Share News

దోమల దాడి కొందరి మీదే ఎందుకు?

ABN , Publish Date - Sep 10 , 2024 | 01:55 AM

డెంగు, వైరల్‌ ఫీవర్స్‌ దంచి కొడుతున్నాయి. ఈ జ్వరాలకు కారణమయ్యే దోమల బెడద కొందరికి విపరీతంగా ఉంటుంది. దోమలు కొందర్నే ఎంచుకుని మరీ కుడుతూ ఉంటాయి. ఇలా ఎందుకో తెలుసుకుందాం!

దోమల దాడి కొందరి మీదే ఎందుకు?

తెలుసుకుందాం

డెంగు, వైరల్‌ ఫీవర్స్‌ దంచి కొడుతున్నాయి. ఈ జ్వరాలకు కారణమయ్యే దోమల బెడద కొందరికి విపరీతంగా ఉంటుంది. దోమలు కొందర్నే ఎంచుకుని మరీ కుడుతూ ఉంటాయి. ఇలా ఎందుకో తెలుసుకుందాం!

మగ దోమలు పూల మకరందాన్ని ఆహారంగా ఎంచుకుంటే ఆడదోమలు మానవ రక్తంలోని నిర్దిష్ట ప్రొటీన్లను ఆహారంగా తీసుకుంటూ గుడ్లను పెడుతూ ఉంటాయి. కాబట్టి ఆడ దోమల కాటు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అయితే దోమలు కొందర్నే కుడుతూ ఉండడానికి కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే...

దుస్తులు: తేలిక రంగు దుస్తులకు బదులుగా ముదురు రంగు దుస్తులు దోమలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. హాఫ్‌ స్లీవ్‌ చొక్కాలు, డ్రస్సులు, పొట్టి దుస్తులు వేసుకున్నప్పుడు దోమలు కుట్టడానికి వాటికి కావలసినంత ఉపరితలం దొరుకుతుంది. ఈడిస్‌ అనే డెంగూ కారక దోమ, కాళ్ల మీద కంటే చేతుల మీదే ఎక్కువగా కుడుతుంది. మలేరియా కారక దోమలైన అనాఫిలిస్‌లు, కాళ్ల మీద ఎక్కువగా కుడతాయి. కాబట్టి దోమలు విజృంభించే సీజన్‌లో ఒంటి నిండా లేత రంగు దుస్తులు వేసుకుంటూ ఉండాలి.

రక్త గ్రూపులు: నిర్దిష్ట రక్తగ్రూపులు కలిగిన వాళ్లనే దోమలు ఎక్కువగా కుడతాయనే శాస్త్రీయ ఆధారాలున్నాయి. మరీ ముఖ్యంగా ఇతర రక్తగ్రూపులతో పోలిస్తే, ‘ఒ’ రక్తగ్రూపు దోమలను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. నిర్దిష్ట రక్తగ్రూపులోని రసాయనాలు చర్మంలోకి విడుదలవుతూ దోమలను ఆకట్టుకోవడమే ఇందుకు కారణం.


శరీర తాపమానం: ఆడ దోమల యాంటీనాలు వేడిని కనిపెట్టగలుగుతాయి. శరీర తాపమానాల్లో ఒక డిగ్రీ హెచ్చుతగ్గులను సైతం అవి ఎంతో దూరం నుంచే పసిగట్టగలుగుతాయి. కాబట్టి శరీరంలో ఎక్కువ ఉష్ణం జనించే తత్వం కలిగిన వాళ్లు దోమల్ని ఎక్కువగా ఆకట్టుకుంటారు. ఊబకాయులు, క్రీడాకారులు, మెటబాలిజం ఎక్కువగా ఉండేవారి శరీరాల్లో వేడి ఎక్కువగా జనిస్తూ ఉంటుంది. వీళ్లు తేలికగా దోమ కాటుకు గురవుతూ ఉంటారు.

శ్వాస కీలకం: వదిలే గాలిలో కార్బన్‌డయాక్సైడ్‌ మోతాదు కూడా దోమలను ఆకర్షిస్తుంది. మెటబాలిజం ఎక్కువగా ఉన్నవాళ్లు వదిలే గాలిలో కార్బన్‌ డయాక్సైడ్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దోమలు వాళ్లనే ఎక్కువగా కుడతాయి.

చమట: ప్రతి మనిషి శరీరం మీదా హానికారకం కాని బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే ప్రతి వ్యక్తి విడుదల చేసే చమట కూడా ప్రత్యేకమైన వాసనను, గుణాలనూ కలిగి ఉంటుంది. కొంతమంది స్వేదంలోని రసాయనాల వాసనలు ఆడ దోమలను ఎక్కువగా ఆకట్టుకుంటాయి.

గర్భిణులు: ప్రెగ్నెన్సీలో విడుదలయ్యే హార్మోన్లు మెటబాలిజంను, శరీర వేడిని పెంచుతాయి. ఈ రెండూ ఆడ దోమలను ఆకర్షించేవే! చివరి నెలల్లో గర్భిణుల శ్వాస వేగం, తీవ్రతలు పెరుగుతాయి. దాంతో వదిలే గాలిలో కార్బన్‌డయాక్సైడ్‌ మోతాదు కూడా పెరుగుతుంది. ఫలితంగా ఆడ దోమలు గర్భిణులను ఎక్కువగా కుడుతూ ఉంటాయి.

మద్యం: మద్యంతో శరీర తాపమానం పెరుగుతుంది. మెటబాలిజం పెరిగి, చమట పడుతుంది. ఇవన్నీ ఆడ దోమలను ఆకర్షించేవే!

Updated Date - Sep 10 , 2024 | 01:56 AM