Share News

Telangana: టీపీసీసీ చీఫ్ ఖరారు.. అధికారిక ప్రకటన ఎప్పుడుంటే..?

ABN , Publish Date - Aug 23 , 2024 | 05:48 PM

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు..? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ పదవీకాలం అయిపోయినంత వరకూ నడిచిన.. ఇంకా నడుస్తున్న ఏకైక చర్చ. ఒకరా ఇద్దరా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయ్..! అదిగో అధికారిక ప్రకటన వచ్చేస్తోంది.. ఇదిగో ఈయనే కన్ఫామ్ అయ్యారని లెక్కలేనన్ని వార్తలు.. అంతకుమించి పుకార్లు షికార్లు చేశాయ్..! ఆశావహులు అయితే ఈసారైనా అదృష్టం వరించకపోదా..? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పరిస్థితి..

Telangana: టీపీసీసీ చీఫ్ ఖరారు.. అధికారిక ప్రకటన ఎప్పుడుంటే..?
Telangana Congress

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు..? రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పీసీసీ పదవీకాలం అయిపోయినంత వరకూ నడిచిన.. ఇంకా నడుస్తున్న ఏకైక చర్చ. ఒకరా ఇద్దరా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయ్..! అదిగో అధికారిక ప్రకటన వచ్చేస్తోంది.. ఇదిగో ఈయనే కన్ఫామ్ అయ్యారని లెక్కలేనన్ని వార్తలు.. అంతకుమించి పుకార్లు షికార్లు చేశాయ్..! ఆశావహులు అయితే ఈసారైనా అదృష్టం వరించకపోదా..? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పరిస్థితి. సరిగ్గా ఈ క్రమంలోనే టీపీసీసీ (TPCC) పగ్గాలు హైకమాండ్ ఎవరికి అప్పగించబోతోందనే అనే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. కాంగ్రెస్‌కు కాబోయే అధ్యక్షుడు ఎవరనే దానిపై హింట్ ఇచ్చేసింది..!


Mahesh-Gowd-2.jpg

ఇదిగో ఈయనే..!

తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా సీనియర్ నేత బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (Bomma Mahesh Kumar Goud) పేరు దాదాపు ఖరారయ్యింది. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే శుక్రవారం రాత్రి లేదా.. శనివారం సాయంత్రంలోపు ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. సుమారు గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో పీసీసీపై ఫుల్ క్లారిటీ వచ్చేసిందని తెలియవచ్చింది. ఈ సమావేశంలో మహేష్ పేరు ఖరారు కాగా.. ఢిల్లీ నుంచే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే మీటింగ్‌లో మంత్రివర్గ విస్తరణపై కూడా ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలిసింది.


Mahesh-Gowd.jpg

ఎవరీ మహేష్..?

బొమ్మ మహేష్ కుమార్.. గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత. 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం, రహత్‌నగర్‌లో జన్మించారు. గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐ (NSUI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం పీసీసీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే.. రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌ పదవిని హైకమాండ్ కట్టబెట్టింది. 2021 జూన్- 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్- 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్- 20న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.

Mahesh-Gowd-3.jpg

2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనీ భావించిన మహేష్.. ఆ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపడంతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో.. ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. చూశారుగా.. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఇన్ని రోజులకు ఆయన కష్టానికి తగిన ఫలితం లభించబోతోందని కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Mahesh-Gowd-4.jpg

రేసులో ఎవరెవరు..?

సీఎం దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి కావడంతో.. ఉత్తర తెలంగాణ నేతకి పీసీసీ చీఫ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకే పీసీసీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల నుంచి ఒక్కో పేరుతో షార్ట్ లిస్ట్ సిద్ధం చేసినట్టు సమాచారం. ఎస్సీ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్.. ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్.. బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కీ, మహేష్ కుమార్ గౌడ్.. పీసీసీ చీఫ్ రేసులోకి వచ్చారు. ఫైనల్‌గా మహేష్‌ను అదృష్టం వరించిందని.. ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Mahesh-Kumar-Gowd.jpg

Updated Date - Aug 23 , 2024 | 06:10 PM