Share News

Navya : ఆ అడ్డంకులు తొలగాలంటే..

ABN , Publish Date - Jun 21 , 2024 | 12:18 AM

పతంజలి మహర్షి గొప్ప శాస్త్రవేత్త. మనిషి మనస్సును ఆయన అర్థం చేసుకున్నట్టుగా ఎవరూ అర్థం చేసుకోలేదు. తాను రచించిన ప్రధాన గ్రంథమైన ‘యోగ సూత్రాల’లో...

Navya :  ఆ అడ్డంకులు తొలగాలంటే..

విశేషం

పతంజలి మహర్షి గొప్ప శాస్త్రవేత్త. మనిషి మనస్సును ఆయన అర్థం చేసుకున్నట్టుగా ఎవరూ అర్థం చేసుకోలేదు. తాను రచించిన ప్రధాన గ్రంథమైన ‘యోగ సూత్రాల’లో... యోగ మార్గంలో ఎదురయ్యే తొమ్మిది అడ్డంకుల గురించి ఆయన చర్చించారు. అవి: వ్యాధి (శారీరక అనారోగ్యం), స్థాన్య (మానసిక అనారోగ్యం లేదా విషయాలను అర్థం చేసుకోలేకపో వడం), సంశయ (సందేహం), ప్రమాద (అజాగ్రత్త), ఆలస్య (సోమరితనం), అవిరతి (ఇంద్రియాల పట్ల అనుబంధం), భ్రాంతి దర్శన (భ్రాంతి, ఊహాలోకంలో ఉండిపోవడం) అలబ్ధ భూమికత్వం (ఏ స్థితినీ పొందలేకపోవడం), అనవస్థితత్వం (స్థిరత్వం లేకపోవడం). సాధనా మార్గంలో ఏయే అడ్డంకులు వచ్చే అవకాశం ఉందో వాటన్నిటినీ ఈ తొమ్మిదింటిలో మహర్షి చెప్పేశాడు. ఇంతకుమించి మరే అడ్డంకీ ఉండే అవకాశం లేదు.

మరి వాటిని తొలగించుకోవడం ఎలా? ఒకసారి ఒక పనిని మాత్రమే ఎంచుకొని చేయడమే. దీనికే ‘ఏకతత్వాభ్యాసం’ అని పేరు. ఒకే సూత్రానికి కట్టుబడి సాధన చేయడం. ఆ సూత్రం దైవం కావచ్చు, ఏదైనా పదార్థం కావచ్చు, గురువు కావచ్చు లేదు నీకు నీవే కావచ్చు. ఆ విషయం ఏదైనా సరే... ఒకే దానిమీద సాధన చేసినట్టయితే... తొమ్మిది అడ్డంకులూ తొలగిపోతాయి. ఇదంతా మీలో కొంత ప్రశాంతత ఉన్నప్పుడే సాధ్యమవుతుంది.

ఏకతత్వాభ్యాసానికి కొంత ప్రశాంతత అవసరం. అంటే అది లేకపోతే ఇది సాధ్యపడదు. ఏకతత్వాభాసం గురించి మరింత వివరంగా చెప్పుకోవాలంటే... ఒకే సూత్రాన్ని అంటిపెట్టుకొని ఉండడం. అంటే తనను, భగవంతుణ్ణి లేదా గురువును... అందరిలోనూ చూడ డం. ఒకే సూత్రాన్ని ప్రతి ఒక్కరిలో, ప్రతి వస్తువులో చూడడం. ‘నేనే ప్రతి ఒక్కరిలో ఉన్నాను. లేదా నా గురువే అంతటా ప్రత్యక్షమై ఉన్నాడు. నా గురువు తప్ప వేరే ఎవ్వరూ లేరు. ఆయనే నాకు సర్వస్వం లేదా భగవంతుడే నా సర్వస్వం. అంతా నేను మాత్రమే ఉన్నాను’ అని భావించడం. అదే జీవన నైపుణ్యం.


అడ్డంకులు, అవరోధాలు ఎగురైనప్పుడు... మనల్ని దారి తప్పించే పరిణామాలు కొన్ని కలుగుతాయి. వాటిలో కొన్ని: దుఃఖ- బాధలు పడడం, దౌర్మనస్య - మానసిక దుర్బలత, అంగమేజయత్వ - శరీరం మీ మాట వినకపోవడం. అంటే శరీరానికి, మనస్సుకు సమన్వయం కుదరకపోవడం, చివరకు శరీరమే గెలవడం.

ఎక్కువ మద్యం సేవించిన వ్యక్తి ఎడమవైపు వెళ్ళాలనుకొని కుడివైపు వెళ్తూ ఉంటాడు. తిన్నగా వెళదామని అనుకుంటాడు. కానీ శరీరం సహకరిం చదు. అలాగే శ్వాస ప్రశ్వాస - ఒక క్రమం లేకుండా, వణుకుతూ... అసౌకర్యంగా ఉండే శ్వాస. మీరు గమనించినట్టయితే... మీరు ఆనందంగా, ఉత్సాహంతో ఉన్నప్పుడు లోపలికి పీల్చుకొనే గాలి ఎక్కువగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు... బయటికి వదిలే శ్వాస దీర్ఘంగా ఉంటుంది.

శ్వాస సక్రమంగా, స్థిరంగా ఉండదు. మరి వీటిని వదిలించుకోవాలంటే ఏం చెయ్యాలి? ‘‘ఏకతత్వాభ్యాస... ఒక సూత్రాన్ని లేదా మార్గాన్ని ఎంచుకొని దాన్నే సాధన చెయ్యండి’’ అని పతంజలి మహర్షి చెబుతున్నాడు.

- గురుదేవ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌

Updated Date - Jun 21 , 2024 | 12:18 AM