.


2007లో మమ్మల్ని రాజస్థాన్‌ టూర్‌కు తీసుకువెళ్ళారు. పాశ్చాత్య శైలిలో ఉండే టాయిలెట్లు ఆఖరికి హైవేల మీద ఉన్న ధాబాల్లో సైతం ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. వాటి యజమానులను అడిగితే... ‘‘అవి విదేశీయుల కోసం’’ అని చెప్పారు. వేరే దేశాల నుంచి వచ్చేవారికోసం చేసే ఇలాంటి ఏర్పాట్లను వికలాంగుల కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఎందుకు చెయ్యకూడదనే ప్రశ్న నన్ను వేధించింది. అదే కొన్నేళ్ళ తరువాత... చక్రాల కుర్చీకే పరిమితమైన నా స్నేహితుడు విశాల్‌ సావంత్‌ తో కలిసి ‘గివ్‌ సమ్‌ స్పేస్‌’ అనే ప్రాజెక్ట్‌ ప్రారంభించడానికి నాంది పలికింది. నిధులు సేకరించి పుణేలోని ప్రధాన ప్రాంతాల్లో, పుస్తకాల దుకాణాలు, రెస్టారెంట్లు, విద్యా సంస్థల్లో చక్రాల కుర్చీలతో వెళ్ళడానికి వీలుగా ర్యాంప్‌లు ఏర్పాటు చేశాం.

  • కొత్త పద్ధతిలో చెప్పాలనుకున్నా...

వైకల్యాలు ఉన్నవారి సమస్యలను సమాజానికి అర్థమయ్యేలా చెప్పాలనే తపనతో... 2014లో ఒక చిత్రాన్ని తీశాను. పలు చోట్ల ప్రదర్శించాను. కానీ నేను ఆశించిన స్పందన రాకపోగా... వ్యతిరేకతను, అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దానితో మళ్ళీ అలాంటి ఆలోచన చెయ్యలేదు. మా ప్రాజెక్టుకు, వివిధ సంస్థలతో భాగస్వామ్యానికి పరిమితమయ్యాను. కానీ 2016లో జరిగిన ఒక ప్రమాదంతో కొన్నాళ్ళు ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో అప్పటివరకూ సాగిన నా ప్రయాణాన్ని, విజయాలను, వైఫల్యాలను సమీక్షించుకున్నాను. సమాజానికి నేను చెప్పాలనుకున్నది కొత్త పద్ధతిలో వినిపించాలనుకున్నాను. దానికోసం స్టాండప్‌ కామెడీని ఎంచుకున్నాను. కోలుకున్న తరువాత పుణేలో మొదటి ప్రదర్శన ఇచ్చాను. వైకల్యంతో ఉన్న ఒక మహిళ స్టాండప్‌ కామెడీ చేయడాన్ని జనం ఆమోదించడం కష్టం.


నా మాటలతో వారికి హాస్యాన్ని అందిస్తూనే... వికలాంగుల పట్ల వారికి ఉన్న బాధ్యతను కూడా తెలియజేయాలి. నాలాంటి వారి మీద జాలికే పరిమితం కాకుండా... బహిరంగ ప్రదేశాల్లో వారు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఏం చేయగలం? అనే ఆలోచన కలిగించాలి. మళ్ళీ ఇదంతా పాఠం చెబుతున్నట్టో, నిష్టూరం ఆడుతున్నట్టో, బతిమాలుతున్నట్టో, నిందిస్తున్నట్టో ఉండకూడదు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని నా స్ర్కిప్ట్‌ రాసుకున్నాను. నా ప్రదర్శనకు మంచి స్పందన వచ్చింది. పలు క్లబ్‌లు, కేఫ్‌ల నుంచి ఆహ్వానాలు వెల్లువెత్తాయి.

  • వదులుకున్నవే ఎక్కువ...

ఇప్పటివరకూ 300కు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. కానీ వదులుకున్నవి అంతకన్నా ఎన్నో రెట్లు ఉన్నాయి. ఎందుకంటే నా ఎడమ కాలు సరిగ్గా పనిచెయ్యదు. ఫిజియోథెరపీ ద్వారా 20 నుంచి ముప్ఫై శాతం కదల్చగలుగుతున్నాను. కానీ కదలిక ఇప్పటికీ నాకు సమస్యే. ఇది వరకు నేను లెగ్‌ బ్రేసెస్‌ లేకుండా ఏడు నిమిషాలు నిలబడగలిగేదాన్ని. ఇప్పుడు ఒక్క నిమిషమే నిలబడగలుగుతున్నాను. ఇక, నాకున్న ఆరోగ్య సమస్య వల్ల తరచూ వాష్‌రూమ్‌కు వెళ్ళాల్సి వస్తుంది. సరైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బంది మరింత పెరుగుతోంది. అందుకే ‘ప్రదర్శన ఇచ్చే వేదికకు వాష్‌రూమ్‌ దగ్గరగా ఉందా? ఎన్ని మెట్లు ఎక్కాలి? వేదికను చేరడానికి ఎంత సేపు పడుతుంది?’ అనే విషయాలనే ముఖ్యంగా పరిగణనలోకి తీసుకుంటాను.’’


  • ఆదాయంలో అధిక శాతం వారికే...

ప్రదర్శనల ద్వారా నాకు వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగాన్ని వికలాంగుల సౌకర్యాల కోసం ఖర్చు చేస్తున్నాను. అలాగే నా ప్రేక్షకులను కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాను. వైకల్యాలు ఉన్నవారికి నేను చెప్పగలిగేది ఏమిటంటే... ఎలాంటి పరిస్థితి ఎదురైనా కుంగిపోకండి. మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోండి. మీదైన అస్తిత్వాన్ని సృష్టించుకోండి. నిర్భయంగా మాట్లాడండి. నిజం అని నమ్మినదాన్ని జంకు లేకుండా చెప్పండి. వేరొకరిలా ఉండాలని ప్రయత్నించకండి. వైకల్యాలు దాదాపుగా మన జీవితాంతం మనతోనే ఉంటాయి. ఈ సత్యాన్ని ఆమోదించాలి. మన హక్కులు సాధించుకోవడానికి నిరంతరం పోరాడుతూనే ఉండాలి.’’

Untitled-2 copy.jpg

Updated Date - Nov 11 , 2024 | 02:39 AM