Miss Universe Pageant : ఈ బామ్మ సూపర్ మోడల్
ABN , Publish Date - Oct 07 , 2024 | 05:52 AM
ఏడుపదుల వయస్సంటే జీవితం ముగిసిపోయినట్టుగా భావిస్తుంటారు. చరమాంకంలో ఇంకా ఏం చేస్తాం అని అంటుంటారు. కానీ దక్షిణకొరియాకు చెందిన చోయ్ సూన్ -హ్వా ఎనిమిదిపదుల వయసులో మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
ఏడుపదుల వయస్సంటే జీవితం ముగిసిపోయినట్టుగా భావిస్తుంటారు. చరమాంకంలో ఇంకా ఏం చేస్తాం అని అంటుంటారు. కానీ దక్షిణకొరియాకు చెందిన చోయ్ సూన్ -హ్వా ఎనిమిదిపదుల వయసులో మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కలలు నెరవేర్చుకోవడానికి వయస్సు అడ్డంకి కాదని నిరూపించారు చోయ్. ఆ విశేషాలు ఇవి...
పాతికేళ్ల వయసులో మోడలింగ్ చేయాలని కలలు కన్నారు చోయ్. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. అయితే ఏడుపదుల వయసులో ఆమె కలను సాకారం చేసుకునే అవకాశం తలుపుతట్టింది. ఆ సమయంలో వయస్సు గురించి ఆలోచిస్తూ కూర్చోలేదు. తన కలను సాకారం చేసుకునేందుకు మోడల్‌గా మారారు. ఆమె దక్షిణ కొరియాకు చెందిన 80 ఏళ్ల చోయ్ సూన్-హ్వా. ఇటీవల జరిగిన దక్షిణ కొరియా మిస్ యూనివర్స్ పోటీల్లో సైతం ఆమె పోటీల్లో పాల్గొని వార్తల్లో నిలిచారు. ఈ పోటీల్లో 31 మందితో పోటీపడ్డారు.
వయోపరిమితి ఎత్తేయడంతో...
గతంలో దక్షిణకొరియా మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనేందుకు వయోపరిమితి 28 ఏళ్లు ఉండేది. ఏడాది కిందే ఆ నిబంధన ఎత్తేశారు. దాంతో పాటు వివాహమైన స్త్రీలు, గర్భిణిలు కూడా పాల్గొనేందుకు అనుమతించారు. ఆ పరిమితిని ఎత్తివేయడంతో చోయ్ సూన్ పాల్గొనడానికి మార్గం సుగమమైంది. ‘‘వయోపరిమితి తీసివేయడంతో నాకు పోటీ చేసే అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నాను. గెలుపోటములు ఎలా ఉన్నా ప్రయత్నించి చూడాలని అనుకున్నాను’’ అని అంటారు చోయ్. 72 ఏళ్ల వయసులో చోయ్‌కి మొదటిసారి మోడలింగ్ చేసే అవకాశం లభించింది. అంతకుముందు ఆమె ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే వారు.
ఆ ఆసుపత్రిలో చేరిన ఒక రోగి చోయ్‌ని చూసి మోడలింగ్‌కు అవకాశం ఇవ్వాలని తెలిసిన వారికి సిఫారసు చేశారు. ‘‘నా పేషెంట్లలో ఒకరు మోడలింగ్ చేయమని సిఫారసు చేశారు. కానీ ఆ మాటలు నేను మొదట్లో పట్టించుకోలేదు. ఏడు పదుల వయసులో మోడలింగ్ చేయడమేంటి? అనుకున్నాను. అయితే యవ్వనంలో నాకు మోడలింగ్‌పై ఆసక్తి ఉండేది. అప్పుడు చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఎందుకు కాదనాలి అనిపించింది. గతంలో కలలు కన్నాను. ఇప్పుడు ఆ కల నెరవేరే అవకాశం వచ్చింది. అందుకే యస్ చెప్పాను.
అలా మోడలింగ్ వైపు నా అడుగు పడింది.’’ అని చెప్పుకొచ్చారు చోయ్. 74 ఏళ్ల వయసులో సియోల్ ఫ్యాషన్ వీక్‌లో అరంగేట్రం చేయడంతో ఆమె కష్టానికి ఫలితం లభించింది. దక్షిణ కొరియాలో ప్రచురితమయ్యే హార్పర్స్ బజార్, ఎల్లే వంటి ప్రసిద్ధ మ్యాగజైన్ కవర్ పేజీలపై ఆమె ఫోటో ప్రచురితమైంది. చోయ్ పాపులర్ కావడంతో అనేక వాణిజ్య ప్రకటనలలో నటించింది. ‘‘కష్టపడి పనిచేస్తాను. విజయం సాధిస్తాను అని దృఢమైన విశ్వాసంతో ఉండే దాన్ని. అదే నాకు గుర్తింపును తెచ్చింది’’ అని అంటారు చోయ్.
బెస్ట్ డ్రస్సర్ అవార్డు
మిస్ యూనివర్స్ పోటీలో గట్టిపోటీని ఇచ్చినా విజేతగా నిలవలేకపోయారు. ఈ పోటీలో విజేతగా నిలిస్తే మెక్సికోలో జరిగే గ్లోబల్ మిస్‌యూనివర్స్ పోటీలో దక్షిణ కొరియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం చోయ్‌కు దక్కేది. ‘‘అందరినీ ఆశ్చర్యానికి గురిచేయాలని అనుకున్నాను. 80 ఏళ్ల వయసులో ఇంత ఆరోగ్యంగా ఎలా ఉంది? ఆమె డైట్ రహస్యం ఏంటి? అని అందరూ మాట్లాడుకునేలా చేయాలని అనుకున్నాను. ఆ విషయంలో విజయం సాధించాను’’ అని అంటారు చోయ్. ఆన్‌లైన్ ఓటింగ్‌తో పాటు న్యాయనిర్ణేతల అభిప్రాయాలతో విజేతను నిర్ణయించారు. ఈ పోటీల్లో బెస్ట్ డ్రస్సర్ అవార్డును ఆమె దక్కించుకున్నారు. ‘‘బాహ్యసౌందర్యం ముఖ్యమే. కానీ అంతఃసౌందర్యం కూడా అంతే ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మంది నెగెటివ్ ఆలోచనలతో బతుకుతున్నారు. కానీ సానుకూల ఆలోచనలతో బతకడం చాలా అవసరం’’ పోటీలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు చోయ్.
మిస్ యూనివర్స్ పోటీల్లో చోయ్ సౌందర్యాన్ని చూసి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని కొంతమంది ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలను తిప్పికొట్టారు చోయ్. ఆమెకి కుటుంబసభ్యుల నుంచి పూర్తిమద్దతు లభించింది. ఆమెకు ముగ్గురు పిల్లలు. మనుమరాళ్లు ఉన్నారు. ‘‘నన్ను చూసి వాళ్లు గర్వపడుతున్నామని చెప్పారు. ఆ మాట నాకెంతో ఆనందాన్నిచ్చింది’’ అని అంటారు చోయ్. అందాల పోటీలలో పాల్గొనాలనుకునే మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు.