Share News

గురువులు మలచిన జీవితం నాది

ABN , Publish Date - Sep 04 , 2024 | 04:25 AM

‘‘జాతీయ ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికయ్యానని తెలిసిన వెంటనే భావోద్వేగానికి లోనయ్యాను. ఆ క్షణం నాకు విద్యా బుద్ధులు నేర్పిన మా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు... అందరూ నా కళ్ళముందు మెదిలారు...

గురువులు మలచిన జీవితం నాది

‘నేను గురువులు తీర్చిదిద్దిన ఉపాధ్యాయురాలిని. టీచర్‌ అవ్వాలన్న ఆశయానికి పునాది వేసింది వారే’ అంటారు డాక్టర్‌ నందవరం మృదుల. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికైన ఆమె... రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా ‘నవ్య’తో తన అనుభవాలు పంచుకున్నారు.

‘‘జాతీయ ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికయ్యానని తెలిసిన వెంటనే భావోద్వేగానికి లోనయ్యాను. ఆ క్షణం నాకు విద్యా బుద్ధులు నేర్పిన మా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు... అందరూ నా కళ్ళముందు మెదిలారు. గురువులు మలచిన జీవితం నాది. చిన్నతనంలో నన్ను అమ్మానాన్న కంటే మిన్నగా మా ఉపాధ్యాయులే ఎక్కువ గారాబం చేశారంటే అతిశయోక్తి కాదు. మొట్టమొదట నన్ను ప్రభావితం చేసింది... నాలో టీచర్‌ అవ్వాలన్న కోరికకు పునాది వేసినవారు... సికింద్రాబాద్‌లోని ‘పరోపకారిణి బాలికోన్నత పాఠశాల’లోని మా భువనేశ్వరి టీచర్‌. ఆనాడు ఆమె బోధించిన తెలుగు పాఠాలే నన్ను ఇవాళ తెలుగు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ స్థానంలో నిలబెట్టాయి. బడి వదలగానే నేరుగా మా ఇంటికి దగ్గర్లోని వీధి బడికి వెళ్ళేదాన్ని. అక్కడ రంగమ్మ టీచర్‌ నన్ను దగ్గరకు తీసుకొని... పాఠాలు వల్లె వేయించేవారు. తన ప్రేమానురాగాలతో నాలో చదువుపట్ల అనురక్తి కలిగించారు. పాఠశాల స్థాయిలోనే నేను అక్షరదోషాలు లేకుండా తెలుగులో రాయగలిగినా, మాట్లాడగలిగినా... అదంతా వీరి పుణ్యమే. పాఠ్యాంశాలను సామాజిక అంశాలతో కలగలిపి బోధించడం వారిని చూసే నేర్చుకున్నాను. పాఠం చెప్పి వదిలేయకుండా... వాటి మీద విద్యార్థులతో ప్రతి శనివారం చర్చాగోష్ఠి నిర్వహించడం, కవిత్వం, కథలు రాయించడం లాంటి కార్యక్రమాలతో... తరగతి గదిని ఎంత సృజనాత్మకంగా మార్చవచ్చో నలభై ఏళ్ళ కిందటే మా భువనేశ్వరి టీచర్‌ చేసి చూపించారు. అదే నేను ఈనాటికీ ఆచరిస్తున్నాను.


ఎప్పుడూ బెత్తం పట్టలేదు...

నా పాతికేళ్ళ బోధనా వృత్తిలో నేను ఎన్నడూ బెత్తం చేతపట్టలేదు. ఇంతవరకు ఒక్క విద్యార్థిని కూడా దండించలేదు. అందుకు మా గురువులే నాకు స్ఫూర్తి. తిడితేనో, కొడితేనో క్రమశిక్షణ అలవడుతుందనే వాదనను నేను అస్సలు అంగీకరించను. తరగతి గదిలో అల్లరి పిల్లలు ఉంటారు. మొండి ఘటాలు, మర్యాద తెలియని వారు... ఇలా బోలెడు మంది తారసపడతారు. అలాంటి వారందరితో సున్నితంగా వ్యవహరించడం అధ్యాపకుల విధి. విద్యార్థులను సొంత బిడ్డలుగా భావించినప్పుడే.. వారిని మందలించే అర్హత పొందగలం. గురువుల ఆగ్రహంలో పిల్లల భవిష్యత్తు పట్ల ఆర్తి, ఆవేదన ప్రస్ఫుటమవ్వాలి. అంతేకానీ అకారణ కోపాలు, మితిమీరి స్పందించడాలు లాంటి వాటికి తావు ఉండకూడదు. బోధనా రంగంలో ఉన్నవారు సహనాన్ని కోల్పోకూడదన్నది ప్రాఽథమిక సూత్రం. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లో... మా ఆచార్యులు జీవీ సుబ్రహ్మణ్యం గారు... తన శిష్యులను సైతం ఎన్నడూ ఏకవచనంతో సంబోధించి ఎరుగరు. బోధనేతర సిబ్బందిని ‘‘మాస్టారు’’ అనేవారు. కేకే రంగనాఽథాచార్యులు గారైతే విద్యార్థులను కూడా ఆప్యాయంగా ‘‘మిత్రమా’’ అని పిలిచేవారు. విద్యార్థులతో, ముఖ్యంగా టీనేజర్లతో బోధకులు స్నేహపూర్వకంగా మెలగాలన్నది వారి నుంచి నేర్చుకొన్నాను. విద్యార్థులలోని లోపాలను సవరించే ప్రదేశం తరగతి గది. అది ఎంత ఆహ్లాదంగా ఉంటే పిల్లల భవిష్యత్తుకు అంత మంచిదని నమ్ముతాను. కనుక కొట్టడం, తిట్టడం మాట అటుంచి... విసుక్కోవడాలు, కసురుకోవడాలకు కూడా నేను వ్యతిరేకం.


అదే గుర్తింపు తెచ్చిందనుకుంటున్నా...

తెలుగు సబ్జెక్టు అనగానే, సిలబస్‌ అంతా ఒక నెలలో చెప్పి మిగతా సమయంలో ఇన్విజిలేషన్‌ తదితర డ్యూటీలకు వెళ్ళచ్చు అన్నది చాలామంది అభిప్రాయం. పలు సందర్భాల్లో తెలుగు పీరియడ్‌ను లెక్కలు, సైన్స్‌ బోధకులు తీసుకొంటారు. నా విషయంలో అందుకు పూర్తి విరుద్ధం. మిగతా సబ్జెక్టుల పీరియడ్లను అడిగి మరీ తీసుకొంటాను. పాఠాన్ని పరిగెత్తించడం నాకు నచ్చదు. నేను నిజాం కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో మా సంస్కృత అధ్యాపకురాలు కప్పగంతుల కమలా మేడమ్‌... ఖాళీ సమయంలో కూడా మమ్మల్ని పక్కన కూర్చొబెట్టుకొని... ‘‘రామ శబ్దం అప్పజెప్పమ్మా! ఒక తెలుగు పద్యాన్ని సంస్కృతంలోకి అనువదించి చూపించు’’ అంటూ మాతో సాధన చేయించారు. సెంట్రల్‌ యూనివర్సిటీలో రవ్వా శ్రీహరిగారు సంస్కృత వ్యాకరణం, కేకేఆర్‌ గారు భాషా చరిత్ర, జీవీ సుబ్రహ్మణ్యంగారు సాహిత్య విమర్శ, సి. ఆనందారామం గారు నవలా సాహిత్యం... ఇలా ఒక్కొక్కరూ ఒక్కో అంశంమీద మాకు పసిబిడ్డకు ఉగ్గుపట్టినంత శ్రద్ధగా బోధించారు. కనుకనే మేము ఈ రోజు ఇంతమాత్రమైనా సబ్జెక్టు మీద సాధికారత సాధించగలిగాం. వారి శిష్యురాలిగా... నేను కూడా ‘ఇది నా బాధ్యత మాత్రమే’ అని సరిపెట్టుకోకుండా... నా విద్యార్థులను భావి రీసెర్చి స్కాలర్స్‌గా తయారుచేస్తున్నానన్న స్పృహతో పాఠాలు బోధిస్తున్నాను. బహుశా అదే నాకు ఇవాళ ఈ అరుదైన గుర్తింపు తెచ్చింది అనుకొంటున్నాను.


అవన్నీ అపోహలే...

బి.ఇడి. చేసి టీచర్‌ కావాలనుకున్నా... నాకు ఆ అవకాశం లేకపోవడంతో... పోటీ పరీక్షల్లో ఎంపికై... 1998లో సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకురాలిగా చేరాను. పదేళ్ళ తర్వాత డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా పదోన్నతి మీద మెదక్‌, నర్సాపూర్‌ ప్రభుత్వ కాలేజీల్లో పనిచేశాను. హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన నాకు పల్లె వాతావరణాన్ని దగ్గర చేసింది నా వృత్తి జీవితం. నర్సాపూర్‌ డిగ్రీ కళాశాలలో ఎన్‌సీసీ ప్రోగ్రాం ఆఫీసర్‌గా... పిల్లలతో కలిసి పెద్దచింతకుంట గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాను. వాటిని ఇప్పటికీ ఆ ఊరి సర్పంచ్‌ కొనసాగిస్తున్నారు. మా విద్యార్థులు రాష్ట్రస్థాయి ‘జిజ్ఞాస ప్రాజెక్టు’కు ఎంపికయ్యారు. అంతకు మించిన సంతోషం నాకు మరేదీ ఉండదు. బదిలీమీద మూడేళ్ళ కిందట బేగంపేట ప్రభుత్వ మహిళా కళాశాలకు వచ్చాను. మా ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.పద్మావతి సహకారంతో పుట్టుకతో ఎడమ చెయ్యి లేని అమ్మాయికి కృత్రిమ చెయ్యి పెట్టించాం. మరొక అమ్మాయి కంటి శస్త్ర చికిత్సకు అవసరమైన సొమ్ము సమకూర్చడంలాంటి బాధ్యతలను కళాశాల నిర్వర్తించింది. ప్రభుత్వ కళాశాల అనగానే సమాజంలో ఒకలాంటి అభిప్రాయం స్థిరపడింది. పైగా ప్రభుత్వ బోధకులు అనగానే మొక్కుబడిగా పాఠాలు చెబుతారనుకొంటారు. అవన్నీ అపోహలే అనడానికి ఈ సంఘటనలే ఉదాహరణ. తెలుగులోనూ ప్రవేశాలు పెరిగాయి. మిగతా కోర్సులకు దీటుగా తెలుగును అభ్యసిస్తున్నవారు పెద్దసంఖ్యలోనే ఉన్నారనడంలో సందేహంలేదు.


సాంకేతికత వినియోగం అంతవరకే...

ఉపాధ్యాయుల జీవితంలో సగం తరగతి గదిలోనే గడుస్తుంది. కాలానికి అనుగుణంగా గురు, శిష్యుల బంధంలోనే కాదు... మొత్తంగా తరగతిలోనే అనూహ్య మార్పులు చూస్తున్నాం. ముఖ్యంగా కొవిడ్‌ తర్వాత ఆన్‌లైన్‌ తరగతులు బోధనలో భాగమయ్యాయి. ఎంత ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ యుగమైనా, గురువుకు తెలియని సమాచారం గూగుల్‌కు తెలిసినా... అవి మంచి సమాజాన్ని నిర్మించలేవు కదా! పైగా అవి విద్యార్థుల్లో విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పెంపొందిస్తాయనుకోవడం లేదు. నేను కూడా తరగతికి హాజరు కాలేకపోయిన విద్యార్థులకు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ క్లాస్‌ తీసుకొంటుంటా. సెలవుల్లోనూ సబ్జెక్టులో వారి సందేహాలు తీర్చడానికి డిజిటల్‌ ఫ్లాట్‌ఫారమ్‌ను ఆశ్రయిస్తాను... అంతవరకే! బోధనకు సాంకేతికతను ఉపయోగించుకోవాలే కానీ, పూర్తిగా దాని మీదే ఆధారపడతామంటే మాత్రం విద్యావంతులను తయారవుతారేమోగానీ విజ్ఞానవంతులు మాత్రం కాలేరు.

కేవీ

ఫొటోలు: రాజ్‌కుమార్‌


అది అవార్డులు ఇవ్వలేని సంతోషం...

‘‘ఉపాధ్యాయుల ఆహార్యం ఆకర్షించేలా కాకుండా, విద్యార్థులను ఆకట్టుకుంటూనే వీలైనంత నిరాడంబరంగా ఉండాలి. అది నేను మా గురువులను చూసి నేర్చుకొన్నాను. మా ఉపాధ్యాయులను అనుసరిస్తూ, నేనూ కాటన్‌ చీరలు మాత్రమే ధరిస్తాను. ఎలక్షన్‌ డ్యూటీ నిమిత్తంగ్రామాలకు ఎప్పుడు వెళ్ళినా... అక్కడ కనీసం ఇద్దరు ముగ్గురైనా ‘‘మీ విద్యార్థులం మేడం. ఆనాడు మీరు చెప్పిన మాటల వల్ల జీవితంలో ముందుకు వెళ్ళగలిగాం’’ అంటూ కృతజ్ఞతలు చెబుతుంటారు. ఒక అమ్మాయి అయితే, తనకు పెళ్లయ్యాక కూడా చదువు కొనసాగించి ఉద్యోగంలో స్థిరపడినట్టు చెప్పారు. అలాంటి సందర్భాల్లో కలిగే సంతోషాన్ని అవార్డులు కూడా ఇవ్వలేవు.

అమ్మను చూసి నేర్చుకున్నా...

మా అమ్మ వెంకటేశ్వరమ్మ, మా నాన్న విష్ణుప్రసాద్‌. ‘పెద్దలను గౌరవించాలి’ అని వారు నేర్పిన సంస్కారమే నన్ను గొప్ప ఉపాధ్యాయులకు శిష్యురాలిని చేసింది. ఒకవైపు ఉద్యోగాన్ని, మరో వైపు ఇంటిని సమన్వయం చేసుకొంటూ ఎలా ముందుకెళ్లాలో ఉద్యోగి అయిన మా అమ్మను చూసి నేర్చుకొన్నా. కరోనా సమయంలో మృత్యువు అంచు వరకు వెళ్లి వచ్చిన నన్ను తిరిగి ఆరోగ్యవంతురాలిని చేసింది... నా భర్త నరసింహారావు, కుమారుడు అత్రి, కుమార్తె మైత్రి. కొన్ని నెలలపాటు మంచానికే పరిమితమైన నాకు ఆ సమయంలో వారు చేసిన సపర్యలు మా కన్నవారిని తలపించింది. వారి ప్రేమను ఇంతగా పొందుతున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిని.

Updated Date - Sep 04 , 2024 | 04:25 AM