Tributes: రామ్మూర్తి నాయుడు మృతికి కోమటి జయరాం సంతాపం
ABN , Publish Date - Nov 16 , 2024 | 11:12 PM
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మూర్తి మృతికి టిడిపి ఎన్నారై విభాగం కన్వీనర్ కోమటి జయరాం సంతాపం తెలిపారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతికి టిడిపి ఎన్నారై విభాగం కన్వీనర్ కోమటి జయరాం సంతాపం తెలిపారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ తో తనకు సన్నిహిత సంబంధం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రామ్మూర్తి నాయుడు మృతి ఆయన కుటుంబానికి తీరని లోటని కోమటి జయరాం పేర్కొన్నారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు రోహిత్ తో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భగవంతుడు వారికి మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నట్లు కోమటి జయరాం తెలిపారు.
ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకూ చంద్రగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 12:45 గంటలకు మృతి చెందినట్లు ఏఐజీ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. రామ్మూర్తి మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
నారావారిపల్లెలో అంత్యక్రియలు
రామ్మూర్తి నాయుడి భౌతికకాయాన్ని నారావారిపల్లెకు తరలించాలని నారా కుటుంబ సభ్యులంతా నిర్ణయించారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని డిసైడ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 6:30 గంటలకు బేగంపేట్ విమానాశ్రయం నుంచి నారావారిపల్లెకు ఆయన పార్థివదేహం ఎయిర్ లిఫ్ట్ కానుంది. మరోవైపు రేపు ఉదయం సీఎం చంద్రబాబు కుటుంబం ప్రత్యేక విమానంలో స్వగ్రామానికి చేరుకోనున్నారు. అనంతరం అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులు సహా బంధువులంతా హాజరుకానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతలు విచ్చేయనున్నారు. అలాగే సినీ, పలు రంగాల ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
మరిన్ని వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here