NRI: దుబాయిలో తెలుగు ప్రవాసీ రామారావు దయనీయ మరణం
ABN , Publish Date - Apr 14 , 2024 | 04:41 PM
సుదీర్ఘ కాలం పాటు దుబాయిలో నివసించి, ఎమిరేట్‌లో తెలుగు సంస్కృతిని ప్రోత్సహించిన సుదీర్ఘ కాల ప్రవాసీ అయిన తాడేపల్లి రామారావు ఇక లేరు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సుదీర్ఘ కాలం పాటు దుబాయిలో నివసించి, ఎమిరేట్‌లో తెలుగు సంస్కృతిని ప్రోత్సహించిన సుదీర్ఘ కాల ప్రవాసీ (NRI) అయిన తాడేపల్లి రామారావు ఇక లేరు.
అల్ బుఖ్తియార్ రామారావుగా ఆయన దుబాయిలోని తొలి తరం తెలుగు ప్రవాసీయులందరికీ సుపరిచితుడు. 1980-90 దశకాల్లో దుబాయిలో ప్రతి తెలుగు వ్యక్తిని తన కుటుంబ సభ్యునిగా ఆదరించిన ఆయన తన ఇంట్లోనే అన్ని సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాల సన్నాహాలు చేసేవారు. రామారావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ దాదాపు ఒంటరిగా గడుపుతున్నారు. ఆయన ఆసుపత్రిలో చేరి మరణించే సమయానికి ఆయన కొడుకు అభిషేక్ మస్కట్‌లో ఉండగా భార్య మాల భారతదేశంలో ఉన్నారు. మరణవార్త తెలిసి ఇరువురు కూడా దుబాయికి చేరుకున్నారు.
రంజాన్ పండుగ కంటే ముందు మంగళవారం షార్జాలోని ఒక ఆసుపత్రిలో మరణించిన ఆయన అంత్యక్రియలను ఆదివారం దుబాయిలో కుటుంబసభ్యులు, మిత్రుల సమక్షంలో నిర్వహించారు.
NRI: సౌదీ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీ మహిళల మృతి
గుంటూరు జిల్లాకు చెందిన రామారావు ఫైనాన్షియల్ కాస్టింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా అందవేసిన చేయి. నాగార్జున సాగ్ ప్రాజెక్టు నిర్వహణ, సాగునీటి వ్యయంపై ఆయన చేసిన అధ్యయనం దుబాయి, గల్ఫ్ దేశాలలో అనేక మంది అరబ్బులు వ్యాపార సంస్థలు నెలకొల్పడంలో దోహదపడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ప్రముఖ సంస్థల్లో ఒకటయిన అల్ బుఖ్తియార్ సంస్థ ఆవిర్భావం నుండి అందులో చివరి వరకు సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన ఆ తర్వాత అల్ బుఖ్తియార్ కుటుంబం శ్రేయాభిలాషి, అందుకే పదవీవిరమణ చేసినా కూడా ఆయన అంకితభావ సేవ వలన ఆయనకు బుఖ్తియార్ వీసా, విల్లా కూడా ఇచ్చిందని చెబుతారు. షార్జా క్రికెట్ స్టేడియం నిర్వహణ అల్ బుఖ్తియార్ ఆధీనంలో ఉండగా అందులో రామారావు ప్రముఖులు.
నలభై అయిదు సంవత్సరాలకు పైగా యు.ఎ.ఇలో పని చేసిన ఆయనకు భార్య, ఏకైక కొడుకు ఉన్నాడు. ఒక్క దుబాయి కాకుండా మొత్తం గల్ఫ్ దేశాలు, తెలుగు రాష్ట్రాలు, అమెరికా, ఆస్ట్రేలియాలలో సంబంధాలను వెతికి కొడుక్కి పెళ్ళి చేయగా, కొడుకు పెళ్ళి అనంతరం కుటుంబ కారణాలు, ఉద్యోగ రీత్యా తండ్రీకొడుకులు వేర్వేరుగా ఉంటున్నారు.
మృత్యువు అనేది సహజమైనప్పటికీ రామారావు మరణం కుటుంబ విలువలపై స్థానికంగా చర్చకు దారి తీసింది. తన మనుమరాలిని చూడడానికి కూడా ఆయన ఆరాటపడే వారని అతనికి తెలిసిన కొన్ని వర్గాలు చెప్పాయి.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి