Share News

Sunalini Menon : ఫిల్టర్‌ కాఫీ రుచిమన సొంతం..!

ABN , Publish Date - Sep 14 , 2024 | 02:05 AM

ఆసియాలో మొట్టమొదటి ప్రొఫెషనల్‌ కాఫీ టేస్టర్‌ గా మాత్రమే కాదు, దేశ విదేశాలలో కాఫీ టేస్టర్‌గా ఎన్నో అవార్డులనూ గెలుచుకున్నారామె. కాఫీతో దాదాపు 50 ఏళ్ల తన ప్రయాణంలో ఇక కాఫీ వద్దు అనే క్షణం రాలేదంటున్న ఆమె, సునాలినీ మీనన్‌.

Sunalini Menon : ఫిల్టర్‌ కాఫీ రుచిమన సొంతం..!

ఆసియాలో మొట్టమొదటి ప్రొఫెషనల్‌ కాఫీ టేస్టర్‌ గా మాత్రమే కాదు, దేశ విదేశాలలో కాఫీ టేస్టర్‌గా ఎన్నో అవార్డులనూ గెలుచుకున్నారామె. కాఫీతో దాదాపు 50 ఏళ్ల తన ప్రయాణంలో ఇక కాఫీ వద్దు అనే క్షణం రాలేదంటున్న ఆమె, సునాలినీ మీనన్‌. కాఫీ తనకంతో ఇచ్చిందనీ చెబుతున్న సునాలినీ తన ప్రయాణం ఒడిదుడుకులతోనే సాగినా విజయవంతంగానే కొనసాగుతుందంటున్నారు. కాఫీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ కాఫీ టేస్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు కాఫీ ల్యాబ్‌ తో రైతులకు, వ్యాపారులకు అవసరమైన సేవలనందిస్తూనే చక్కటి,చిక్కటి కాఫీలు మనకు చేరడంలో సహాయపడుతున్నారు. కాఫీ టేస్టింగ్‌ అంటే రుచి చూసి, బాగుందా లేదా అని చెప్పడం మాత్రమే కాదని, వాసన, బీన్‌ రూపు, కాఫీ బీన్స్‌లో ఎసిడిటీ ఇలా ఎన్నో అంశాలను చూడాల్సి ఉంటుందన్న ఆమె నగరంలో జరుగుతున్న మొట్టమొదటి ఇండియన్‌ కాఫీ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతితో చిట్‌ చాట్‌ చేశారు. ఆ విశేషాలు...

ఇండియాలోనే మొట్టమొదటి కాఫీ ఫెస్టివల్‌ ఇది. ఈ ఫెస్ట్‌ బృందంలో ఒకరైన విద్య నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆమె ఉమెన్స్‌ కాఫీ అలయన్స్‌లో సభ్యురాలు. ఆమె ఈ ఫెస్ట్‌ గురించి చెప్పగానే నో అని నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే కాఫీ నా వీక్‌నెస్‌. కాఫీ ఫెస్టివల్‌ అనగానే ఏదో చిన్నగా ఉంటుందనుకున్నాను. కానీ , ఇక్కడ ఇంత పెద్దగా దీనిని నిర్వహిస్తుండటం చూసి ఆశ్చర్య పోయాను.


  • హైదరాబాద్‌తో అనుబంధం...

హైదరాబాద్‌తో నా అనుబంధం అని అంటే.. ప్రత్యేకంగా ఈ నగరంతో కాదు కానీ, ఆంధ్రాతో నాకు ప్రత్యేక అనుబంధమే ఉంది. మరీ ముఖ్యంగా అరకుతో ! హైదరాబాద్‌కు 2010-12 కాలంలో తరచుగా వచ్చేదానిని. అప్పట్లో నాంది ఫౌండేషన్‌తో కలిసి తిరిగాను. అరకులో ఎన్నో అద్భుతాలను చూశాను. అక్కడ గిరిజన మహిళలతో అనుబంధం ఎప్పటికీ మరిచిపోలేను. హైదరాబాద్‌కు రావడం అంటే మరలా నా ఇంటికి నేను తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే, నేను పుట్టింది అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోనే ! కానీ , చిన్నతనంలోనే వదిలి చెన్నై, ఆ తరువాత బెంగళూరు వెళ్లిపోవడంతో తెలుగు మరిచిపోయాను. ఆ భాష వింటుంటే చిన్నతనపు రోజులు గుర్తుకొచ్చాయి. ఆంధ్రాలో కనిపించినంత ఆత్మీయత నన్ను బాగా కదిలించింది.


  • తాగు విధానం కూడా...

కాఫీ పట్ల మన అలవాటుకు మనం చిన్నతనం నుంచి ఇంటిలో కాఫీ తాగిన విధానం కూడా ఓ కారణం అవుతుంది. ఫిల్టర్‌ కాఫీ తాగేవాళ్లు దానినే ఇష్టపడతారు. డబ్బా కాఫీ తాగేవాళ్లు కూడా అలాగే ! మీకు మంచిదనిపించింది మరొకరికి నచ్చకపోవచ్చు. ఇది పూర్తిగా వ్యక్తిగత ఎంపిక.

దక్షిణాది వారు ఫిల్టర్‌ కాఫీని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఏమిటి దానిలో స్పెషాలిటీ అని అంటే, ముందుగా చెప్పినట్లు అది వ్యక్తిగత ప్రాధాన్యత ఆధారంగానే ఉంటుంది. మన దేశంలో ఫిల్టర్‌ కాఫీ ఇష్టపడటానికి దానిని మనవారు కనుగొనడం కూడా ఓ కారణం కావొచ్చు. మీరు ఇటలీ వెళ్తే ఎస్‌ప్రెసో ఇష్టపడతారు. దానితోనే వారు ఎదిగారు. దక్షిణాది వారికి ఫిల్టర్‌ కాఫీ అంతే ! నాకు స్వతహాగా ఫిల్టర్‌కాఫీనే ఇష్టం. ఈ రోజు నేను తాగింది కూడా అదే! ఎందుకంటే, దక్షిణాది వాసిగా నాకు అదే నచ్చుతుంది. టేస్ట్‌ ప్రిఫరెన్స్‌ కావొచ్చు. అలాగని ఎస్‌ప్రెసో కాఫీ బాగోదు. కాపిచినో.. అద్భుతం అని చెప్పలేను.


  • నా ప్రయాణం గురించి చెప్పాలంటే...

నా 19 ఏళ్ల వయసులో కాఫీ టేస్టర్‌గా కాఫీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రయాణం యాధృశ్చికంగా మొదలైంది. అదీ అసిస్టెంట్‌గా! నా 28 ఏళ్ల వయసులో హెడ్‌ ఆఫ్‌ క్వాలిటీ గా ఎంపికయ్యాను. దాదాపు 50 ఏళ్లకు పైగా నా కాఫీ ప్రయాణం సాగింది. నా ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. మా బాస్‌ అప్పట్లో ఒకటే చెప్పారు.. ఓపిగ్గా ఉండు... సబ్జెక్ట్‌ పట్ల పూర్తి అవగాహన పెంచుకో... అనుకున్న దానికి కట్టుబడి ఉండు.. అని. అదే ఇప్పటికీ పాటిస్తున్నాను. నా ప్రయాణం కష్టతరమైనదే కానీ విజయవంతమైనది. కాఫీ టేస్టర్‌గా నాకు అన్నీ తెలుసని మాత్రం ఇప్పటి వరకూ అనుకోలేదు. ఇప్పటికీ ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను.

-గిరి


  • మంచి కాఫీని గుర్తించడం ఎలా..

అసలు మంచి కాఫీ అంటే ఏమిటి ?ఒక్కొక్కరి అభిరుచి ఒక్కోలా ఉంటుంది. మీ మనసుకు ఏది నచ్చితే అదే మంచి కాఫీ అని నేనంటాను. ఒకరికి స్వీటు తినాలని ఉంటుంది. కానీ వారికి మురుకులు పెడితే నచ్చదు. అలాగే జిలేబీ తినాలనుకునే వారికి గులాబ్‌ జామ్‌ పెడితే నచ్చదు. ఎవరి అభిరుచి వారిది. కాఫీ కూడా అంతే! ఒకరికి ఫిల్టర్‌ కాఫీ నచ్చితే మరొకరికి రోస్టెడ్‌ కాఫీ నచ్చవచ్చు. మంచి కాఫీ అనేది వారి వ్యక్తిగత ఎంపిక. కొంతమంది స్ట్రాంగ్‌ కాఫీ కోరుకుంటారు. మరికొంత మంది ఇన్నోవేట్‌గా ఉండాలనుకుంటారు.

Untitled-2 copy.jpg

Updated Date - Sep 14 , 2024 | 02:14 AM