Share News

NRI: సౌదీలో హిందువుల అంత్యక్రియలు.. అంతులేని కష్టాలు!

ABN , Publish Date - Feb 23 , 2024 | 07:27 PM

సరైన గుర్తింపులేక వివరాలు లేక ఎన్నారైల మృతదేహాలను గల్ఫ్ నుంచి స్వదేశానికి తరలించడం కష్టంగా మారింది.

NRI: సౌదీలో హిందువుల అంత్యక్రియలు.. అంతులేని కష్టాలు!

  • వీసా నెంబర్ లేక 4 నెలలుగా పడిఉన్న చిత్తూరు జిల్లా వాసి మృతదేహాన్ని ఎట్టకేలకు తరలింపు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ఓం మహాదేవాయ విద్మహే రుద్రఃమృతాయ ధీమహీ అంటూ శ్లోకాల మధ్య సగౌరవంగా హిందూ సంప్రదాయాల ప్రకారం అంతిమ వీడ్కోలు పలకాల్సిన అనేక హిందువుల (NRI) మృతదేహాలు ఎడారి నాట వీసా నిబంధనల కారణంగా దయనీయ పరిస్థితులలో ఎలాంటి అంతిమ సంస్కారాలు లేకుండా మట్టిలో కలిసిపోతున్నాయి. స్వదేశంలోని వారి కుటుంబీకులకు మాత్రం తమ వారిని కడసారి కూడా చూడలేదన్న బాధ జీవితాంతం ఉంటోంది.

ఈ నేపథ్యంలో, సౌదీ అరేబియాలో (Saudi Arabia) నాలుగు నెలల క్రితం మరణించిన ఒక తెలుగు ప్రవాసీ మృతదేహం వీసా నెంబర్ లేకపోవడంతో చివరకు ఎడారిలోనే ఖననం చేసేందుకు అక్కడి అధికారులు సిద్ధమయ్యారు. అయితే, చివరి క్షణంలో ఒక తెలుగు సామాజిక కార్యకర్త చొరవతో భారతీయ ఎంబసీ సహకారంతో ఆ తెలుగు ప్రవాసీ మృతదేహం సగౌరవంగా, సంప్రదాయకంగా శనివారం స్వదేశానికి చేరనుంది. మృతుడి కుటుంబం గత 23 సంవత్సరాల నుండి అతడిని ఒక్కసారి కూడా చూడలేకపోయింది. ఈ సుదీర్ఘ కాలంలో ఒక్కసారి కూడా కన్నవారిని, కట్టుకున్న వారిని చూడకుండా ఆయన కన్నుమూసాడు.

ఎడారి నాట జననం నుండి మరణం వరకు ప్రతిదీ వీసాతో ముడిపడి ఉన్న వ్యవహారం. వీసా నెంబర్ లేకపోవడంతో గత నాలుగు నెలలుగా పడి ఉన్న చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండల కేంద్రానికి చెందిన పసుపులేటి శివయ్య చివరకు మరణించిన తర్వాత కూడా చిక్కుల్లో పడ్డాడు.

NRI: అరబ్బునాట అనాథలకు అంత్యేష్టి!


చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండల కేంద్రానికి చెందిన పసుపులేటి శివయ్య 30 సంవత్సరాలకు పైగా సౌదీ అరేబియాలో పని చేస్తుండగా ఈ సుదీర్ఘ కాలంలో కేవలం ఒకే ఒక సారి 2001లో స్వదేశానికి వచ్చి భార్య, పిల్లలను కలిసి తిరిగి వెళ్ళాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు భారతదేశానికి రాలేకపోయాడు. యజమానితో వివాదం ఏర్పడి పారిపోయిన తర్వాత అఖమా (వీసా) రెన్యువల్ చేయించుకోకపోవడంతో చట్టవిరుద్ధంగా ఉంటూ పని చేసుకొంటున్న శివయ్య నవంబర్ 5న రియాధ్ నగరంలోని తన గదిలో గుండెపోటుతో మరణించాడు. ఇతనితో పాటు గదిలో ఉంటున్న ఉత్తరప్రదేశ్ వాసులు కొందరు భారతదేశంలోని ఇతని భార్యాపిల్లలకు ఫోన్ చేసి మరణవార్తను అందించారు. వారు రియాధ్‌లో ఉంటున్న రాయచోటికి చెందిన పేరాం విశ్వనాథ రెడ్డికి చెప్పగా ఆయన గదిని సందర్శించి మరణవార్తను నిర్ధారించారు.

కానీ శివయ్యకు సంబంధించిన అఖమా, పాస్‌పోర్టు కాపీలు లేకపోవడంతో అతని కుటుంబం ఇచ్చే అఫిడవిట్‌కు గుర్తింపు లేకుండాపోయింది. ఇరవై సంవత్సరాల క్రితం బయోమెట్రిక్ నమోదు చేసుకోకపోవడంతో శివయ్య గుర్తింపు ఒక సవాల్‌గా మారింది.

ఒక విదేశీయుడు సజీవంగా లేదా మరణించిన తర్వాత కూడా దేశం విడిచి వెళ్ళడానికి వీసాను రద్దు చేయడం అవసరం. మృతదేహం కూడా ఇందుకు మినహాయింపు కాదు. కానీ వివరాలు లేకపోవడంతో సవాల్‌గా మారింది. సరైన వివరాలు లేకపోవడంతో భారతీయ ఎంబసీ కూడా అతడిని భారతీయ పౌరుడిగా గుర్తించడానికి వెనుకంజ వేసింది.


ఏ రకమైన చట్టబద్ధత, గుర్తింపు లేకపోవడంతో శివయ్య మృతదేహాన్ని స్థానిక మున్సిపాల్టీ సహాయంతో ఎడారి మారుమూలలో పాతిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతుండగా విషయం తెలుసుకొన్న సామాజిక కార్యకర్త ముజ్జమ్మీల్ షేఖ్, కేరళకు చెందిన సిద్ధిఖ్ తువూరు అనే సామాజిక సేవకుడితో కలిసి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. గత రెండు నెలలుగా నిరంతరం సౌదీ అధికారుల చుట్టు తిరిగి శివయ్య మృతదేహాన్ని దేశం నుండి తరలించడానికి అనుమతి సాధించారు. సౌదీ అధికారులు ఫైల్‌ను క్లియర్ చేసి ఎగ్జిట్ ఇవ్వడంతో శుక్రవారం మృతదేహాం చెన్నైకి బయలుదేరింది. చెన్నై నుండి చిత్తూరు జిల్లాకు శనివారం చేరుకొంటుందని ముజ్జమ్మీల్ షేఖ్ చెప్పారు. మృతుడి కుటుంబం పేదరికం దృష్య్టా మృతదేహాన్ని చెన్నై నుండి చిత్తూరు జిల్లాలోని స్వస్థలానికి ఏపీ ఎన్నార్టీ ద్వారా ఉచిత అంబులెన్సును కూడా ఏర్పాటు చేసినట్లుగా ముజమ్మీల్ చెప్పారు.

ఈ రకమైన గుర్తింపు సమస్యల కారణాంగా అనేక సార్లు అనుమతులు లభించక మృతదేహాలు సౌదీ అరేబియాలో అధికారులు పూడ్చివేస్తుంటారు. సౌదీ అరేబియా, భారతదేశం అధికారిక సమాచారం ప్రకారం శివయ్య అనే మనిషి ఇక్కడ ఉనికిలో లేడు.

ఈ రకమైన అనేక మంది మృతదేహాలకు సగౌరవంగా అంతిమ సంస్కారాలు చేసేందుకు కేరళకు చెందిన సిద్దీఖ్ తన తోడ్పాటునందిస్తుంటాడు. అనేక సందర్భాలలో కొన్ని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆయన మృతదేహాలను స్వదేశంలోని కన్నవారి వద్దకు పంపించడానికి సహాయపడ్డాడు. ఇతని సేవలను గుర్తించిన తెలుగు ప్రవాసీ సంఘం సాటా అతన్ని సన్మానించి గౌరవించింది కూడా.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 23 , 2024 | 07:33 PM