NRI: సౌదీ అరేబియాలో ‘సాటా’ ఇఫ్తార్ విందు
ABN , Publish Date - Apr 04 , 2024 | 05:36 PM
రంజాన్ సెలువులలో తెలుగు పర్యాటక బృందాలు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ముస్లింల పవిత్ర రంజాన్ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయులు (NRI) ఇఫ్తార్ విందుల సందడి ఎక్కువైంది. కొందరికి ఒక రోజులో రెండుకు మించి ఇఫ్తార్ (Iftar) విందు ఆహ్వానాలు అందుతుండడంతో ఎవరి వైపు వెళ్ళాలనేది అగమ్యగోచరంగా మారింది.
ఇఫ్తార్ అనేది పూర్తిగా ఇస్లామిక్ సంప్రదాయమైనప్పటికి గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న పెద్ద సంఖ్యలోని ప్రవాసీ భారతీయ ముస్లిమేతరులు కూడా ఇఫ్తార్ విందులో క్రియాశీలకంగా పాల్గొంటూ వసుధైక కుటుంబాన్ని ప్రతిబింబించడం జరుగుతుంది. మలయాళీలు బహిరంగ ప్రదేశాలలో వేలాది మందికి ఇఫ్తార్ విందు భోజనం ఏర్పాట్లు చేస్తుండగా తెలుగు ప్రవాసీ సంఘాలు ఇప్పుడిప్పుడే ఈ దిశగా ముందడుగు వేస్తున్నాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైత్, ఒమాన్, ఖతర్ దేశాలలో ఇఫ్తార్ విందులను వివిధ తెలుగు ప్రవాసీ సంఘాలు జోరుగా నిర్వహిస్తున్నాయి.
NRI: త్వరలో గల్ఫ్ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
ఇక సౌదీ అరేబియా విశాల భౌగోళిక వైశాల్యం దృష్ట్యా విభిన్న నగరాలలో ప్రతి రోజు ఏదో ఒక చోట ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద దేశంలో పెద్ద ప్రవాసీ సంఘమైన సాటా (సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్) ఎర్ర సముద్ర తీరంలోని తబూక్ నుండి ఇటు అరేబియా సముద్ర తీరం అల్ ఖోబర్ వరకు అన్ని ప్రముఖ నగరాలలో ఇఫ్తార్ విందును నిర్వహించగా అందులో హిందువులు క్రీయాశీలక పాత్ర వహించడం విశేషం.
అల్ ఖోబర్‌లో జరిగిన ఇఫ్తార్ విందును కిశోర్, తేజ, గౌరిశంకర్, మక్సూద్, సాదిఖ్‌లతో కూడిన సాటా బృందం నిర్వహించింది. భోజన ఏర్పాట్లను తారక్, శ్రీనివాస్ కొర్రయిలు పర్యవేక్షించారు. ఇఫ్తార్ ఏర్పాట్లను మహిళామూర్తులయిన భారతీ, ప్రవీణ, సౌజన్య, కుసుమ, కుసుమ రామరాజు, వరిష్ఠిత, సంధ్య భారత్, బిందు సురేశ్, శశీ జగన్, సంతోషినిలు సమన్వయం చేయగా దివ్య పవన్, విజయ కిషోర్, రఫియా మసూద్, సఫియా సుజాలు కూడా తమ వంతు తోడ్పాటునందించారు.
రంజాన్ మాస విశిష్ఠత గురించి మక్సూద్ వివరించారు. తమిళుడైనా తనకు తాను తెలుగువాడిగా సగర్వంగా చెప్పుకొనె అబ్దుల్ మజీద్ బద్రదోద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీనివాస్, సైఫుల్లా షరీఫ్, సాదిఖ్ అలీలు కూడా ప్రత్యేక అతిథులుగా హజరయ్యారు.
అన్ని రకాల పండుగలను, ప్రముఖ ధార్మికాచారాలను పాటించడం ద్వారా సాటా అందరికీ సమగౌరవం ఇస్తుందని సాటా అధ్యక్షులు మల్లేశన్, ఈశాన్య ప్రాంత శాఖ అధ్యక్షుడు తేజలు తెలిపారు.
తబూక్‌లో...
సౌదీ అరేబియా చివరి సరిహద్దు ప్రాంతమైన తబూక్‌లో కూడా ఇఫ్తార్‌ను సాటా నిర్వహించింది. సాటా తబూక్ అధ్యక్షుడు తిరుపతి లోకటా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రమీజ్ రజాతో పాటు సాటా భాద్యులు పరశురాం వర్మ బిజిలి, పళ్ళ సూర్యనారాయాణ, రోహన్ సన్నిధి, హరిప్రియా, నరేశ్ పవిడి, సతీష్ జల్లెపల్లి, వరలక్ష్మి, గున్నాజీ గునిశెట్టిలు కార్యక్రమాన్ని సమన్వయం చేసారు.
జిజాన్‌లో...
సౌదీ అరేబియాలోని విభిన్న సంస్కృతి, విలక్షణ ప్రాంతంగా పేరున్న జిజాన్‌లో కూడా సాటా ఇఫ్తార్ విందును నిర్వహించింది. సాటా జీజాన్ అధ్యక్షుడు సలీం బాషా, ప్రధాన కార్యదర్శి విజయల ఆధ్వర్యంలో జరిగిన విందులో ఇరు రాష్ట్రాలకు చెందిన అనేక మంది తెలుగు ప్రవాసీయులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సాటా మహిళా విభాగం అధ్యక్షురాలు శాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సర్వమత సమగౌరం అంటూ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్క తెలుగు ప్రవాసీనీ సమ్మిళితం చేసుకుంటూ తాము రంజాన్‌తో పాటు క్రిస్మస్, దసరా, దీపావళి, సంక్రాంతి, మహాశివరాత్రి పండుగలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మల్లేశన్, ముజ్జమ్మీల్ షేఖ్‌లు పెర్కొన్నారు.
రంజాన్ ఈద్ సెలువుల ప్రత్యేక టూర్ ఏర్పాట్లు
రంజాన్ పండుగ సందర్భంగా ప్రకటించిన దాదాపు వారం రోజుల సెలువు దినాలను పూర్తిగా తెలుగు వారితో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటించే విధంగా తాము ఏర్పాట్లు చేస్తున్నామని, ఆసక్తి కల్గిన వారు 0597384449 నెంబర్‌పై సంప్రదించవచ్చని మల్లేశన్ సూచించారు.