NRI: దశాబ్దాలుగా ప్రవాసంలో ఉంటున్నా తమకంటూ ఏమి మిగుల్చుకోని ఎన్నారైలు
ABN , Publish Date - Feb 16 , 2024 | 07:07 PM
గల్ఫ్ ఎన్నారైల వెతలు
అర్ధ శతాబ్దం పాటు ప్రవాస జీవితం, చరమాంకంలో చెరసాల చావు
చివరకు చావులోనూ తప్పని చిక్కులు, చికాకులు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఎడారులు నిజంగా ఎండమావులే! అక్కడ అడుగుపెట్టిన అనతికాలంలోనే కొందరికి కనకమహాలక్ష్మి కనికరిస్తుండగా మరికొందరికి సుదీర్ఘ కాలం శ్రమించినా లక్ష్మీదేవత కనికరించదు. కాసుల పంట పండదు. దాదాపు జీవితమంతా గల్ఫ్‌లో గడిపినా కొందరికి తమకంటూ ఏమి మిగలదు. సంపాదించిన సర్వం తమను నమ్ముకొన్న కుటుంబ సభ్యులకు ధారబోస్తూ చివరకు ఒట్టి చేతులతో కాలధర్మం చెందుతారు. తనకు రావాల్సిన బకాయి వేతనాలు పొందే క్రమంలో వేచి చూస్తూ దాదాపు అర్ధశతాబ్ది సుదీర్ఘ ప్రవాస జీవితానంతరం చరమాంకంలో చివరకు చెరసాల ద్వారా మాతృభూమికి చేరుకోవాలనే ఆరాటంలో అకాల మృత్యువాత పడ్డ ఒక మొదటి తరం ప్రవాసీ మృతదేహాం దయనీయ స్థితిలో బుధవారం హైదరాబాద్‌కు చేరుకొంది.
Study abroad: భారతీయుల్లో కెనడాపై అనాసక్తి.. ప్రస్తుతం మనోళ్ల చూపంతా అటే!
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామానికి చెందిన చిలుమల్ల కొమరయ్య 1976లో సౌదీ అరేబియాకు వచ్చినప్పటి నుండి మరణించే వరకు 47 సంవత్సరాల పాటు అత్యంత నమ్మకంగా, అంకితభావంతో పని చేశారు. గత కొద్ది కాలంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ చివరకు జైలులో గుండెపోటు వచ్చింది. అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా గత సంవత్సరం నవంబర్‌లో మరణించాడు. అంతంత మాత్రం చదివి వచ్చిన అనేక మంది భారతీయులు మంచి ఉద్యోగాలు పొందినా 1970 దశకంలో అప్పటికే గ్రాడ్యూట్ అయిన కొమరయ్య ఒక కంపెనీలో వచ్చి అక్కడ తనతో కలిసి పని చేసిన ఒక సౌదీ జాతీయుడితో కలిసి ఆ తర్వాత ఒక కంపెనీని నెలకొల్పాడు. తన సమర్ధత, అంకితభావంతో నూతన కంపెనీ రూపురేఖలను మార్చాడు. కంపెనీ కొన్ని ఉల్లంఘనలకు పాల్పడడంతో బ్లాక్ లిస్టయింది. దీంతో కొమరయ్యతో పాటు ఇతరులకూ అఖమా(వీసా)లు రెన్యువల్ కాలేదు. సుదీర్ఘ కాలం పాటు పని చేసిన దాని తాలుకు గ్రాట్యూటి (ఈ.యస్.బి), కొన్ని నెలల పెండింగ్ వేతనాలు చెల్లిస్తే తాను ఏలాగైనా స్వదేశానికి వెళ్ళిపోతానని కొమరయ్య ప్రాధేయపడ్డా కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని యాజమాని దాటేసాడు. చివరకు కనీసం వీసాను రద్దు చేసి ఇవ్వల్సిందిగా కోరినా యజమాని అది కూడా చేయలేకపోయాడు.
దాదాపు అర్ధ శతాబ్ది ఎడారి జీవితంలో అలిసిపోయిన కొమరయ్య తనకు రావాల్సిన డబ్బును మరిచిపోయి అనారోగ్య కారణాల రీత్యా ఎలాగైనా స్వదేశానికి తిరిగి వెళ్ళాలనుకోంటుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. జైలులో అనారోగ్యానికి గురయిన కొమరయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. ఇది జరిగిన చాలా కాలానికి అతని చావు కబురు అందింది.
తన సంపదనతో తోబుట్టువులను ఆదుకొన్న కొమరయ్య తన ఇద్దరు పిల్లలు ఎదిగే సరికి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా చివరకు జైలులో చనిపోయాడు.
యాజమాని సహాయనిరాకరణ, కుటుంబ దయనీయ స్థితి వలన జెద్దాలోని భారతీయ కాన్సులేట్ ముందుకు వచ్చి తన ఖర్చుతో కొమరయ్య మృతదేహాన్ని స్వదేశానికి పంపించింది.
అంతకుముందు, అల్ ఖోబర్‌లో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళీ మండలానికి చెందిన బుద్ధ రామన్న కూడా 20 సంవత్సరాలకు పైగా ఒక ప్రముఖ సంస్థలో పని చేసినా చివరకు అది దీవాలా తీయడంతో ఎలాంటి పెండింగ్ బకాయిలు పొందకుండా మరణించారు. ఆయన మృతదేహాన్ని దాన్ని కూడా భారతీయ ఎంబసీ తన ఖర్చుతో భారత్‌కు పంపించింది. అల్ బాహాలో కరీంనగర్ జిల్లా కోరుట్ల ప్రాంతానికి చెందిన ఆశోక్ అనే ప్రవాసీ 26 సంవత్సరాల ప్రవాస జీవితానంతరం మరణిస్తే చిల్లి గవ్వలేకపోవడంతో విరాళాలు సేకరించి మృతదేహాన్ని స్వదేశానికి పంపించారు. ఈ రకంగా చెప్పుకుపోతె జాబితా పెద్దదవుతుంది.
తమ కుటుంబ సభ్యులతో పాటు గల్ఫ్‌లో ఉన్నప్పుడు తమకు ఏదైన అనుకోకుండా జరిగితే తమను తాము నిలదొక్కుకోవడానికి పొదుపు సూత్రాన్ని పాటించాలి. కొమరయ్య వద్ద కనీసం ఏమైన నాలుగు రాళ్ళు మిగిలి ఉంటే జైలు ద్వారా కాకుండ హుందాగా మాతృదేశానికి వెళ్ళే వాడు కదా? జీవితం, మరణం అనేది మనిషి చేతిలో లేదు కానీ తన జీవిత కాలంలో బయటకు పరాయి దేశానికి వచ్చినందుకు తనకు తాను ఒక హుందా, భద్రత కల్పించుకోవడానికి ప్రయత్నించాలి.
మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి