Share News

Thanikella Bharani : మనకు కావలసింది గాఢభక్తి

ABN , Publish Date - Aug 23 , 2024 | 05:46 AM

తనికెళ్ళ భరణి... నాటక, సినీ రచయిత, నటుడు, దర్శకుడే కాదు... ‘ఆటగదరా నీకు’ అంటూ పరమశివుణ్ణి నిందాస్తుతి చేసిన తాత్త్విక కవి. ‘‘నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే ఎదుటివారినీ ప్రేమించు. ఇదే సర్వ ధర్మాల సారం. అదే ఆధ్యాత్మికత’’ అంటున్న ఆయన ‘నివేదన’తో ప్రత్యేకంగా సంభాషించారు.

Thanikella Bharani : మనకు కావలసింది గాఢభక్తి

తనికెళ్ళ భరణి... నాటక, సినీ రచయిత, నటుడు, దర్శకుడే కాదు... ‘ఆటగదరా నీకు’ అంటూ పరమశివుణ్ణి నిందాస్తుతి చేసిన తాత్త్విక కవి. ‘‘నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే ఎదుటివారినీ ప్రేమించు. ఇదే సర్వ ధర్మాల సారం. అదే ఆధ్యాత్మికత’’ అంటున్న ఆయన ‘నివేదన’తో ప్రత్యేకంగా సంభాషించారు.

నేను ‘ఆటగదరా శివా’ అంటూ పద్యాలు రాశాను. వాటిని మళ్ళీ మళ్ళీ చదువుతున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది... ‘ఇది రాసింది నేనేనా?’ అని. ‘ఏదో ఒక శక్తి నాలో ప్రేరణ కలిగించి నాతో అవి రాయించింది. నేను నిమిత్రమాత్రుణ్ణి’ అని గట్టిగా నమ్ముతాను. నాకు పరిజ్ఞానం ఉండవచ్చు. కానీ నాలో సంకల్పం కలగడం, శ్రద్ధగా రాయగలగడం, దానికి నా పరిజ్ఞానం అక్కరకు రావడం, రాసినవి అద్భుతంగా కుదరడం, అవి జనరంజకం కావడం... వీటి వెనుక మానవ ప్రయత్నం ఉన్నా... ఏదో అతీతమైన శక్తి దానికి బలం చేకూర్చి, నాతో ఆ పని చేయించిందని భావిస్తున్నాను.

‘‘నా జీవితంలో అనుకోకుండా అద్భుతాలు కొన్ని జరిగాయి. అవే నన్ను భగవంతుడికి అతుక్కుపోయేలా చేశాయి. నేను గొప్ప ప్రతిభావంతుణ్ణి కాదు. ప్రజ్ఞావంతుణ్ణి కాదు.

నేను పెద్ద పెద్ద చదువులు చదవలేదు. చాలా సామాన్యుణ్ణి. నేను ఇంత జనాదరణ పొందడానికి, ఇంతటి కీర్తి ప్రతిష్టలు రావడానికి, సమాజం నుంచి ప్రేమాభిమానాలు పొందడానికి కారణం కేవలం ‘నా ప్రతిభ’ అని అనుకుంటే అది అవివేకం.

దేవుడి మీద నిర్వివాదమైన భక్తి ఉన్నప్పుడు... ‘పవి పుష్పంబగు, నగ్ని మంచగు.... శివ నీ నామము సర్వవశ్యకరమౌ’ అని ‘శ్రీకాళహస్తీశ్వర శతకం’లో ధూర్జటి చెప్పినట్టు... మనకు ఇబ్బందులు ఎదురైనా కొద్ది కాలంలోనే అవి చెల్లాచెదురైపోతాయి. నాకు ఎదురైన అలాంటి సంఘటన ఒకటి చెబుతాను.


  • ఏదీ దొరకని చోట...

నా కుటుంబంతో, సన్నిహితులతో కలిసి ఒకసారి తమిళనాడులో యాత్ర చేస్తున్నాను. అప్పట్లో నేను శివ దీక్షలో ఉన్నాను. కుంభకోణం దగ్గరకు వచ్చిన తరువాత... ‘‘ఈ రోజు మనం టిఫిన్లు చెయ్యొద్దు. చిదంబరం వెళ్ళేసరికి సరిగ్గా ఒంటిగంట అవుతుంది.

అక్కడ మంచి ప్రసాదం తిందాం’’ అని చెప్పాను. తీరా చిదంబరం వచ్చేసరికి... కావేరీ నీటి వివాదం కారణంగా అక్కడ సమ్మె జరుగుతోంది. గుడితో పాటు దుకాణాలన్నీ మూతపడి ఉన్నాయి. మేము పొద్దున్న టిఫిన్‌ కూడా చెయ్యకుండా వచ్చాం. ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఒక పక్క ఆగాం.

నన్ను అక్కడ ఉంచి... తినడానికి ఏదైనా దొరుకుతుందేమో వెతకడానికి మా వాళ్ళు వెళ్ళారు. నాకు ఎదురుగా షట్టర్‌ వేసేసిన ఒక హొటల్‌ ఉంది. ఆ హొటల్‌ వాచ్‌మేన్‌ నన్ను చూశాడు. ‘‘తినడానికి ఏదైనా ఉంటుందా?’’ అని సైగ చేశాను. అతను లేదని సైగ చేశాడు. ‘నా ఖర్మ’ అన్నట్టు నుదుటి మీద బొటన వేలితో అడ్డంగా రాశాను. అతను ఏమనుకున్నాడో ఏమో? లోపలికి వెళ్ళి, మళ్ళీ బయటకు వచ్చి ఎంతమంది ఉన్నారని సైగ చేశాడు. మేం ఆరుగురం ఉన్నామని వేళ్ళు చూపించాను.

‘అమ్మ బాబోయ్‌’ అన్నట్టు గుండె మీద చెయ్యి వేసుకొని, లోపలకు వెళ్ళిపోయాడు. ఈలోగా మా వాళ్ళు వచ్చారు. ‘‘ఏవీ లేవు. ఇవాళ మనం ఉపవాసమే’’ అన్నారు. ‘ఉపవాసం ఉందాం’ అనుకొని ఉండడం వేరు, తిండి దొరక్క బలవంతంగా ఉపవాసం ఉండడం వేరు. ఒక్కొక్కరినీ ఆకలి దహించేస్తోంది. ఇంతలో ఆ వాచ్‌మేన్‌ బయటికొచ్చాడు. ‘ఒక్కొక్కరూ లోపలికి రండి’ అంటూ సైగ చేశాడు. అందరం వెళ్ళాం.


అప్పుడు హొటల్లో ఉన్న వాళ్ళు ‘‘ఈ రోజు హొటళ్ళు బంద్‌. కాకపోతే మేం తినాలి కాబట్టి మాకోసం సాంబారు, కూర, పచ్చడి లాంటివి చేసుకుంటున్నాం. మీకు అభ్యంతరం లేకపోతే అవే మీకు పెడతాం’’ అన్నారు. ‘‘చద్దన్నం పెట్టినా చాలు’’ అని కూర్చున్నాం. ఇంతలో... మేడ మీద నుంచి ఒక వ్యక్తి కిందకు వచ్చి, నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. ‘‘మీరేంటండీ... ఇక్కడున్నారు?’’ అన్నాడు.

అతను చీఫ్‌ చెఫ్‌. అతనిది శ్రీకాకుళం. విషయం చెప్పాం. ‘‘భలేవారే! మీకేం కావాలో చెప్పండి. అరగంట టైమివ్వండి’’ అన్నాడు. తరువాత అతను ఎంతో ప్రేమతో వంకాయ కూర, సాంబారు, పప్పు, పచ్చడి, పెరుగు, స్వీటు... ఇలా షడ్రుచులతో భోజనం పెట్టి పంపించాడు. అప్పుడు నా భార్య ‘‘మీకు అడవిలోకి వెళ్ళినా అన్నం దొరుకుతుంది’’ అంది. ‘‘మా శివయ్య భార్య అన్నపూర్ణ కదా. అమ్మ ఆకలితో ఉండనిస్తుందా?’’ అన్నాను ఇది చాలా యాదృచ్ఛికంగా జరిగిందే. కానీ ఆ క్షణానికి మాత్రం అది అద్భుతం.


  • ఏ మతమైనా చెబుతున్నది అదే...

‘దైవం మానుష రూపేణ’ అనేది నేను బలంగా నమ్ముతాను. అలాగే ప్రకృతే దైవం. చిన్నప్పుడు ‘పుట్టకు దండం పెట్టు, గుట్టకు దండం పెట్టు, పిట్టకు దండం పెట్టు’ అని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు...

మేము పెట్టేస్తూ ఉండేవాళ్ళం. కాస్త జ్ఞానం వచ్చాక... వేరేవాళ్ళు వేళాకోళం చేస్తూ ఉండేవాళ్ళు. వానరాలకు, వరాహాలకు, చెట్లకు, పుట్టలకు, రాళ్ళకు నమస్కారం చెయ్యడమేమిటని. నాక్కూడా ఒక్కోసారి ‘వాళ్ళ మాటలు నిజమేనేమో? నేను చేసేది అసంబద్ధమేనేమో?’ అనిపించింది.

కానీ మన చుట్టూ ఉన్న ప్రకృతిని, చరాలను, అచరాలను కాపాడుకోవాలనే గొప్ప ఆలోచన దానిలో ఇమిడి ఉన్నదని అర్థమయింది. ఆ ఆలోచనను విస్మరించడం వల్ల కలిగే పర్యవసానాలను ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ భూమి మన అబ్బ సొమ్మేం కాదు. ఇక్కడ బతకడానికి మనకెంత హక్కుందో, చీమకు, దోమకు, ఈగకు కూడా అంతే హక్కు ఉంది.

ముప్పు మనవరకూ వస్తే ఎలా ఉంటుందో కరోనా సమయంలో బాగా తెలిసివచ్చింది. జంతువులు, పక్ష్షులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే... మనం బందీలుగా ఉండిపోయాం. కాబట్టి అన్నిటిలోనూ మనల్ని మనం చూసుకోవాలి. ‘అన్నిటిలోనూ ఉండేది ఒకే ఆత్మ’ అనేది మన తాత్త్వికత. అందుకే‘ నాలోన శివుడు కలడు’ అని రాశాను. నాలోన శివుడు ఉంటే నీలోనూ శివుడు ఉంటాడు. నిన్ను నువ్వు ప్రేమించినట్టు ఎదుటివాణ్ణి కూడా ప్రేమించు. ఏ మతమైనా అదే చెబుతోంది. .


  • భక్తిలో ‘అతి’ కూడదు...

అయితే భక్తిలో కొన్ని అవాంఛితమైన ధోరణులను కూడా మనం చూస్తున్నాం. ఉదాహరణకు వినాయక చవితిని తీసుకుంటే... మన భారతీయుల శక్తిని బ్రిటిష్‌ వారికి చూపించాలన్న అలోచనతో... సామూహికంగా ఉత్సవాలు మొదలుపెట్టాలని లోకమాన్య బాలగంగాధర తిలక్‌ నిర్ణయించారు.

ఇప్పుడు అది సంప్రదాయం అయిపోయింది. వినాయకచవితితో పాటు వేరే పండగలకు కూడా ఇది పాకింది. ప్రతి పండగకూ వీధుల్లోకి రావడం, రోడ్లు మూసేయడం, ఇతరుల పనులకు ఆటంకం కలిగించడం, కొన్నిసార్లు బెదిరించి కూడా చందాలు వసూలు చేయడం... ఇదంతా ‘అతి’. ఆలయాల విషయానికి వస్తే... అభిషేకాన్ని నీళ్ళతో చేసేవారు. ఆ తరువాత పంచామృతాలు అన్నారు.

పంచామృతాలైనా భక్తితో ఒక ఉద్ధరిణితో అభిషేకిస్తే చాలు. ‘నేను వంద కిలోల పెరుగుతో చేస్తాను, వంద కిలోల పంచదారతో చేస్తాను’ అంటూ తమ స్థాయిని భక్తిద్వారా దేవుడికి కాకుండా... లౌకికమైన వాటి ద్వారా ప్రపంచానికి ప్రదర్శించుకోవాలనే ఆరాటం పెరిగిపోయింది. అందుకే...


‘చెంబెడు నీళ్ళుపోస్తె ఖుష్‌...

చిటికెడు బూడ్దె పూస్తె బస్‌...

వొటి పుణ్యానికి మోక్షమిస్తావు గదా

శబ్బా్‌షరా... శంకరా’ అని రాశాను.

‘నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి

పత్రినిసుమంత యెవ్వడు పారవైచు

గామధేనువు వానింట గాడి పసరము

అల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు’ అన్నాడు ‘రాజశేఖర చరిత్ర’లో మాదయ్యగారి మల్లన. శివుడి మీద నీళ్ళు కాస్తంత చిలకరించినా, విసిరినా, పారేసినా కూడా నిన్ను కరుణిస్తాడని అర్థం. అలా కాకుండా కిలోలకి కిలోలతో అభిషేకాలు చేయడం వల్ల మన దేశంలో ఎన్నో శివలింగాలుపాడైపోయాయి, అరిగిపోయాయి. కొన్నేళ్ళ కిందట మనవాళ్ళు కళ్ళు తెరిచి వాటికి వెండి తొడుగో, బంగారు తొడుగో అమర్చి... నేరుగా అభిషేకం చెయ్యడానికి వీల్లేదని చెబుతున్నారు. అలా చెయ్యకపోతే కొన్నాళ్ళకు ఆ శివలింగాలు మాయమైపోతాయి. విభక్తము కానిది భక్తి. కానీ అతి చెయ్యకూడదు. అతి భక్తినే ‘మూఢభక్తి’ అంటారు. నిజానికి అంతరాంతరాల్లో ఉండే భక్తి... గాఢభక్తి. కన్నప్పకు ఉన్నది గాఢభక్తి. మనలో చాలామందికి ఉన్నది మూఢభక్తి.


  • అది మన ఒక్కరికోసం కాదు...

భక్తి తత్పరుడికి ఉండవలసిన ప్రధాన లక్షణం... తను పదిమందికి సాయం చేస్తూ జీవించాలి. పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం... ఆ పరోపకారం అనేది భక్తివల్ల సాధ్యమవుతుంది.

అలాగే సాటి మనుషుల పట్ల, జంతువుల పట్ల, సమస్త జీవుల పట్ల దయాగుణం కలిగి ఉండాలి అనేది నా ప్రధాన ప్రతిపాదన. అప్పుడు మనం చేసే ప్రతి పనిలోనూ మంచి ప్రతిబింబిస్తూ ఉంటుంది. నా పద్యాల్లో సామాజిక పరిస్థితుల మీద ఆవేదన, వ్యగ్యం, నిరసన, కోపం ప్రదర్శించడానికి, చీదరించుకోవడం, చిరాకుపడడం లాంటివి చెయ్యడానికి కారణం...

మనిషిలో, సమాజంలో నైతికమైన మార్పు రావాలనే ఆకాంక్షే. భారత, భాగవత, రామాయణాలన్నీ నీతి పాఠాలే చెప్పాయి. ‘‘ఇలా బతకండి, బాగా బతకండి, సమాజానికి ఉపయోగపడేలా బతకండి. దుర్మార్గాన్ని ఖండించండి’’ అని బోధించాయి. మనం మన ఒక్కరి కోసం కాదు. మనం నూరుశాతం సమాజంలో భాగం. కాబట్టి సమాజం పట్ల మనకు గౌరవం, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. అదే ఆధ్యాత్మికత. సమాజానికి ఉపయోగపడని ఆధ్యాత్మికత వ్యర్థం.’’


  • దేవుణ్ణి ఏం కోరుకోవాలంటే...

బాల్యం నుంచీ నాకు దైవ భక్తి మెండుగానే ఉంది. మా ఇంట్లో శివారాధన ఉంది, విష్ణ్వారాధనా ఉంది. అందుకే ‘ఆటగదరా శివా... ఆటగదరా కేశవా’ అని నా పద్యాన్ని ప్రారంభించాను. శివకేశవులు ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు.

విష్ణు పురాణంలో ‘మద్భక్త శ్శంకరః ద్వేషీ, మద్వేషీ శంకరప్రియః, యో భౌ నరకంయాన్తి, యావశ్చంద్ర దివాకరౌ...’ అన్నారు. ‘‘నన్ను ప్రేమించి శంకరుణ్ణి ద్వేషించేవాడు, శంకరుణ్ణి ప్రేమిస్తూ నన్ను ద్వేషించేవాడు... వాళ్ళిద్దరికీ నరకం తప్ప స్వర్గం రాదు’’ అని కటువుగా చెప్పాడు మహావిష్ణువు.

ఒక దేవుడికి మొక్కుకుంటాం. అనుకున్నది అవుతుంది. ఇక ఆ దేవుణ్ణే నమ్ముకుంటాం. మన బలహీనతలన్నీ దేవుడికి ఆపాదిస్తాం. మనం ఎంత బలహీనులమో... దేవుళ్ళని కూడా అంతే బలహీనులుగా భావిస్తూ ఉంటాం. వాస్తవానికి భగవంతుడు మనకు ఎవరిమీదా ఆధారపడని స్థితి ఇచ్చాడు.

దేవుణ్ణి మనం కోరుకోవలసింది, తీసుకోవలసింది కేవలం ఆత్మ విశ్వాసం, ఆత్మబలం. ‘‘నువ్వు మాకు ఉన్నావు. ఆ ధైర్యంతో మా పని మేం చేసుకుంటాం’’ అనుకోవాలి. అన్నీ దేవుడే చేసేటట్టయితే... కృష్ణుడే యుద్ధం చేసేవాడు కదా! అలా చెయ్యలేదు. ‘‘నువ్వు చెయ్యి. నీ వెనకాల ఉంటాను. లేదా నీ ముందు ఉంటాను’’ అన్నాడు. అన్నీ మనమే చేసుకోవాలి. మనకోసం ఎవ్వరూ చెయ్యరు. ఆ దేవుడు కూడా ఏదీ చెయ్యడు.

-సంభాషణ: కృష్ణశర్మ

Updated Date - Aug 23 , 2024 | 05:47 AM