Health : కడుపు ఉబ్బరం.. ఉఫ్
ABN , Publish Date - Oct 22 , 2024 | 05:38 AM
భారతీయులకు పిండిపదార్థాల పట్ల మక్కువ ఎక్కువ. పప్పుదినుసులు, పిండ్లు, బియ్యం... మన ప్రధాన ఆహారం.
గట్ హెల్త్
భారతీయులకు పిండిపదార్థాల పట్ల మక్కువ ఎక్కువ. పప్పుదినుసులు, పిండ్లు, బియ్యం... మన ప్రధాన ఆహారం. కాబట్టే కడుపు ఉబ్బరం అత్యంత సాధారణమైన ఆరోగ్య సమస్యగా మారిపోయింది. అయితే ఈ సమస్యను పరిష్కరించుకునే మార్గాలు కూడా ఉన్నాయి.
పప్పుదినుసులు, తృణధాన్యాల్లో పిండిపదార్థాలు ఎక్కువ. వీటిని పేగులు శోషించుకోడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో పేగుల్లో బ్యాక్టీరియా ఉత్పత్తై కడుపుబ్బరం, త్రేన్పులు వేధిస్తాయి. పేగుల్లోని మంచి, చెడు బ్యాక్టీరియల్లో హెచ్చుతగ్గులు, సున్నితమైన జీర్ణాశయం, వేగంగా తినడం, ఆహారాన్ని సరిగా నమలకపోవడం వల్ల కూడా పొట్టలో వాయువులు ఉత్పత్తవుతాయి.
ఒత్తిడి కూడా కారణమే!
ఒత్తిడి అజీర్తిని పెంచుతుంది. కడుపులోని కండరాలు బిగుతుగా మారతాయి. వ్యాధినిరోధకశక్తి కూడా కుంటుపడుతుంది. పొట్టలో ఆమ్లం ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దాంతో అవసరానికి మించి పిండిపదార్థాల మీద యావ పెరగడం, అవి జీర్ణం కాలేకపోవడం వల్ల కడుపులో వాయువులు ఉత్పత్తవడం మొదలవుతుంది. ఇవన్నీ కడుపుబ్బరానికి దారి తీస్తాయి.
వంటింటి చిట్కాలు
గోరువెచ్చని నీళ్లలో జీలకర్ర, వాము, సోంపు గింజలు నానబెట్టి తాగితే కడుపుబ్బరం తగ్గుతుంది. అలాగే దాల్చినచెక్కలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. కాబట్టి దాల్చినచెక్క తీసుకుంటే, ఇన్‌ఫ్లమేషన్, రక్తంలో చక్కెర, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. వాంతులను తగ్గించి, జీర్ణశక్తిని పెంచే గుణం కూడా దాల్చినచెక్కకు ఉంటుంది. వెల్లుల్లి, తోటకూర విత్తనాలు, అరటిపండు, వంకాయలు ప్రిబయాటిక్స్‌కు కోవకు చెందుతాయి. గ్రీన్‌టీ, యాపిల్స్‌లో ఉండే పాలిఫినాల్స్ పేగుల్లో ప్రొబయాటిక్స్‌ను పెంచి, పేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి ప్రొబయాటిక్స్, పాలిఫినాల్స్‌ను తీసుకుంటూ ఉండాలి. నెయ్యి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి జీర్ణశక్తిని పెంచుకోడానికి, కల్తీ లేని తాజా నెయ్యి పరిమితంగా తీసుకోవాలి. నూనెలో వేయించే పదార్థాలు పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతాయి. జీర్ణశక్తిని కుంటుపరుస్తాయి. కడుపుబ్బరాన్ని పెంచుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
వీటికి దూరం
గ్లూటెన్, డైరీ, ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను తగ్గిస్తే, కడుపుబ్బరం అదుపులోకొస్తుంది. తరచూ యాంటీబయాటిక్స్ వాడుతూ ఉండడం, సలాడ్స్ తింటూ ఉండడం వల్ల పేగుల్లోని బ్యాక్టీరియాలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.