Littles : బెడిసికొట్టిన నాటకం
ABN , Publish Date - Jun 10 , 2024 | 11:37 PM
ఒక ఊరిలో రాజారాం అనే దానగుణం కల వ్యక్తి ఉండేవాడు. ఆ ఊరిలో వారంతా అతని దాన గుణాన్ని పొగుడుతూ ఉండేవారు. అదే ఊరిలో ఉండే చలమయ్య అనే మరో వ్యాపారి ఎంగిలి చేతితో కాకిని తోలని పిసినారి. అతను తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు సరిగా జీతాలు కూడా ఇచ్చేవాడు కాదు.
బెడిసికొట్టిన నాటకం
ఒక ఊరిలో రాజారాం అనే దానగుణం కల వ్యక్తి ఉండేవాడు. ఆ ఊరిలో వారంతా అతని దాన గుణాన్ని పొగుడుతూ ఉండేవారు. అదే ఊరిలో ఉండే చలమయ్య అనే మరో వ్యాపారి ఎంగిలి చేతితో కాకిని తోలని పిసినారి. అతను తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు సరిగా జీతాలు కూడా ఇచ్చేవాడు కాదు. ఎవరికీ ఒక పూట అన్నం పెట్టేవాడు కాదు ఆపదలో ఉండి ఎవరైనా సాయం అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చేసేవాడు కాదు. కానీ చలమయ్యకి రాజారాం లాగా మంచిపేరు సంపాదించుకోవాలని కోరిక. అతను ఒక రోజు తన నౌకరును పిలిచి, నేను ఏం చేసినా ఆ రాజారాం లాగా మంచిపేరు రావడం లేదు నేను కూడా అతనిలాగా గౌరవం పొందాలంటే ఏం చేయాలో ఉపాయం ఆలోచించాలి అన్నాడు దానికా నౌకరు. ‘నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఆ రాజారాం మంచివాడే కానీ పెద్ద తెలివి గల వాడు మాత్రం కాదు. మీరు ఒక రోజు ఆ రాజారాంను భోజనానికి పిలవండి. అతను ఇక్కడ భోజనం చేస్తున్నపుడు నేను ఇంటి ముందు బిచ్చగాడిలా వేషం వేసుకుని వస్తాను మీరు నాకు డబ్బు దానం చేయండి.
ఇదంతా చూసిన అతను ఊరిలోకి వెళ్లి మీ దానగుణం గురించి అందరి ముందు పొగిడి మీకు మంచి పేరుతెస్తాడు అతనే స్వయంగా చెబితే ఊరిలో అందరూ నమ్మేస్తారు’ అన్నాడు. ఈ ఉపాయం బాగుందనుకున్న చలమయ్య ఐతే ఇపుడే రాజారాం ఇంటికి వెళ్లి రేపే మన ఇంటికి భోజనానికి ఆహ్వానించు అని తొందర పెట్టాడు. నౌకరు తన యజమాని చెప్పిన విధంగానే రాజారాం ఇంటికి వెళ్లాడు. అయ్యా మా యజమాని చలమయ్య గారు రేపు తమర్ని వారింటికి భోజనానికి రావల్సిందిగా పిలిచారు అని చెప్పాడు. దానికి రాజారాం అదేమిటయ్యా మీ యజమానికి నేనంటే పడదని విన్నాను.
ఆయన ఎవరికీ పది పైసలు కూడా సాయం చేయడు కదా. అలాంటిది నన్ను ఇంటికి పిలవడం ఏమిటి అన్నాడు ఆశ్చర్యంగా. దానికా నౌకరు ఆయ్యా మా యజమాని మీ వలె దానగుణం కలవాడే కానీ.. ఆయన చేసేవన్నీ ఎవరికీ తెలియకుండా చేసే దానాలు తానుచేసే మంచి పనులను గురించి ఎవరూ బయట చెప్పడం పొగడటం ఆయనకు నచ్చదు. ఇంటి ముందుకు ఎవరు వచ్చి చేయిచాచి అడిగినా కనీసం వంద రూపాయలు ఇచ్చి పంపడం ఆయనకు అలవాటే అన్నాడు. సరే అన్న రాజారాం ఆ మర్నాడు చలమయ్య ఇంటికి వెళ్లాడు రాజారాంను చూసిన చలమయ్య.. అయ్యా తమరు వెంట నౌకరు ఐనా లేకుండా వచ్చారే అని అడిగాడు.
దానికి రాజారాం మా నౌకరు అత్యవసరమైన పని మీద ఇంట్లోనే ఉండిపోయాడు వచ్చేస్తాడు లెండి అని చెప్పాడు ఆ మాటలు విన్న చలమయ్య రాజారాంతో మా నౌకరును మీతో నేను చేసే గుప్తదానాల గురించి అంతా చెప్పాడట కదా అలా నాకు అసలు నచ్చదు అన్నాడు. ఇద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూండగానే చలమయ్య ఇంటి ముందుకు ఒక యాచకుడు వచ్చి ధర్మం చేయండయ్యా అని అరిచాడు. చలమయ్య అతనికి నూరు రూపాయలు ఇచ్చిపంపేసాడు. ఆ వెంటనే మరో యాత్రికుడు.. మరొక పేదవాడు.. ఇలా వెంటవెంటనే పది మంది వచ్చి సాయం అడగగానే చలమయ్య అందరికీ సాయం చేయడం రాజారాంను ఆశ్చర్యపరిచింది. అంత వేగంగా తన నౌకరు అన్ని వేషాలు మార్చి రావడం తన మంచి పేరుకోసం తాపత్రయ పడటం అతనికి ఎంతో సంతోషాన్నిచ్చింది.
కాసేపటి తర్వాత చలమయ్య నౌకరు తన మామూలు దుస్తుల్లో వచ్చి, ఆయ్యా ఇవాళ్టితో మీరు లక్ష రూపాయలు దానం చేసిన సందర్భంగా మీ పేరున గుడిలో అర్చన చేయించి ప్రసాదం తీసుకొచ్చాను ఇదిగో అని ప్రసాదం ఇచ్చాడు. అపుడు చలమయ్య అంత త్వరగా పది వేషాలు మార్చి ఎలా రాగలిగావు రా? ఇంతకీ ఏదీ మన సొమ్ము? వెయ్యి రూపాయలు అన ఆత్రుతగా అడిగాడు దానికి నౌకరు అయ్యా పది సారుల ఏమిటినేను వేషాలు మార్చి వచ్చి దానం తీసుకుననది ఐదు సార్లే ఇదిగోండి మీ దగ్గర తీసుకున్న ఐదు వందలు అంటూ ఐదు వందలు చేతిలో పెట్టాడు. అపుడు చలమయ్య నౌకరుతో నేను మొత్తం పది మందికి ఒక్కొక్కరికి వంద రూపాయల చొప్పున దానం చేసానని గుర్తు.. నువ్వేమో ఐదు సార్లే వచ్చాను అంటున్నావు. మరి మిగతా ఐదుసార్లు వచ్చి దానం పుచ్చుకున్నది ఎవరు అన్నాడు అయోమయంగా.
వాడు మా నౌకరు అయి ఉంటాడులెండి మీ డబ్బు ఎక్కడికీ పోదు. మా నౌకరు కూడా నిజాయితీ పరుడే కాసేపట్లో మీ డబ్బు మీకు అంద జేస్తాడు మంచి చేయాలి కానీ మంచి పేరు కోసం అడ్డదారుల్లో ప్రయత్నించకూడదు చలమయ్య గారూ.. మీరు మీ నౌకరుతో కలసి ఆడిన నాటకం అంతా నాకు ముందే తెలుసు అని చెప్పి అక్కడి నుండి తన నౌకరుతో వెళ్లాడు రాజారాం.