Share News

లేత ప్రాయంపై ‘బ్యాగు’ మోత

ABN , Publish Date - Jun 16 , 2024 | 03:37 PM

నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో విద్యార్థులపై మళ్లీ బ్యాగు భారం మొదలైంది.

లేత ప్రాయంపై ‘బ్యాగు’ మోత

  • ఏటా పెరుగుతున్న స్కూల్‌ పుస్తకాల భారం

  • చెప్పినవన్నీ కొనాలని ప్రైవేట్‌ స్కూళ్ల హుకుం

  • వయసుకు మించిన బరువుతో విద్యార్థుల అవస్థలు

  • పై అంతస్థుల్లో తరగతులతో వెన్నుపూసపై ఒత్తిడి

  • చిరు ప్రాయంలోనే మెడనరాలు, కండరాల నొప్పులు

  • 2020 స్కూల్‌ బ్యాగు పాలసీని పట్టించుకోని వైనం

  • భారం తగ్గించాలంటున్న వైద్య నిపుణులు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో విద్యార్థులపై మళ్లీ బ్యాగు భారం మొదలైంది. పాఠశాలలకు ఆడుతూ.. పాడుతూ వెళ్లాల్సిన పిల్లలను పుస్తకాల సంచి వెన్ను వంచుతోంది. ఫలితంగా పట్టుమని 15 ఏళ్లు నిండక ముందే చాలామంది నడుము, మెడ నొప్పి, కండరాల సమస్యలతో సతమతమవుతున్నారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకు అందరూ బ్యాగుల తూకంతో బోరుమంటున్నారు. అయితే స్కూళ్లలో బుక్స్‌ భారం తగ్గించి విద్యార్థులకు గుణాత్మక, నైపుణ్య విద్యను అందించాలని విద్యాహక్కు చట్టం చెబుతున్నా ప్రైవేట్‌ విద్యాసంస్థలు పట్టించుకున్న పాపనపోవడం లేదు. పుస్తకాల భారం తగ్గించాలని 2006లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చినప్పటికీ, 2020లో స్కూల్‌ బ్యాగు పాలసీ ద్వారా సూచించినప్పటికీ వాటిని అమలు చేయడం లేదు. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు.

ఒకటో తరగతికి 26 పుస్తకాలు

వాస్తవంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌, గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు తప్పనిసరిగా ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలనే తీసుకొని చదువుతుంటారు. అయితే ప్రైవేట్‌ స్కూళ్లలో మాత్రం ఆయా యాజమాన్యాలు ముద్రించిన పుస్తకాలను కచ్చితంగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు ప్రైవేట్‌ బుక్స్‌ తీసుకోవాల్సి వస్తుండగా.. 6 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను చదువుతున్నారు. అయితే ఆయా తరగతులకు సంబంధించి ప్రభుత్వ పుస్తకాలతో బోధనలు అందిస్తుండడంతో పాటు ఐఐటీ కోచింగ్‌, స్మార్ట్‌ క్లాసులు, రివిజన్‌ పేరిట సాధారణ పుస్తకాలతో పాటు సొంతంగా ప్రింట్‌ చేసిన పలు రకాల బుక్స్‌ను కొనుగోలు చేయాలని స్కూల్‌ నిర్వాహకులు సూచిస్తున్నారు. దీంతో పిల్లలు వయసుకు మించిన బరువును అనివార్యంగా మోయాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా, ప్రభుత్వ విద్యార్థులు మాత్రం ఆరు సబ్జెక్టులకు 6 పుస్తకాలు, మరో 6 నోట్‌ బుక్స్‌, కాపీరైట్‌కు సంబంధించి మరో నాలుగు నోట్‌ బుక్స్‌ మాత్రమే పట్టుకెళ్తుండగా.. ప్రైవేట్‌ కార్పొరేట్‌, టెక్నో పాఠశాలల్లో వాటికి రెండు, మూడింతలు ఎక్కువగా ఉంటున్నాయి.

నిబంధనలు పాటించని యాజామన్యాలు

ఉదాహరణకు ఒకటో తరగతి విద్యార్థికి ప్రభుత్వ బడిలో పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్‌ కలిపి 14 వరకు ఉన్నాయి. ప్రైవేట్‌ బడిలో మాత్రం 26 ఉన్నాయి. అలాగే పదో తరగతిలో ప్రభుత్వ స్కూల్లో 18 ఉండగా.. కార్పొరేట్‌ స్కూల్‌లో అన్ని కలిపి 48 వరకు ఉన్నట్లు ఓ విద్యార్థి తండ్రి వాపోయారు. పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, కాపీ రైట్‌, కంబాక్స్‌, ఎక్సెర్‌ సైజ్‌ నోట్స్‌, కలర్‌ కంపోజింగ్‌, రైటింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌, తదితర ఇలా అన్ని కలిపి 20 కిలోలకు పైగా బరువు ఉంటుందని వాపోతున్నారు. రోజు పిల్లలు స్కూల్‌కు బ్యాగును పట్టుకొని వెళ్తూ ఇంటికి వచ్చేసరికి నీరసించి పోతున్నాడని తెలిపారు. ఇదిలా ఉండగా, విద్యా సంవత్సరానికి సంబంధించిన కరికులమ్‌ ఏటా జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా విడుదలవుతోంది. పాఠ్యాంశాలు, సాంస్కృతిక, ఆరోగ్య పరిరక్షణ కింద పలు అంశాలతో పట్టిక రూపొందించాల్సినప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్‌ స్కూళ్ల కోసం ప్రత్యేక నిబంధనలతో పట్టికను విడుదల చేసి, ఆయా పాఠశాలల్లో రోజువారీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై తనిఖీలు చేపటాల్సి ఉండగా.. క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం గమనార్హం.

అధిక బరువు మోయడం వల్ల వచ్చే సమస్యలు..

  • పిల్లలు మోయాల్సిన బరువు కంటే అధిక బరువు మోస్తే స్కోలియోసిస్‌ (వెన్నెముక ఒక వైపు వంగిపోవడం) వంటి ఇబ్బందులు వస్తాయి.

  • బరువు కారణంగా పాదంపై పట్టు మారుతోంది. నడక తీరు పట్టు తప్పుతుంది. తద్వారా పిల్లలు మానసిక సమస్యలు ఎదుర్కొంటారు.

  • బ్యాగును ఒక వైపే తగిలించుకుని నడవడం కారణంగా భుజం, మెడనొప్పి వస్తోంది.

  • బ్యాగును నడుము కింద వరకు వేలాడుతూ ఉండి నడిస్తే నడుము దెబ్బతినే అవకాశమూ ఉంటుంది.

బ్యాగు బరువును తగ్గించుకోండిలా..

  • విద్యార్థులు రెండు చేతులకు బ్యాగును తగిలించుకుని వెళ్తే నడుముపై అధిక భారం పడకుండా ఉంటుంది. అలా కాకుండా వన్‌సైడ్‌ వేసుకుని వెళ్తే మెడనరాలు, భుజం కండారాలు ఒత్తిడికి లోనవుతాయి.

  • బ్యాగు పట్టీలు మందంగా ఉండాలి. పిల్లల నడుమ కింద నాలుగు అంగుళాలు మించకూడదు.

  • రోజువారీ స్కూల్‌కు అవసరమైన వాటినే తీసుకెళ్లాలి.

  • టీచర్లు ఆ రోజు చెప్పని క్లాసుకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ను అసలే తీసుకెళ్లొద్దు.

  • బరువైన పుస్తకాలను వెన్నెముకకు దగ్గరగా ఉంచుకోవాలి. దీంతో భుజాలపై బరువు పడకుండా ఉంటుంది.

  • బస్సు కోసం వేచి చూస్తున్నప్పుడు, స్కూల్‌లో అసెంబ్లీ సమయంలో, ఇతర పరిస్థితుల్లో బ్యాగును కింద పెట్టమని తల్లిదండ్రులు చెప్పాలి.

  • టైంటేబుల్‌ ప్రకారం బుక్స్‌ తీసుకురావాలని, హోంవర్క్‌ లేనివి పట్టుకురావద్దని టీచర్లు సైతం సూచించాలి.

బరువు తగ్గించకుంటే సమస్యలే: డాక్టర్‌ విశ్వక్‌సేనారెడ్డి, సీనియర్‌ కన్సల్టెంట్‌, న్యూరో సర్జరీ

స్కూళ్లలో బ్యాగుల బరువును తగ్గించాల్సిన అవసరం ఉంది. లేదంటే యుక్త వయసులోనే పిల్లలు వెన్నుపూస సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. గతంలో 50 నుంచి 60 ఏళ్ల వయసు గల వారికి వెన్నుపూస సర్జరీ చేసే పరిస్థితి ఉండేది. కొన్ని రోజుల క్రితం 14 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థికి కూడా అలాంటి సర్జరీ చేయాల్సి వచ్చింది. స్కూల్‌ బ్యాగు అధికంగా మోయడంతోనే ఆయన సర్జరీని ఎదుర్కొవాల్సి వచ్చింది. టీచర్లు హోంవర్క్‌ను వీలైనంతగా తగ్గించాలి. టెక్నాలజీని వాడుకుని డిజిటల్‌ పద్ధతిలో క్లాసులు బోధించాలి. పిల్లలు రోజువారీ ఆహారంలో పోషక విలువలు పాటించాలి. గుడ్డు, పాలు తాగడంతోపాటు మాంసాహారాన్ని తీసుకోవాలి. అలాగే పాఠశాలల్లో వ్యాయామాన్ని చేయించడం ద్వారా విద్యార్థులు కండరాల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.

స్కూల్‌ బ్యాగు పాలసీ-2020 సూచన ప్రకారం..

తరగతి - విద్యార్థి బరువు - బ్యాగు బరువు (సుమారు) - ప్రైవేట్‌ స్కూళ్లలో ప్రస్తుత భారం

ప్రీ ప్రైమరీ - 10-16 కిలోలు - నో బ్యాగ్‌ - అర నుంచి కిలో

1వ - 16-22 - 1.6-2.2 కిలోలు - 4 కిలోలు

2వ - 16-22 - 1.6-2.2 - 6 కిలోలు

3వ - 17-25 - 1.7-2.2 - 7 కిలోలు

4వ - 17-25 - 1.7-2.5 - 9 కిలోలు

5వ - 17-25 - 1.7-2.5 - 9.5-11కిలోలు

6వ - 17-25 - 1.7-2.5 - 12-13 కిలోలు

7వ - 20-30 - 2 నుంచి 3 - 15-17 కిలోలు

8వ - 20-30 - 2 నుంచి 3 - 18-19 కిలోలు

9వ - 25-40 - 2.5 నుంచి 5.4 - 22-23 కిలోలు

10వ - 25-45 - 2.5 నుంచి 5.4 - 22-23 కిలోలు

Updated Date - Jun 16 , 2024 | 03:37 PM