Share News

విశ్వానికిమూలాధారం

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:38 AM

‘నేను నీకు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని వివరిస్తాను. నువ్వు వాటిని గ్రహించిన తరువాత, నీకు తెలుసుకోవలసినవేవీ ఇక మిగిలి ఉండవు’’ అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు.

విశ్వానికిమూలాధారం

‘‘నేను నీకు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని వివరిస్తాను. నువ్వు వాటిని గ్రహించిన తరువాత, నీకు తెలుసుకోవలసినవేవీ ఇక మిగిలి ఉండవు’’ అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు.

మేధస్సు మీద ఆధారపడినవారికి జ్ఞాన, విజ్ఞానాల ద్వారా సాగే మార్గం ఇది. అంతకుముందు మనస్సు ఆధారంగా ఉన్నవారి కోసం (భక్తిలో ఉన్న వ్యక్తుల కోసం) అన్ని జీవులు ఆత్మలో ఉన్నాయని, ఆత్మ అన్ని జీవులలోనూ ఉందనీ గ్రహించడం గురించి, అతణ్ణి (భగవంతుణ్ణి) అన్నిచోట్లా చూడడం గురించి శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇది తెలిసిన తరువాత తెలియనిదేదీ ఉండదని తెలిపాడు.

‘ఏదీ లేకపోవడం నుంచి విశ్వం ఉద్భవించవచ్చు’ అని ఇటీవలి శాస్త్రీయ నిర్ధారణ చెబుతోంది. విస్తరిస్తున్న మన విశ్వం సృష్టి 13.8 బిలియన్‌ సంవత్సరాల కిందట ఒక ‘బిగ్‌ బ్యాంగ్‌’ ద్వారా జరిగిందంటోది సైన్స్‌. కాస్మిక్‌ మైక్రోవేవ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ రేడియేషన్‌ (సిఎంబిఆర్‌) దృక్పథం ఆధారంగా చూసినప్పుడు, ప్రస్తుతం ఉన్నదానికి ముందు ఒక విశ్వం ఉందనే వాదన ఉంది.

విశ్వం విస్తరణ చాలా తక్కువ అనీ, కానీ ఖాళీ స్థలం (శూన్యం) తాలూకు శక్తి మరో విశ్వాన్ని సృష్టించగలదనీ దాని అంచనా. ఇదంతా సృష్టి, ఆ సృష్టి నాశనం కావడం తాలూకు ‘చక్రీయ ప్రక్రియ’ (సైక్లిక్‌ ప్రాసెస్‌) అని అది సూచిస్తుంది.

‘‘మొత్తం విశ్వానికి మూలం నేనే, ప్రళయం నేనే’’ అనే కృష్టుడి మాటలను అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.. మొదట, ఇది ఒక చక్రీయ ప్రక్రియకు సూచిక.

రెండోది, సృష్టి, వినాశనం... ఈ రెండిటినీ ఏకత్వం ఆవరించడం. గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ప్రతి సంస్కృతి భగవంతుణ్ణి సృష్టికర్తగా కీర్తించింది. కానీ, పరమాత్మగా... తాను సృష్టికర్తననీ, అలాగే నాశనకర్తననీ కూడా శ్రీకృష్ణుడు ప్రకటించాడు.

‘‘నాకన్నా అత్యున్నతమైనది మరేదీ లేదు. మొత్తం విశ్వమంతా ఒక దారానికి గుచ్చిన రత్నాల్లా నాలో కూర్చి ఉంది’’ అని చెప్పాడు. వ్యక్తమైన (రత్నాలు), అవ్యక్తమైన (దారం) వాటిని వివరించడానికి రత్నాల హారం అనే ఉదాహరణను తరచూ ఉపయోగిస్తూ ఉంటారు.

దారం కనిపించదు, దారం ఆధారం లేనిదే రత్నాలు అందమైన ఆభరణంగా ఉండలేవు. కనిపించని వేర్లు లేకపోతే చెట్టు మనుగడ సాగించలేదు కదా! అలాగే పరమాత్మ లేనిదే విశ్వం ఉనికి లేదు. విశ్వం ఉనికికి మూలాధారం ఆ పరమాత్మే.

Updated Date - Apr 26 , 2024 | 12:38 AM