HTSL: సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు.. 3వ రోజు మారుమ్రోగిన గోవింద నామం
ABN , Publish Date - May 27 , 2024 | 03:16 PM
అమెరికాలోని మిస్సోరిలో సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో నిర్వహిస్తున్న మొట్టమొదటి బ్రహ్మోత్సవాల్లో మూడోరోజు వేడుకల్లో గోవింద నామం మారుమ్రోగింది.
వేడుకగా మూడోరోజు బ్రహ్మోత్సవం
హనుమంతుడు, గరుత్మంతుడిపై వెంకన్న ఊరేగింపు
సహస్రదీపాలంకార ఊంజల్ సేవకు భారీగా భక్తులు
వడగళ్ల వానలో సైతం హోమం కొనసాగింపు
అలరించిన ప్రవాస భారతీయ చిన్నారుల ఆలాపన
25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని మిస్సోరిలో సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో నిర్వహిస్తున్న మొట్టమొదటి బ్రహ్మోత్సవాల్లో మూడోరోజు వేడుకల్లో గోవింద నామం మారుమ్రోగింది. గత రెండు రోజులుగా నిర్వహించిన పలు యజ్ఞాలు, హోమాలకు ప్రతిఫలం అన్నట్లు వడగళ్ల వానతో వరుణుడు కుండపోత కురిపించినప్పటికీ, భక్తులు (NRI) ఆ తన్మయత్వంలోనే మూడోరోజు హోమాలను, పూజలను, వాహన సేవలను కొనసాగించారు.
ఉదయం కుంభారాధనం అనంతరం వుక్తహోమం నిర్వహించి హనుమంతుడిపై కోదండధారిగా వేంకటేశ్వరుడు ఆలయ మాఢవీధుల్లో ఊరేగింపుగా భక్తులకు కనువిందు చేశాడు. భారతీయ నేపథ్యం కలిగిన బెంగాలీ, మలయాళీ, తమిళ్, తెలుగు, మరాఠి ప్రవాస కుటుంబాలకు చెందిన స్థానిక చిన్నారులు పలు కీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు.
మధ్యాహ్నం ప్రముఖ నాట్యాచార్యుడు డా.కళాకృష్ణను ఆలయ కార్యవర్గం సన్మానించింది. పలువురు స్థానిక నాట్యచార్యుల శిష్యులు శాస్త్రీయ నృత్యాలతో అలరించారు.
NRI: అమెరికాలో శేషవాహనంపై ఊరేగిన శ్రీవారు
వరుణుడి అపార కరుణ
సాయంకాల హోమం సమయంలో ఒకసారిగా వడగళ్లతో కుండపోత వాన కురిసినప్పటికీ నిర్వాహకులు ఎటువంటి అవాంతరాలు కలగకుండా హోమాన్ని కొనసాగించారు. హోమం అనంతరం సహస్రదీపాలంకార ఊంజల్ సేవ, గరుడ వాహన సేవలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. తమ భక్తిప్రపత్తులు వరుణుడిని అనుకున్న దానికన్న ఎక్కువగా మెప్పించాయని ఆలయ ఛైర్మన్ రజనీకాంత్ గంగవరపు పేర్కొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు విజయ్ సాక్షి, బ్రహ్మోత్సవాల కమిటీ కార్యదర్శి పుట్టగుంట మురళీలు ఏర్పాట్లను సమన్వయపరిచారు. సోమవారం నాడు స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు మీడియా కమిటీ ఛైర్మన్ సూరపనేని రాజా తెలిపారు.
NRI: సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Read Latest NRI News and Telugu News