Share News

ఆ పార్టీ కంచుకోటలో రసవత్తర పోరు..!

ABN , Publish Date - Apr 04 , 2024 | 03:42 PM

గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న వరంగల్‌ లోక్‌సభ సీటుపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి.

ఆ పార్టీ కంచుకోటలో రసవత్తర పోరు..!

  • ‘ఓరుగల్లు’పై ప్రధాన పార్టీల దృష్టి

  • వలస నేతలకే కాంగ్రెస్‌, బీజేపీ టికెట్లు

  • కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేశ్‌

  • కడియం ఝలక్‌తో అభ్యర్థి వేటలో బీఆర్‌ఎస్‌

  • ఇప్పటికే ప్రచారంలోకి దిగిన అభ్యర్థులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌)

గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న వరంగల్‌ లోక్‌సభ సీటుపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఇక్కడ పాగా వేసేందుకు కాంగ్రెస్‌, బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే కడియం కావ్యను కాంగ్రెస్‌ బరిలోకి దించగా, బీజేపీ నుంచి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు కూడా గులాబీ పార్టీ నుంచి వలస వచ్చిన వారే. ఈ నేపథ్యంలో కారు పార్టీకి అభ్యర్థి కరువయ్యారు. కడియం కావ్యను తమ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ఆమె రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరి ఆ పార్టీ నుంచి పోటీకి దిగుతున్నారు. దీంతో గులాబీ పార్టీ ఈ స్థానాన్ని సవాల్‌గా తీసుకుంది. బలమైన అభ్యర్థిని బరిలో దించేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు నిత్యం ప్రజల్లోకి వెళ్తూ ప్రచారంలో మునిగిపోయారు.

వరంగల్‌.. గులాబీ కంచుకోట

2009లో పునర్వీభజనలో భాగంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో వరంగల్‌ పార్లమెంట్‌ ఏర్పడింది. వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, స్టేషన్‌ఘనపూర్‌, పాలకుర్తి నియోజకవర్గాలతో ఈ స్థానం ఎస్సీ రిజర్వుడుగా ఏర్పడింది. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కడియం శ్రీహరి విజయం సాధించారు. 2015లో శ్రీహరి ఎంపీ స్థానానికి రాజీనామా చేసి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో వరంగల్‌ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ దయాకర్‌ కారు గుర్తుపై మరోసారి విజయం సాధించారు. 2009 నుంచి 2019 వరకు నాలుగుసార్లు ఎన్నికలు జరుగుతే మూడు పర్యాయాలు కారు పార్టీ విజయం సాధించింది. వరంగల్‌లో తెలంగాణ ఉద్యమం బలంగా ఉండటం ఆ పార్టీకి కలిసి వచ్చింది. బీఆర్‌ఎ్‌సకు కంచుకోటగా ఉన్న వరంగల్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సునామి సృష్టించింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్‌ విజయం సాధించింది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన స్టేషన్‌ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం ఇటీవల కాంగ్రె్‌సలో చేరడంతో పాటు ఆయన కుమార్తెకే టికెట్‌ కేటాయించడంతో గులాబీ కోటకు బీటలు వారుతున్నాయనే టాక్‌ వినిపిస్తోంది.

బలమైన నేత కావడంతోనే..

వరంగల్‌ ఎంపీ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్‌, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను పార్టీలో చేర్చుకుని బీజేపీ ఆయనకు టికెట్‌ ఇచ్చింది. అంగ బలంతో పాటు ఆర్థికంగా బలమైన నేత కావడంతో బీజేపీ ఆరూరిని ఆకర్షించింది. దీనికి తోడు వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలో బలమైన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం.. తమకు కలిసి వస్తుందనే ఆశతో కమలనాథులు ఉన్నారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకాధ్యక్షులు మంద కృష్ణమాదిగ సొంత జిల్లా కావడంతో ఆయన కూడా బీజేపీ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా ఖరారైన రమేశ్‌ బీజేపీ కీలక నేతలను మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు నియోజకవర్గా స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రచారంలో మిగతా పార్టీలకంటే ఆయన ఒక్క అడుగు ముందుగానే ఉనన్నారు.

42 మందికి పైగా దరఖాస్తు

అలాగే కాంగ్రెస్‌ కూడా తమ అభ్యర్థిగా స్టేషన్‌ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యను బరిలో దించింది. ఈ టికెట్‌ కోసం 42 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే కాంగ్రెస్‌ నేతలు దొమ్మాటి సాంబయ్య, శనిగపురం ఇందిరాలో ఒకరికి టికెట్‌ ఖారారవుతుందని అంతా భావించారు.అనుహ్యంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఖరారై, ప్రచారం చేసుకుంటున్న కడియం కావ్యను పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యేలతో పాటు ఇప్పటికే కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేసి నిరాశకు గురైనా ఆశావహులను కలిసి తనకు సహకారం అందించాలని కావ్య కోరుతున్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఈ పార్లమెంట్‌ స్థానం ఇన్‌చార్జిగా నియమించి, అసంతృప్తులను బుజ్జగించే పని అప్పగించారు. ఈనెల 6న తుక్కుగూడలో జరిగే బహిరంగ సభ అనంతరం ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కాంగ్రెస్‌ నేతలు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు

ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీలోని కీలకమైన నేతలు కాంగ్రెస్‌, బీజేపీల్లోకి వెళ్లారు. ఇక్కడి నుంచి బలమైన అభ్యర్థిని బరిలో దించాలనే ఆలోచనలో అధిష్ఠానం ఉంది. అయితే నాయకులు పోయినంత మాత్రనా కేడర్‌ వెళ్లదని గులాబీ నేతలు నమ్ముతున్నారు. దీంతో పాటు కడియం శ్రీహరి ఎపిసోడ్‌ను ఎన్నికల అస్త్రంగా మల్చుకుని ఓట్ల వేటలో దిగాలనే ఆలోచనలో గులాబీ నేతలు ఉన్నారు. 1వ తేదీన వరంగల్‌ పర్యటనకు వచ్చిన హరీశ్‌రావు ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలతో అభ్యర్థి ఎంపికపై చర్చించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి, వరంగల్‌ జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్న పేరును కొంతమంది నేతలు హరీశ్‌రావు దృష్టికెళ్లారు. అయితే జనగామ ఎమ్మెల్యేతో పాటు మరికొందరు నేతలు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను పోటీలో దించేతే టఫ్‌ ఫైట్‌ ఉంటుందని సూచించారు. వీరితో పాటు తెలంగాణ ఉద్యమకారులైన జోరుక రమేశ్‌, బోడా డిన్నా, సిరిమిల్ల సదానందం, నిరంజన్‌ తదితరులు కూడా టికెట్‌ ఆశిస్తున్నారని హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఉద్యమకారులకు భవిష్యత్తు మంచి అవకాశాలు కల్పిస్తామని, ఈసారి వరంగల్‌ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకుంటున్నామన్నారు. అంగ బలంతో పాటు ఆర్థికంగా బలమైన నేతను బరిలో దించాలని అధిష్ఠానం ఆలోచనగా హరీశ్‌రావు చెప్పినట్లు సమాచారం.

కేసీఆర్‌ స్పెషల్‌ ఫోకస్‌

మరోవైపు మాజీ సీఎం కేసీఆర్‌ సైతం వరంగల్‌పై ఫోకస్‌ చేశారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిలతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. టికెట్‌ విషయంపై చర్చించినట్లుగా తెలిసింది. అయితే స్థానికేతరులైన మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, బాల్క సుమన్‌లు కూడా వరంగల్‌ టికెట్‌ అడుగుతున్నట్లుగా సమాచారం. అయితే వరంగల్‌ స్థానం నుంచి పోటీ చేసిన స్థానికేతరులు ఇప్పటి వరకు ఎవరు గెలువలేదని, స్థానికులకే టికెట్‌ ఇవ్వాలని వరంగల్‌ జిల్లా ప్రతినిధులు కేసీఆర్‌ను కోరినట్లుగా సమాచారం. దీంతో ఒకటి రెండు రోజుల్లో వరంగల్‌ అభ్యర్థిని ఖరారు చేస్తామని కేసీఆర్‌ నేతలకు హమీ ఇచ్చినట్లుగా తెలిసింది. పెద్ది స్వప్న లేదంటే తాటికొండ రాజయ్యలల్లో ఒకరికి టికెట్‌ పక్కా అనే చర్చ గులాబీ పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. అయితే తెలంగాణ ఉద్యమకారులల్లో బోడా డిన్నా టికెట్‌ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మాదిగ సామాజిక వర్గం నేతకే టికెట్‌ ఇవ్వాలని పార్టీ భావిస్తే రాజయ్య కాదంటే డిన్నా పేరును పరిశీలించే అవకాశం ఉంది. మొత్తానికి కాంగ్రెస్‌, బీజేపీలకు దీటుగా అభ్యర్థిని బరిలో దించాలనే ఆలోచనలో బీఆర్‌ఎస్‌ ఉంది. దీంతో ఓరుగల్లు పోరు రసవత్తరంగా మారుతుంది.

Updated Date - Apr 04 , 2024 | 04:15 PM