Share News

Weekend Recipes : సగ్గుబియ్యం రుచులు వారెవ్వా!

ABN , Publish Date - Aug 31 , 2024 | 03:34 AM

సగ్గుబియ్యం అంటే పాయసం గుర్తొస్తుంది. అయితే సగ్గుబియ్యంతో పరోటా, కిచిడీ, పునుకులు, హల్వానూ చేసుకోవచ్చు. వీకెండ్‌లో సులువుగా ఈ వంటలను చేసుకోండిలా...

Weekend Recipes : సగ్గుబియ్యం రుచులు వారెవ్వా!

వంటిల్లు

  • సగ్గుబియ్యం కిచిడి

కావాల్సిన పదార్థాలు:

సగ్గుబియ్యం- కప్పు, మీడియం సైజ్‌ బంగాళదుంప- 1, ఉల్లిపాయ-1 (మీడియం సైజ్‌), పల్లీలు- మూడు టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి- 3, జీలకర్ర- అరటీస్పూన్‌, ఉప్పు- తగినంత, తరిగిన కొత్తిమీర- టేబుల్‌ స్పూన్‌, కరివేపాకు- పది ఆకులు, నూనె- టేబుల్‌ స్పూన్‌, నిమ్మరసం- అరటీస్పూన్‌

తయారీ విధానం:

ముందుగా బంగాళదుంప తొక్క తీసి ఉడకబెట్టాలి. చిన్న ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. పల్లీలను వేయించి పక్కన ఉంచుకోవాలి. ఇక సగ్గుబియాన్ని మంచి నీళ్లతో కడిగి ఆ తర్వాత సగ్గుబియ్యానికి సరిపడ నీళ్లు వేసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. నాలుగు గంటల తర్వాత ఒకవేళ సగ్గుబియ్యంలో నీళ్లుంటే తీసేయాలి.

చిన్న మిక్సీ జార్‌లో సగం పల్లీలను పలుకులుగా ఉండేట్లు మిక్సీ పట్టాలి. బౌల్‌లో సగ్గుబియ్యం తీసుకుని ఇందులో సగం పల్లీల మిశ్రమాన్ని వేసి మిక్స్‌ చేసి పక్కనబెట్టుకోవాలి. తర్వాత ప్యాన్‌లో నూనె వేసి.. ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసి కలపాలి. ఉల్లిపాయలు వేగాక బంగాళదుంపల ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి కలపాలి. రెండు నిముషాల తర్వాత మిగిలిన పల్లీలు కలపాలి. చివరగా సగ్గుబియ్యం వేసి బాగా కలపాలి. లోఫ్లేమ్‌లో ఉంచి ప్యాన్‌పై మూత ఉంచి కుక్‌ చేయాలి. మూత చేసి గరిటెతో కలిపి నిముషం తర్వాత మరో రెండు నిముషాల పాటు మూత క్లోజ్‌ చేసి కుక్‌ చేయాలి. ఇందులో నిమ్మరసం, కొత్తిమీర వేసి కలపాలి. నిముషం పాటు కలిపి దించేసుకోవాలి. సగ్గుబియ్యం కిచిడీ రెడీ.


  • సగ్గుబియ్యం పునుకులు

కావాల్సిన పదార్థాలు

లావు సగ్గుబియ్యం- కప్పు, పుల్లని పెరుగు- కప్పు, తరిగిన కొత్తిమీర- ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌, ఉప్పు- రుచికి తగినంత, పచ్చిమిర్చి- 2 (సన్నగా తరగాలి), జీలకర్ర- టీస్పూన్‌, మీడియం సైజ్‌ ఉల్లిపాయ- 1 (సన్నగా తరగాలి), బియ్యం పిండి- 2 టేబుల్‌ స్పూన్లు, అల్లం ముక్క- చిన్నది (సన్నగా తరగాలి), నూనె- డీప్‌ ఫ్రైకి తగినంత

Untitled-1 copy.jpg

తయారీ విధానం

ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రం చేసుకోవాలి. బౌల్‌లో పెరుగు వేసి అందులో సగ్గుబియ్యంతో పాటు అరకప్పు నీళ్లు పోసి నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానిన తర్వాత ఈ మిశ్రమాన్ని పెద్ద బౌల్‌లోకి మార్చుకోవాలి. ఇందులో కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, బియ్యం పిండి, తరిగిన అల్లం వేసి బాగా కలపాలి. అవసరం అనుకుంటే కొన్ని నీళ్లు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కలిపి పెట్టుకోవాలి. ఇక ప్యాన్‌లో నూనె వేయాలి. నూనె వేడయ్యాక కొంచెం కొంచెం మిశ్రమాన్ని ముద్దగా చేసి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పునుకులను వేయించాలి. వేడి వేడి సగ్గుబియ్యం పునుకులను స్నాక్స్‌లా తినేయవచ్చు. అవసరం అనుకుంటే టమోటా కెచప్‌తో తినేయవచ్చు.


  • సగ్గుబియ్యం హల్వా

కావల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం- కప్పు, బెల్లం- పావు కేజీ, యాలకుల పొడి- కొద్దిగా, బాదం-10, జీడిపప్పు- 10, పొద్దు తిరుగుడు విత్తనాలు- పావు టీస్పూన్‌, నెయ్యి- 2 టీస్పూన్లు

Untitled-1 copy.jpg

తయారీ విధానం: సగ్గుబియ్యాన్ని కడిగి ఆ తర్వాత కప్పు నీళ్లు పోసి నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత సగ్గుబియ్యం తీసుకుని జార్‌లో వేసి మిక్సీ పట్టాలి. పావుకేజీ బెల్లాన్ని మెత్తగా పొడి చేసుకోవాలి. గుంత పాత్రలో బెల్లాన్ని వేసి.. ఇందులో చిన్న గ్లాసు నీళ్లు పోసి స్టవ్‌ మీద ఉంచి ఉడికించాలి. ఆ బెల్లం నీళ్లను ఫిల్టర్‌ చేసుకోవాలి. ఈ బెల్లం నీళ్లను ప్యాన్‌లో వేసి ఉడికించాలి. బెల్లం పొంగుతూ ఉడుకుతుంది. బెల్లం బాగా పాకం పట్టిన తర్వాత ముందుగా చేసుకున్న సగ్గుబియ్యం పిండిని కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి. రెండు నిముషాలు బాగా కలిపాక.. ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌ వేయాలి. ఆ తర్వాత గరిటెతో కదుపుతూ ఉండాలి. పొంగులా వస్తుంది. మూడు నిముషాల తర్వాత నెయ్యి పోసి కలపాలి. ఇందులో వేయించిన బాదం, జీడిపప్పు, పొద్దు తిరుగుడు విత్తనాలు వేసి కలపాలి. ఇలా కలుపుతూ ఉంటే గోళం నుంచి మిశ్రమం సపరేట్‌ అవుతున్నట్లు కనపడుతుంది. చతురస్రాకారం బాక్సులో అడుగుభాగంలో నూనె వేసి ఈ హల్వాను అందులో వేసి సమానంగా సర్దాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్‌ చేసుకుని తినాలి.


  • సగ్గుబియ్యం పరోటా

కావాల్సిన పదార్థాలు:

సగ్గుబియ్యం- 1 కప్పు, పల్లీలు- రెండు టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి- 4, వెల్లుల్లి రెబ్బలు- 3, బంగాళదుంపలు- 2 (మీడియం సైజ్‌), జీలకర్ర- అరటీస్పూన్‌, కొత్తిమీర- టేబుల్‌ స్పూన్‌, కారం- టీస్పూన్‌, ఉప్పు- రుచికి సరిపడ, నూనె- మూడు టేబుల్‌ స్పూన్లు

Untitled-1 copy.jpg

తయారీ విధానం:

కప్పులో సగ్గుబియ్యం వేసి నీళ్లు పోయాలి. చేత్తో శుభ్రంగా కడిగితే సగ్గుబియ్యం మీద ఉండే పిండి పోతుంది. శుభ్రంగా కడిగిన సగ్గుబియ్యాన్ని మరో బౌల్‌లో వేసి సరిగ్గా కప్పు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే సగ్గుబియ్యాన్ని చేత్తో పట్టుకుని చూస్తే మెత్తగా అయి ఉంటాయి.

వెంటనే ప్యాన్‌ తీసుకుని అందులో పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్‌లో వేయించాలి. మిక్సీ జార్‌లో పల్లీలతో పాటు పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని సగ్గుబియ్యం బౌల్‌లో వేయాలి. ఇందులోనే ఉడికించిన బంగాళదుంపలను మెత్తగా చూర్ణం చేసి వేయాలి. ఆ తర్వాత జీలకర్రతో పాటు తరిగిన కొత్తిమీర, కారం, ఉప్పు వేసి మెత్తగా కలపాలి.

చపాతీ పీట మీద పాలిథీన్‌ కవర్‌ వేసి కొద్దిగా నూనె వేసి.. దానిమీద సగ్గుబియ్యం మిశ్రమాన్ని తీసుకుని పరోటాలా ఒత్తుకోవాలి. స్టవ్‌ ఆన్‌ చేసి ప్యాన్‌లో నూనె కొద్దిగా వేసి మీడియం ప్లేమ్‌ మీద పరోటాలను రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ సగ్గుబియ్యం పరోటాలు కాస్త పెరుగు చట్నీతో కలిపి తింటే రుచికరంగా ఉంటాయి.

Updated Date - Aug 31 , 2024 | 03:34 AM