Share News

TG Elections: ఆదివాసీల గడ్డ.. ఎవరికి అడ్డా?

ABN , Publish Date - Apr 12 , 2024 | 03:43 PM

ఉత్తర తెలంగాణ సరిహద్దులోని ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టిని సారించాయి. ఎస్టీ రిజర్వ్‌డు కావడంతో ఆదివాసీ, లంబాడా సామాజిక వర్గం నేతల మధ్యనే పోటీ ఉంటుంది. అయితే ఈసారి ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఆదివాసీలే కావడంతో ఎన్నికలు ఆసక్తిగా మారాయి...

TG  Elections: ఆదివాసీల గడ్డ.. ఎవరికి అడ్డా?

  • ‘ఆదిలాబాద్‌’పై మూడు పార్టీల నజర్‌

  • మళ్లీ గెలుపు కోసం బీజేపీ ఆరాటం

  • దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ వ్యూహం

  • కేడర్‌నే నమ్ముకున్న బీఆర్‌ఎస్‌ పార్టీ

  • ప్రచారంలో వేగం పెంచిన అభ్యర్థులు

ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఉత్తర తెలంగాణ సరిహద్దులోని ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టిని సారించాయి. ఎస్టీ రిజర్వ్‌డు కావడంతో ఆదివాసీ, లంబాడా సామాజిక వర్గం నేతల మధ్యనే పోటీ ఉంటుంది. అయితే ఈసారి ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఆదివాసీలే కావడంతో ఎన్నికలు ఆసక్తిగా మారాయి. 2019 ఎన్నికల్లో ఊహించని విధంగా జెండా ఎగురేసిన బీజేపీ ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. సిట్టింగ్‌ ఎంపీ సోయం బాపురావ్‌ను పక్కనపెట్టి మాజీ ఎంపీ గోడం నగేశ్‌ను బరిలోకి దింపింది. అలాగే కాంగ్రెస్‌ ఆదివాసీ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణకు టికెట్‌ ప్రకటించగా.. ఆసిఫాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరును బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, ఆదిలాబాద్‌, బోథ్‌, నిర్మల్‌, ముథోల్‌ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 4, బీఆర్‌ఎస్‌ 2, కాంగ్రెస్‌ 1 చొప్పున అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్నాయి. పార్లమెంట్‌ పరిధిలో బీఆర్‌ఎ్‌సకు 35.92 శాతం, బీజేపీ 34.64 శాతం, కాంగ్రెస్‌ 19.47 శాతం ఓట్లను సాధించాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారుకావడంతో ప్రచారంలో దూసుకు పోతున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు గెలిచేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు.

బీజేపీకి పెరిగిన ఓటు బ్యాంకు

గత పార్లమెంట్‌ ఎన్నికలతో పోల్చుకుంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు బ్యాంకు భారీగా పెరిగింది. గత ఎన్నికల్లో గెలిచిన ఎంపీ బాపురావు 3,77,374 ఓట్లను సాధించాడు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 4,43,13 ఓట్లు దక్కాయి. దీంతో ఈ సారి కూడా గెలుపు తమదేనంటూ బీజేపీ నేతలు ధీమాగా కనిపిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోనే బీజేపీ 4 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. అయితే ఎంపీ బాపురావు బోథ్‌ నియోజక వర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనను పక్కన పెట్టి గోడం నగేశ్‌కు పార్టీ అవకాశం కల్పించింది. కానీ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీల ఉద్యమాన్ని ముందుండి నడిపించిన సోయం బాపురావును కాదని.. అధిష్ఠానం కొత్త వారికి అవకాశం ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో సిట్టింగ్‌ ఎంపీ ఉండగా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతను అభ్యర్థిగా ఖరారు చేయడం సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల బాపురావును అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించి కేంద్ర స్థాయిలో నామినేట్‌ పదవిని ఇచ్చేందుకు హామీ ఇవ్వగా.. ఆయన కొంత మెత్తబడినట్లు తెలుస్తోంది.

బలపడేందుకు కాంగ్రెస్‌ యత్నం

అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని దక్కించుకుని ఈ ఎన్నికల్లో మరింత బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఊహించని విధంగా ఆదివాసీ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణను అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే పలువురు జిల్లా, మండల స్థాయి నేతలను పార్టీలో చేర్చుకుని గెలుపు దిశగా ముందుకు సాగుతోంది. అధికార పార్టీ కావడంతో ఆశావహనేతలు సైతం ఎక్కువగా ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కక పోవడంతో కాంగ్రె్‌సలో చేరిన ఖానాపూర్‌ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ను పక్కన పెట్టి సుగుణకు అవకాశం కల్పించారు. త్వరలోనే బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల నుంచి మరికొంత మంది ముఖ్య నేతలు కాంగ్రె్‌సలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన రాథోడ్‌ రమేష్‌ 3,14,238 ఓట్లు దక్కించుకుని మూడో స్థానానికి పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. కాంగ్రెస్‌ ఒక్క ఖానాపూర్‌ నియోజకవర్గంలోనే గెలిచింది. మిగితా 6 చోట్ల మూడో స్థానానికే పరిమితమైంది. ఇప్పటికే మంత్రి సీతక్కకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించిన పార్టీ అధిష్ఠానం.. ఆమె సూచనలు, సలహాల మేరకే అభ్యర్థిని ఖరారు చేసిందన్న ప్రచారం జరుగుతోంది. త్వరలోనే బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మరికొంత మంది ముఖ్య నేతలు హస్తం గూటికి చేరే అవకాశం కనిపిస్తుంది.

అభ్యర్థి మార్పు తప్పదా?

గత పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి 3,18,814 ఓట్లను దక్కించుకుని ఓటమి పాలైన మాజీ ఎంపీ గోడం నగేశ్‌ బీజేపీలో చేరిపోవడంతో ఆసిఫాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఆదివాసీలే కావడంతో లంబాడా సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మార్పు ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న మాజీ ఎంపీ రాథోడ్‌రమేశ్‌ను పార్టీలో చేర్చుకుని ఆయనకు టికెట్‌ ఇచ్చే అవకాశాలు లేక పోలేదంటున్నారు. పార్టీ అధికారంలో లేకపోవడంతో పోటీ చేసేందుకు ఎవరూ అంతగా ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లా పై మంచి పట్టున్న మాజీ ఎంపీ రాథోడ్‌రమేష్‌ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు గట్టి పోటీ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్‌ మాత్రం సొంత పార్టీ కేడర్‌నే నమ్ముకుని ఎన్నికల్లో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. గెలువడం అంత సులువైన పనేమి కాకపోయినా.. త్రిముఖ పోటీలో బయట పడే అవకాశాలు ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 15 , 2024 | 05:27 PM