Share News

USA: 'మాటా' ఔన్నత్యం.. ఇఫ్తార్ ఫార్టీతో వెల్లివిరిసిన మతసామరస్యం

ABN , Publish Date - Apr 09 , 2024 | 09:21 PM

మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఇఫ్తార్ పార్టీ

USA: 'మాటా' ఔన్నత్యం.. ఇఫ్తార్ ఫార్టీతో వెల్లివిరిసిన మతసామరస్యం

  • మాటా ఆధ్వర్యంలో విజయవంతంగా తొలి ఇఫ్తార్ విందు

  • ఇఫ్తార్ పార్టీకి 200 మంది వివిధ మతస్థులు హాజరు

ఎన్నారై డెస్క్: ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా.. సౌభ్రాతృత్వాన్ని చాటుకుంటారని నిరూపిస్తున్నారు మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) సంస్థ నిర్వాహకులు. అగ్రరాజ్యం అమెరికాలోనూ పరమత సహనాన్ని పాటిస్తూ తెలుగు జాతి (NRI) ఔన్నత్యాన్ని ఘ‌నంగా చాటిచెబుతున్నారు. ఈ క్రమంలోనే ముస్లిం సోదరుల రంజాన్ పవిత్రమాసం సందర్భంగా మొట్టమొదటిసారిగా 'మాటా' ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేసి మత సామరస్యం వెల్లివిరిసేలా చేసింది. అమెరికాలో ఉన్న తెలుగువారి ఐక్యత కోసం కుల, మత, వర్గ, ప్రాంతీయ విభేదాలను పక్కనపెట్టి మరీ కృషి చేస్తున్న 'మాటా'.. సేవ, సంస్కృతి, సమానత్వం అనే తమ నినాదాన్ని మరోసారి నిరూపించుకుంది.

St.Louis హిందూ దేవాలయ బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు


'మాటా' ఆధ్వర్యంలో ఏప్రిల్ 7న ఫ్లోరిడాలోని టెంపుల్ టెర్రస్‌లోని ఫోకస్ అకాడమీలో మొదటి ఇఫ్తార్ పార్టీని విజయవంతంగా నిర్వహించారు. ఈ ఇఫ్తార్ పార్టీలో వివిధ మతాలకు చెందిన 200 మంది ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పర్వదినం ప్రాముఖ్యత గురించి సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మాటా టీం టోనీ జన్ను, మన్సూర్ షేక్‌లను ఇంకా ఇతర సభ్యులను అభినందిచారు. ఈ సందర్భంగా మాటా అధ్యక్షులు శ్రీనివాస్ గనగోని అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. 'ఈ ఇఫ్తార్ విందులో జుబేర్ కాజిమి సాహిబ్, పాస్టర్ డాక్టర్ ప్రవీణ్ ఎర్నెస్ట్‌తో పాటు వివిధ కమ్యూనిటీ సంస్థల ప్రతినిధులతో సహా స్థానిక నాయకులు కూడా ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


తెలుగు భాషాభివృద్ధితో పాటు సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించడమే లక్ష్యంగా శ్రీనివాస్ గనగోని సారథ్యంలో ఏర్పాటైన 'మాటా' అతి త‌క్కువ స‌మ‌యంలోనే వేగంగా విస్తరిస్తూ అమెరికాలో దిగ్గజ సంఘాల‌కు ధీటుగా నిల‌ుస్తోంది. యూఎస్ఏలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు కమ్యూనిటీని ఒక్కదగ్గరికి చేర్చేందుకు కృషి చేస్తున్న 'మాటా' ఏప్రిల్ 13, 14 తేదీల్లో తొలి క‌న్వెన్షన్‌ను ఘ‌నంగా నిర్వహించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేస్తోంది. న్యూజెర్సీలో రాయ‌ల్ అల్బర్ట్ ప్యాలెస్‌లో 'మాటా' తొలి క‌న్వెన్షన్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 09 , 2024 | 09:21 PM