Share News

ఔటర్‌పై ‘డబ్బుల్‌’ దోపిడీ

ABN , Publish Date - Apr 01 , 2024 | 03:55 PM

ఔటర్‌ రింగ్‌రోడ్డు లీజు తీసుకున్న ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా సంస్థ కొత్తరకం దోపిడీ ప్రారంభించింది.

ఔటర్‌పై ‘డబ్బుల్‌’ దోపిడీ

  • ఫాస్టాగ్‌ ఉన్నా డబ్బులు వసూలు

  • పనిచేయడం లేదని సిబ్బంది సాకులు

  • కాసేపటి తర్వాత ఫాస్టాగ్‌ నుంచి కట్‌

  • సాంకేతిక లోపమంటూ వాహనదారులకు కుచ్చుటోపీ

  • ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఐఆర్‌బీ ప్రతినిధులు

  • రింగ్‌రోడ్డుపై నిత్యం వేలాది వాహనాల రాకపోకలు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఔటర్‌ రింగ్‌రోడ్డు లీజు తీసుకున్న ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా సంస్థ కొత్తరకం దోపిడీ ప్రారంభించింది. సాంకేతిక కారణాలంటూ సిబ్బంది వాహనదారులకు కుచ్చుటోపీ పెడుతోంది. ఫాస్టాగ్‌ ఉన్నా పనిచేయడం లేదని సాంకేతిక సాకులు చెబుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ, ఆ తర్వాత ప్రయాణించిన దూరానికి ఫాస్టాగ్‌లో నుంచి డబ్బులు కట్‌ అవుతున్నాయి. వాహనదారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయడంపై ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లింపులు చేయడం లేదు.

ప్రయాణించిన దూరానికే టోల్‌

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై గల ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద, టోల్‌ ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చేయడానికి జాతీయ రహదారుల తరహాలోనే రేడియో ఫ్రిక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎ్‌ఫఐడీ) విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశంలో ఏ జాతీయ, రాష్ట్ర రహదారిపై లేని విధంగా కేవలం ప్రయాణించిన దూరానికి టోల్‌ చెల్లించడం దీని ప్రత్యేకత. దాంతో ఫాస్ట్‌ట్యాగ్‌లను కలిగిన వాహనాలు ఔటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌ప్లాజాల వద్ద ఉండే ప్రత్యేక ఫాస్ట్‌ట్యాగ్‌ లైన్ల నుంచి సులువుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణించిన దూరానికి ఫాస్టాగ్‌లో నుంచే డబ్బులు కట్‌ అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రయాణించిన దూరానికి ఉన్న కంటే అధికంగా ఫాస్టాగ్‌ నుంచి కట్‌ అవుతున్న సందర్భాలున్నాయి. ఔటర్‌పైకి ప్రవేశించే సందర్భంలో ఫాస్టాగ్‌ గుర్తించి అనుమతిస్తుండగా, నిష్క్రమించే సందర్భంలో ప్రవేశించిన టోల్‌ప్లాజా నుంచి వివరాలు అందకపోవడంతో వాహనాలకు అదనపు చార్జీలు వేస్తున్నారు.

ఇదేం దోపిడీ ?

సాధారణంగా ఫాస్టాగ్‌ ఉన్న వాహనం ఏ టోల్‌ ప్లాజా వద్ద ఆగడానికి వీల్లేదు. డబ్బులు వసూలు చేయకూడదు. ప్రయాణించిన దూరానికి ఆన్‌లైన్‌లో డబ్బులు కట్‌ అవుతాయి. అయితే ఫాస్టాగ్‌ లేకుండా వచ్చే వాహనాల నుంచి డబ్బులు వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఫాస్టాగ్‌ వాహనాలకు డబ్బులు వసూలు చేస్తుండడంతో వాహనదారులు ఇదేం దోపిడీ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండాపూర్‌లో నివసించే ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ..... 2789 నెంబర్‌ కలిగిన ఫాస్టాగ్‌ కారులో కోకాపేట నుంచి శంషాబాద్‌కు వెళ్ళారు. శంషాబాద్‌ టోల్‌ప్లాజా వద్ద ఎగ్జిట్‌ అయ్యే సందర్భంలో ఫాస్టాగ్‌ నుంచి వెళ్ళే క్రమంలో గ్రీన్‌సిగ్నల్‌ రాలేదు. రెడ్‌సిగ్నల్‌ ఉండడంతో టోల్‌ నిర్వాహకులు వచ్చి మీ ఫాస్టాగ్‌ పని చేయడం లేదని, బ్లాక్‌ అయ్యిన్నట్లుందని నానక్‌రాంగూడ నుంచి ప్రయాణించిన్నట్లుగా.. రూ.50 తీసుకొని రశీదు ఇచ్చారు. ఆ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి తన ఫాస్టాగ్‌లోనే లోపము ఉండోచ్చునని అక్కడి నుంచి కదిలి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్ళాడు. కొంతసేపటికే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మొబైల్‌కు తన ఫాస్టాగ్‌ నుంచి కోకాపేట నుంచి శంషాబాద్‌ ప్రయాణానికి రూ.40లు కట్‌ అయ్యిన్నట్లు మెస్సేజ్‌ రావడంతో ఆయన అవాక్కయ్యాడు. తిరుగు ప్రయాణంలో అక్కడి సిబ్బందిని అడిగితే తమకు తెలియదంటూ సమాధానం చెప్పుకొచ్చారు. తిరుగు ప్రయాణంలో శంషాబాద్‌ నుంచి నానక్‌రాంగూడకు మరో రూ.50లు కట్‌ చేశారు. ఈ విషయంపై ఔటర్‌ టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేసిన కానీ ఏలాంటి స్పందన లేదని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వాపోయారు.

Updated Date - Apr 01 , 2024 | 03:55 PM