Share News

కరీంనగర్‌కు ఎవరో?

ABN , Publish Date - Apr 10 , 2024 | 03:50 PM

తెలంగాణలో కీలకమైన కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో అభ్యర్థిని ఎంపిక చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది.

కరీంనగర్‌కు ఎవరో?

  • ఖరారు కాని కాంగ్రెస్‌ అభ్యర్థి

  • ఆశావహులు ఎందరో..

  • పరిశీలనలో ప్రవీణ్‌రెడ్డి, రాజేందర్‌రావు పేర్లు

  • ఎంపిక ఆలస్యంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన

  • ఇప్పటికే ప్రచారంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

  • గెలుపు ధీమాలో మూడు ప్రధాన పార్టీలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): తెలంగాణలో కీలకమైన కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో అభ్యర్థిని ఎంపిక చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్ర, ఢిల్లీస్థాయిలో పదేసి సార్లు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశాలు నిర్వహించినా అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి పలువురు దరఖాస్తులు చేసుకున్నా హస్నామాద్‌ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేందర్‌, రుద్ర సంతోష్‌ కుమార్‌ పేర్లను పరిశీలిస్తున్నది. గత ఎన్నికల్లో ఈ సీటును కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ దానిని తిరిగి దక్కించుకోవడానికి సిట్టింగ్‌ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ను మళ్లీ అభ్యర్థిగా ప్రకటించింది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు సెంటిమెంట్‌ జిల్లా అయిన కరీంనగర్‌లో తిరిగి పాగా వేయడానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అభ్యర్థిత్వాన్ని ఖాయం చేసింది. ఈ ఇద్దరూ గత ఎన్నికల్లోనూ ప్రత్యర్థులే.

పరిశీలనలో ముగ్గురు పేర్లు

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుస్నాబాద్‌ నుంచి టికెట్‌ ఆశించిన హస్నామాద్‌ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడి ప్రవీణ్‌రెడ్డిని కాదని ఆ స్థానంలో ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అవకాశం కల్పించారు. ఆ సందర్భంలో రేవంత్‌రెడ్డితోపాటు కేంద్ర నాయకత్వం ఆయనకు ఎమ్మెల్సీ పదవి లేదా లోక్‌సభ టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనికి తోడు ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిటీ ఈ స్థానానికి ప్రవీణ్‌రెడ్డి పేరును మాత్రమే కేంద్ర కమిటీకి పంపించింది. అయితే కేంద్ర కమిటీ మాత్రం ముగ్గురు పేర్లను పరిశీలనలోకి తీసుకున్నది. వీరిలో ప్రవీణ్‌రెడ్డి లేదా రాజేందర్‌రావుకు అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఇప్పటికే ఆరు స్థానాలను కేటాయించారు. పెండింగ్‌లో ఉన్న ఖమ్మం, కరీంనగర్‌ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీలో రెడ్డి అభ్యర్థులే ఉండడంతో వీరిలో ఒకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఖమ్మంలో రెడ్డి సామాజికవర్గానికి అవకాశం కల్పిస్తే కరీంనగర్‌లో వెలమ సామాజిక వర్గానికి చెందిన రాజేందర్‌రావుకు, అక్కడ వేరే వారికి అవకాశమిస్తే కరీంనగర్‌లో ప్రవీణ్‌రెడ్డికి టికెట్‌ దక్కవచ్చని భావిస్తున్నారు.

ప్రచారంలో ముందున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌..

కాంగ్రెస్‌ ఇంకా అభ్యర్థి ఎవరు అనేది తేల్చుకోలేక పోతుండగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మాత్రం నామినేషన్లకు ముందే ఒకటిరెండు సార్లు నియోజకవర్గాన్ని చుట్టేసి ప్రచారం పూర్తిచేస్తున్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ నాయకులు, శ్రేణులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి వివిధ కుల సంఘాల పెద్దలను, సంస్థల ప్రతినిధులతో ఇప్పటికే సమావేశాలు, బేటీలు నిర్వహించాయి. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ ప్రజాహిత యాత్ర పేరిట నియోజకవర్గంలోని సిరిసిల్ల, వేములవాడ, హుజూరాబాద్‌, హుస్నాబాద్‌, మానకొండూర్‌, కరీంనగర్‌, చొప్పదండి నియోజకవర్గాల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసున్నారు. గడిచిన టర్మ్‌లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయా గ్రామాలకు విడుదలైన నిధులు, చేపట్టిన పనులు, రాబోయే రోజుల్లో చేపట్టదలచిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఆయన ప్రచారం చేస్తున్నారు. బీజేపీ కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన విజయ సంకల్పసభను జగిత్యాలలో ఏర్పాటు చేయగా ప్రధాని నరేంద్రమోదీ ఆ సభలో పాల్గొన్ని ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో అభ్యర్థిని పరిచయం చేసి గెలిపించాలని కోరారు. ఈ రెండు పార్టీలు ప్రచారంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ కంటే ముందుండడం అభ్యర్థి ఎవరో తేలక పోవడం కాంగ్రెస్‌ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని కలిగిస్తున్నదని చెబుతున్నారు.

ఈ ఇద్దరూ పాత ప్రత్యర్థులే

ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థిత్వాలు ఖరారైన బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు గత ఎన్నికల్లో పోటీపడిన పాత ప్రత్యర్థులే. కాంగ్రెస్‌ నుంచి ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా ఈసారి కొత్తవారే అవుతారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్‌ పోటీ చేశారు. సిటింగ్‌ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ గత ఎన్నికల్లో 4,78,916 ఓట్లు పొంది విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థిగా ఉన్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు 4,00,552 ఓట్లు వచ్చాయి. మూడోస్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌కు 1,76,756 ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కొంత డీలా పడిపోగా, బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ముఖాముఖి పోటీ సాగింది. కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారంలోకి రావడం, అలాగే ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నాలుగు సెగ్మెంట్లలో ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు విజయం సాధించారు. మరో మూడు స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనితో ఈ రెండు పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో విజయంపై ఆశలు పెంచుకున్నాయి. అయితే బీజేపీ మాత్రం తమ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకుంటామన్న ధీమాతో ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే తమకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెట్టింపు ఓట్లు రావడంతో ఈసారి గెలుపు మరింత సులువవుతుందని బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో ముక్కోణపు పోరు జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తొలి నుంచి వెలమలదే ఆధిపత్యం..

కరీంనగర్‌ లోక్‌సభ స్థానం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ వెలమల ఆధిపత్యమే కొనసాగుతూ వస్తుంది. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా కరీంనగర్‌ లోక్‌సభ స్థానం ఏర్పడింది. ఇక్కడ 16 సార్లు సాధారణ ఎన్నికలు, మూడు ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం నుంచి 15 పర్యాయాలు వెలమ అభ్యర్థులు, మూడు సార్లు బీసీ నాయకులు, ఒకసారి రెడ్డి సామాజిక వర్గం నేతలు, రెండు సార్లు ఎస్సీ అభ్యర్థులు విజయం సాధించారు. పార్టీల వారీగా పదిసార్లు కాంగ్రెస్‌, మూడు సార్లు బీజేపీ, నాలుగుసార్లు బీఆర్‌ఎస్‌, టీడీపీ, తెలంగాణ ప్రజా సమితి, పీడీఎఫ్‌, ఎన్‌సీఎ్‌ఫ ఒక్కోసారి విజయం సాధించాయి. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నపుడు ఇక్కడి నుంచి పీడీఎ్‌ఫకు చెందిన బద్దం ఎల్లారెడ్డి, ఎన్‌సీఎ్‌ఫకు చెందిన ఎంఆర్‌ కృష్ణ, 1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నపుడు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంఆర్‌ కృష్ణ, ఎం శ్రీరంగరావు ఎంపీలుగా గెలుపొందారు. 1962 నుంచి ఏకసభ్య నియోజకవర్గంగా మారింది. 1962, 67 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జె రమాపతిరావు గెలుపొందారు. 1971లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా పోటీచేసిన ఎం సత్యనారాయణరావు విజయం సాధించారు. ఆయన తర్వాత కాంగ్రె్‌సలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి 1977, 80 ఎన్నికల్లో గెలుపొందారు. 1984, 89, 1991 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన జువ్వాడి చొక్కారావు హ్యాట్రిక్‌ విజయం సాధించారు. 1996లో టీడీపీకి చెందిన ఎల్‌ రమణ ఎంపీగా గెలుపొందారు. 1998, 99లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చెన్నమనేని విద్యాసాగర్‌రావు విజయం సాధించారు. 2004 సాధారణ ఎన్నికలు, 2006, 2008 ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన కె చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) వరుస విజయాలను సాధించారు. కాంగ్రెస్‌ 2009లో తిరిగి ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్నది. ఆ పార్టీకి చెందిన పొన్నం ప్రభాకర్‌ ఇక్కడ ఎంపీగా గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు చెందిన వినోద్‌కుమార్‌ గెలుపొందగా, 2019లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ విజయం సాధించారు.

Updated Date - Apr 10 , 2024 | 03:50 PM