Share News

నాలుగుకి నాలుగు

ABN , Publish Date - Apr 07 , 2024 | 03:34 PM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో హాట్‌ ఫైట్‌ కొనసాగనుంది.

నాలుగుకి నాలుగు

  • గ్రేటర్‌లో మూడు పార్టీల లక్ష్యం ఇదే

  • వార్‌ వన్‌సైడ్‌ అయ్యేలా తీవ్ర ప్రయత్నాలు

  • కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య త్రిముఖ పోటీ

  • నగరంలో పట్టు నిలుపుకునేందుకు పక్కా వ్యూహాలు

  • బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతున్న పార్టీలు

  • నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాకే ప్రచార జోరు

  • భానుడి భగభగలకు బేజారవుతున్న అభ్యర్థులు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో హాట్‌ ఫైట్‌ కొనసాగనుంది. నాలుగు సీట్లలో మేమే గెలుస్తామంటే.. మేమే గెలుస్తామని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సిట్టింగ్‌ స్థానాలతోపాటు ఇతర సెగ్మెంట్లను కూడా దక్కించుకుని సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ మేరకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి. ఇందులో కొంతమంది పేర్లను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

సిద్ధమవుతున్న అభ్యర్థులు

గ్రేటర్‌ పరిధిలోని సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్‌ స్థానాల్లో ఈసారి పోటీ రసవత్తరంగా మారనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ముచ్చటగా మూడు పార్లమెంట్‌ స్థానాలను కైవసం చేసుకునేందుకు కృషి చేస్తోంది. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పేరును ప్రకటించినప్పటికీ.. కొంత సందిగ్ధత నెలకొంది. దాదాపుగా దానం పోటీలో ఉంటారని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నప్పటికీ.. నామినేషన్ల వరకు ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మల్కాజిగిరి అభ్యర్థిగా సునీతామహేందర్‌రెడ్డిని, చేవెళ్ల నుంచి సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్లను ప్రకటించింది అధిష్ఠానం. హైదరాబాద్‌ సెగ్మెంట్‌ను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. అలాగే సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థిగా, సిట్టింగ్‌ ఎంపీ కిషన్‌రెడ్డిని, మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్‌, హైదరాబాద్‌ స్థానానికి మాధవీలత, చేవెళ్లకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే పద్మారావును బరిలోకి దింపుతుండగా.. మల్కాజిగిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌, హైదరాబాద్‌ స్థానానికి గడ్డం శ్రీనివా్‌సయాదవ్‌ పేర్లను ప్రకటించారు.

గత ఎన్నికల్లో విలక్షణ తీర్పు..

2018 డిసెంబర్‌ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి టీఆర్‌ఎస్‌ (ప్రస్తుత బీఆర్‌ఎస్‌) రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చింది. 119 సీట్లలో 88 సీట్లను దక్కించుకుని అతిపెద్ద పార్టీగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. 19 సీట్లతో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. అయితే నాటి ఎన్నికల్లో గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లో 14 సీట్లను టీఆర్‌ఎ్‌సను గెలుచుకోగా, ఎంఐఎం-7, కాంగ్రెస్‌-2, బీజేపీ-1 చొప్పున దక్కించుకుంది. కాగా, 2019 ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో పరిస్థితి అనూహ్యంగా మారింది. ఈ ఎన్నికల్లో గ్రేటర్‌వాసులు విలక్షణ తీర్పు ఇచ్చారు. సికింద్రాబాద్‌ స్థానాన్ని బీజేపీ గెలుచుకోగా, మల్కాజిగిరి కాంగ్రెస్‌, చెవేళ్ల బీఆర్‌ఎస్‌, హైదరాబాద్‌ ఎప్పటిలాగే ఎంఐఎం కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాలుగు నెలల్లోనే గ్రేటర్‌లో ఊహించని ఫలితాలు రావడంతో అప్పట్లో టీఆర్‌ఎస్‌ నాయకులు నిశ్చేష్టులయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అలాంటి ఫలితాలు పునరావృతం కాకుండా

ఉండేందుకు అధికార కాంగ్రెస్‌ ఆచితూచీ అడుగులు వేస్తోంది. ఈసారి ఎన్నికల్లో సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్లతోపాటు హైదరాబాద్‌ సెగ్మెంట్‌లో గెలిచి తీరేందుకు పథకాలు రచిస్తోంది. ఈ మేరకు ఎంపీ, ఎమ్మెల్యేలు, బలమైన కేడర్‌ను పార్టీలో చేర్పించుకుని ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసేందుకు ఆరాటపడుతోంది.

మోదీ నినాదంతో బీజేపీ

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోదీ ప్రభుత్వమే వస్తోందనే నినాదంతో బీజేపీ నాయకులు సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. నాలుగు స్థానాల్లో కాషాయ జెండాను ఎగురవేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో ఈ సారి సత్తాచాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే అక్కడ బలమైన అభ్యర్థిగా మాధవీలతను బరిలోకి దించారు. కాగా, రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ కూడా మూడు సీట్లను గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది. ఆయా సెగ్మెంట్లలో మెజార్టీ ఎమ్మెల్యే స్థానాలు వారివే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో ఎంపీ సీట్లు కచ్చితంగా గెలుస్తామని ఆ పార్టీ అగ్రనాయకులు అంచనా వేస్తున్నారు.

నామినేషన్ల ప్రక్రియ తర్వాతే..

కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే తమవంతుగా రాష్ట్రం నుంచి మెజార్టీ ఎంపీ సీట్లను అందించాలని ఉద్దేశంతో రాష్ట్ర నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నాయకులను చేర్చుకుంటున్నారు. రాష్ట్రంలోని 17 సీట్లలో 16 సీట్లను కచ్చితంగా గెలుస్తామని సభలు, సమావేశాల్లో చెబుతున్నారు. కాగా, దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోందని.. ఎవరెన్ని చెప్పినా కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తోందని ఆ పార్టీ నాయకులు చెబుతూ ముందుకు సాగుతున్నారు. 17 సీట్లలో 17 సీట్లను కచ్చితంగా గెలుస్తామని పేర్కొంటున్నారు. అయితే గెలుపే లక్ష్యంగా ముందుకుసాగుతున్న ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ తర్వాత తమ ప్రచారాన్ని జోరుగా నిర్వహించనున్నారు. గ్రేటర్‌లో తామే క్లీన్‌ స్వీప్‌ చేస్తామని అన్ని పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 07 , 2024 | 03:34 PM