Rajya Sabha Majority Mark: రాజ్యసభలో మెజారిటీ దిగువకు పడిపోయిన ఎన్డీయే ఎంపీల సంఖ్య!.. వైసీపీ సాయం కావాల్సిందే?
ABN , Publish Date - Jul 15 , 2024 | 02:11 PM
రాజ్యసభలో సమీకరణాలు మారిపోయాయి. ఎన్డీయే పార్టీలైన టీడీపీ, జేడీయూలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ బలం రాజ్యసభలోనూ తగ్గింది. నామినేటెడ్ ఎంపీలైన రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్‌సింగ్, మహేశ్ జెఠ్మలానీల పదవీకాలం శనివారంతో పూర్తయింది.
ఎన్డీయే పార్టీలైన టీడీపీ, జేడీయూలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ బలం రాజ్యసభలోనూ తగ్గింది. నామినేటెడ్ ఎంపీలైన రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్‌సింగ్, మహేశ్ జెఠ్మలానీల పదవీకాలం శనివారంతో పూర్తయింది. అధికార పార్టీ సలహా మేరకు ఈ నలుగురిని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆ నలుగురు ప్రధాని మోదీ సారధ్యంలోని ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. శనివారంతో వీరి పదవీకాలం ముగిసిపోవడంతో రాజ్యసభలో బీజేపీ ఎంపీల సంఖ్యాబలం 86కి పడిపోయింది. పర్యవసానంగా మొత్తం 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో ఎన్డీయే కూటమి సంఖ్యాబలం 101కి పడిపోయింది. రాజ్యసభ మెజారిటీ మార్క్ 113 కంటే ఎన్డీయే ఎంపీల సంఖ్య ఇంకా తక్కువగానే ఉంది.
ప్రస్తుత రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 225గా ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బలం 87గా ఉంది. కాంగ్రెస్‌కు 26, తృణమూల్ కాంగ్రెస్‌కు 13, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే పార్టీలకు చెరో 10 మంది చొప్పున రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఇక ఎన్డీయే, ఇండియా కూటములలో లేని బీఆర్ఎస్ వద్ద నలుగురు, పలువురు స్వతంత్రులు ఉన్నారు.
వైసీపీ సాయం కోరాల్సిందేనా?
ఎగువ సభలో సంఖ్యా బలం తగ్గడంతో అధికార ఎన్డీయే కూటమి బిల్లులను ఆమోదం కోసం ఇతర పార్టీలపై ఆధారపడాల్సి ఉంటుంది. తమిళనాడులోని అన్నాడీఎంకే, ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌సీపీ వంటి పార్టీలను ఆశ్రయించాల్సి ఉంటుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ వద్ద 11, అన్నాడీఎంకే వద్ద 4 మంది సభ్యులు ఉన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ-జనసేనతో బీజేపీ కలవడంతో వైసీపీ దూరమైనప్పటికీ మళ్లీ ఆ పార్టీని బీజేపీ సంప్రదించాల్సిన పరిస్థితి రావొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా వైసీపీ ఇదే పనిచేసింది. బీజేపీ ప్రభుత్వానికి అనేక బిల్లుల విషయంలో మద్దతు తెలిపింది. కాబట్టి మరోసారి బిల్లుల విషయంలో వైసీపీని బీజేపీ సంప్రదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారధ్యంలోని బీజేడీ కూడా గతంలో ఇదే విధంగా బీజేపీకి మద్దతు ఇచ్చింది. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలోనే ఆ పార్టీ ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు బీజేపీకి బీజేడీ సభ్యులు మద్దతు ఇవ్వడం సందేహమేనని చెప్పాలి. బీజేడీ వద్ద 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు.
రాజ్యసభలో 20 ఖాళీలు..
ప్రస్తుతానికి రాజ్యసభలో మొత్తం 20 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 11 మంది ఎన్నికైన సభ్యుల స్థానాలు ఉన్నాయి. ఆయా స్థానాలకు ఈ ఏడాదే ఎన్నికల జరిగే అవకాశం ఉంది. వీటిలో మహారాష్ట్ర, అసోం, బీహార్‌లలో 2, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపురలలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని కూటమి అసోం, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, త్రిపురలలో 7 సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్రలోనూ రెండు స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది. ఈ ఏడు స్థానాలు, నామినేటెడ్ సభ్యులకు తోడు వైసీపీ మద్దతు ఇస్తే ఎన్డీయే కూటమి బిల్లులను గట్టెక్కించుకోగలుగుతుంది.