NRI: ఏపీలో తెలుగుదేశం కూటమి విజయం.. గల్ఫ్‌లో సంబరాలు
ABN , Publish Date - Jun 04 , 2024 | 03:54 PM
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ఘనవిజయంపై ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ఘనవిజయంపై ప్రవాసాంధ్రులు (NRI) హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రోజు అనేక మంది తమ విధులకు సెలువులు పెట్టి తెల్లవారు జాము నుండి టెలివిజన్ల ముందు కూర్చుండిపోయారు. గల్ఫ్ దేశాలలోని కార్యాలయాలు, దుకాణాలలో పని చేసే తెలుగు ప్రవాసీయులందరూ కూడా తమ పనులకు పక్కన పెట్టి ఫలితాలను గమనిస్తూ గడిపారు. ఫలితాలు వెల్లడవుతున్న క్రమంలోనే కువైత్‌లో అనేక చోట్ల పార్టీ అభిమానులు కేకులు కట్ చేస్తూ, విందు సంబరాలను జరుపుకొన్నారు.
గల్ఫ్ దేశాల నుండి ఎన్నికల ప్రచారం, ఓటింగుకు వెళ్ళిన వారిలో సింహభాగం తెలుగుదేశం పార్టీ అభిమానులుండగా వారిలో అత్యధికులు ఫలితాలు చూస్తూ ఆనందభాష్పాలు రాల్చారు. తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ సౌదీ నుండి ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకొన్నారు. సోమవారం అర్ధరాత్రి నుండి దుబాయిలోని ఒక ప్రదేశంలో గుమిగూడిన పార్టీ అభిమానులు ఆస్తికగా ఎదురుచూడసాగారు. తాము ఆశించిన దాని కంటే మెరుగ్గా ఫలితాలు వచ్చాయని తెలుగుదేశం పార్టీ దుబాయి శాఖ అధ్యక్షుడు విశ్వేశ్వరరావు వ్యాఖ్యానించారు.
NTR-బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్ 101 జయంతి ఉత్సవాలు
నలుగురితో కలిసి ఫలితాలను చూస్తూ ఆనందించడానికి వేయి కిలో మీటర్ల దూరంలోని రియాధ్ నుండి దుబాయికు వచ్చినట్లుగా తెలుగుదేశం పార్టీ జి.సి.సి కోర్ కమిటీ సభ్యుడు ఖాదర్ బాషా అన్నారు. తమ సంతోషానికి అవధులు లేవని దుబాయిలోని పార్టీ అభిమాని వేమూరి రాజేశ్ అన్నారు. కువైత్‌లో మంగళవారం నుండి మొదలయిన సంబరాలు శుక్రవారం వరకు భారీ ఎత్తున కొనసాగనున్నట్లుగా తెలుగుదేశం పార్టీ ప్రముఖుడు కోడూరి వెంకట్ వెల్లడించారు. సౌదీలోని పార్టీ అభిమానులు.. ప్రత్యేకించి పల్నాడు ప్రాంతానికి చెందిన ప్రవాసులు తెలుగుదేశం పార్టీ విజయానంతరం భారీ విజయోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లుగా తెలుగుదేశం పార్టీ నాయకుడు షేఖ్ జానీ బాషా చెప్పారు.
అదే విధంగా, జనసేన అభిమానులు కూడా షార్జా, జుబేల్, మస్కట్ నగరాలలో సంబరాలను జరుపుకొన్నారు. జనసేన గల్ఫ్ విభాగం అధ్యక్షుడు చందనరాందాస్ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి లోకం మాధవిను కలిసి అభినందించారు.
Read Latest NRI News and Telugu News