ఎన్నికల వే‘ఢీ’ భానుడి దాడి
ABN , Publish Date - Apr 11 , 2024 | 03:44 PM
లోక్‌సభ ఎన్నికలు అన్ని పార్టీలకు దడ పుట్టిస్తున్నాయి.
పోరుబాటలో అన్ని పార్టీలకూ ‘అగ్ని’ పరీక్ష
ఠారెత్తిస్తున్న ఎండలతో అభ్యర్థుల ‘అయ్యో’మయం
బహిరంగ ప్రచారం, ర్యాలీలకు వెనుకడుగు
ఎండ వేడిమితో బయటకురాని కార్యకర్తలు
జనసమీకరణకూ తప్పని ఇబ్బందులు
ఉదయం, సాయంత్రం వేళల్లో పర్యటనలు
సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం
పోలింగ్ సమీపిస్తుండడంతో అభ్యర్థుల్లో గుబులు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికలు అన్ని పార్టీలకు దడ పుట్టిస్తున్నాయి. ఓ వైపు ఎండ వేడి.. మరోవైపు ప్రచార వే‘ఢీ’తో అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మే 13న పోలింగ్ ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే భానుడి ఉగ్రరూపంతో కార్యకర్తలు కలిసిరావడం లేదు. జనసమీకరణ చేయడం, ఇంటింటి ప్రచారం నిర్వహించడం కష్టతరమవుతోందని అభ్యర్థులు వాపోతున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాలుండగా.. కాంగ్రెస్ హైదరాబాద్ స్థానాన్ని పెండింగ్‌లో ఉంచింది. సికింద్రాబాద్‌లో ప్రకటించినా దానం నాగేందర్ ప్రచారాన్ని ముమ్మరం చేయడం లేదు. ఆయన అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ అధిష్ఠానానికి అనుమానం ఉండడమే ఇందుకు కారణం.
అన్ని పార్టీలకు సవాలే
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఒక్క స్థానం గెలువలేకపోయింది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ 16, బీజేపీ ఒకటి, ఎంఐఎం 7 స్థానాలను దక్కించుకున్నాయి. గ్రేటర్‌లో పట్టు లేకపోవడంతో అధికార కాంగ్రెస్ తాజా పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల స్థానాలను కైవసం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందుకనుగుణంగా ఆయా సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎ్‌సలు కూడా ఆయా స్థానాల్లో పట్టు నిలుపుకునేందుకు ఆరాటపడుతున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌లో మెజార్టీ సీట్లను పొందిన తాము పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పైచేయి సాధిస్తామని బీఆర్‌ఎస్ నేతలు ధీమాగా ఉండగా, దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తున్నందున ఆ మూడు స్థానాలతోపాటు ఈసారి హైదరాబాద్ ఎంపీ సీటును కూడా కైవసం చేసుకుంటామని కాషాయ నేతలు గంభీరం ప్రదర్శిస్తున్నారు.
సుర్రుమంటున్న సూరీడు
నగరంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కంటే 3, 4 డిగ్రీలు అధికంగా నమోదవుతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎండ తీవ్రతకు తోడు రెండు రోజులుగా వడగాలులు కూడా వీస్తుండడంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనవుతున్నారు. మండుతున్న ఎండల బారి నుంచి తప్పించుకొని ప్రచారం చేయడం కష్టతరం అవుతోందని అభ్యర్థుల అనుచరులు వాపోతున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 10లోపు ప్రచారం చేసేలా ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. అయితే, నిర్ణీత సమయం పెట్టుకొని ప్రచారం నిర్వహించడం ద్వారా ఆశించిన ఓట్లు వస్తాయో లేదోనని అభ్యర్థులు గుబులు చెందుతున్నారు.
సోషల్ మీడియాపైనే ఆధారం
నిప్పులు కక్కుతున్న భానుడి బారి నుంచి నుంచి తప్పించుకొని ప్రచారం నిర్వహించడం కష్టంగా మారిన నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. వేడి తక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో సుడిగాలి పర్యటన చేయడంతోపాటు ఆయా ప్రాంతాల్లో చేసిన ప్రచారాన్ని పార్టీలతోపాటు తాము సొంతంగా ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా టీమ్‌ల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎస్‌ఎంఎ్‌సలు, వాయిస్ మెస్సేజ్‌లు పంపుతున్నారు. మే 13న జరిగే పోలింగ్ వరకు పోటీలో ఉండే అభ్యర్థులు ‘అగ్ని’ పరీక్షను ఎదుర్కోక తప్పదు.