AP Politics: రోజా ఒంగోలు ఎంపీగా పోటీచేస్తే.. ‘నగరి’ పరిస్థితేంటి.. ఇక్కడ్నుంచి పోటీ ఎవరు..!?
ABN , Publish Date - Jan 28 , 2024 | 05:46 PM
Roja Contest As MP..? ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP 2024 Elections) సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీ (YSR Congress) నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్..! ఎప్పుడేం ప్రకటన వస్తుందో.. ఎక్కడ తమ సీటుకు ఎసరుపడుతుందో అని సిట్టింగులు టెన్షన్ టెన్షన్‌తోనే గడిపేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను వదలని సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy).. ఇప్పుడు మంత్రులకు కూడా స్థానచలనం చేస్తున్నారు. అది కూడా ఏ మాత్రం పరిచయం, సంబంధమే లేని జిల్లాలకు మారుస్తుండటంతో అవాక్కవుతున్న పరిస్థితి..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP 2024 Elections) సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీ (YSR Congress) నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్..! ఎప్పుడేం ప్రకటన వస్తుందో.. ఎక్కడ తమ సీటుకు ఎసరుపడుతుందో అని సిట్టింగులు టెన్షన్ టెన్షన్‌తోనే గడిపేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను వదలని సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy).. ఇప్పుడు మంత్రులకు కూడా స్థానచలనం చేస్తున్నారు. అది కూడా ఏ మాత్రం పరిచయం, సంబంధమే లేని జిల్లాలకు మారుస్తుండటంతో అవాక్కవుతున్న పరిస్థితి. వైసీపీ తరఫున పోటీ చేయడం అవసరమా..? పార్టీ మారి సొంత నియోజకవర్గం నుంచే పోటీ చేయాలా..? అని పలువురు సిట్టింగులు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఇది కాస్త మంత్రి రోజా దాకా వచ్చింది. నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజాను (Minister Roja) తీసుకెళ్లి.. ఒంగోలు ఎంపీగా పోటీ చేయిస్తున్నట్లు వైసీపీ దాదాపు తేల్చేసింది. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది. అసలు రోజాకు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది..? మంత్రిని చిత్తూరు నుంచి బయటికి పంపుతున్నదెవరు..? నిజంగానే ఇదే జరిగితే నగరి నుంచి పోటీ చేసేదెవరు..? ఈ మొత్తం వ్యవహారంలో తెరవెనుక చక్రం తిప్పిందెవరు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
అసలేం జరిగింది..?
టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రోజా.. అతి తక్కువకాలంలోనే ఎక్కడికో ఎదిగిపోయారు. ఆమెకున్న వాగ్దాటి రాజకీయాల్లో రాణించడానికి దోహదపడింది. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా అవకాశం దక్కడం.. వెనువెంటనే రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ రావడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే.. రెండుసార్లూ రోజా ఓడిపోయారు. సొంత పార్టీ నేతలే తనను ఓడించారని అప్పట్లో రోజా పదే పదే చెప్పేవారు. ఆ తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పి.. నాటి సీఎం వైఎస్సార్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు కానీ.. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించారు. దీంతో హస్తం గూటికి చేరడానికి రోజాకు దారి మూసుకుపోయింది. ఆ తర్వాత వైఎస్ జగన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరి 2014, 2019లో ‘నగరి’ నుంచి పోటీచేసి గెలుపొందారు. రెండోసారి గెలిచాక రోజాకు మంత్రి పదవి కూడా దక్కింది. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ.. 2024 ఎన్నికల్లో మంత్రికి టికెట్ ఇవ్వట్లేదని.. ఒంగోలు ఎంపీగా బరిలోకి దింపుతున్నట్లు వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి నుంచి కబురు వచ్చిందట. దాదాపు కన్ఫామ్ అయ్యిందని.. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని చెప్పేశారట. దీంతో.. ఎమ్మెల్యేగానే పోటీ చేయాలా..? లేకుంటే నో చెప్పేద్దామా..? అని డైలామాలో పడ్డారట రోజా. కుదరదు అంటే.. అసలుకే ఎసరు.. ఓకే అంటే ఏ మాత్రం సంబంధంలేని నియోజకవర్గానికి వెళ్లి.. అది కూడా ఎంపీగా గెలుపు అంటే సామాన్యమైన విషయం కాదని రోజా ఆందోళన చెందుతున్నారట.
తెరవెనుక ఉన్నదెవరు.. పోటీ ఎవరు..?
వాస్తవానికి.. ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే పెద్దాయన పెద్దిరెడ్డిదే (Peddireddy Ramachandra Reddy) అని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయి. ఇక్కడ ఏం చేయాలన్నా.. ఎవరికి టికెట్లు ఇవ్వాలన్నా.. పక్కనెట్టాలన్నా సర్వం రామచంద్రారెడ్డి చేతిలోనే ఉంటుందన్నది జగమెరిగిన సత్యమే. వైసీపీ అధికారంలోకి వచ్చాక అదిగో.. ఇదిగో రోజాకు మంత్రి పదవి అన్నారు కానీ చివరికి రాలేదు. రెండో దఫా అతి కష్టమ్మీద వచ్చింది.. అయితే ఇందుకు కర్త, ఖర్మ, క్రియ పెద్దిరెడ్డేనని పెద్ద ఎత్తునే ప్రచారం జరిగింది. ఎందుకంటే పెద్దిరెడ్డి మాటను రోజా లెక్కజేయకపోవడమే కారణమట. అందుకే ఇప్పుడు ఏకంగా నగరి సీటుకే పెద్దాయన ఎసరుపెట్టారన్నది టాక్. మంత్రి స్థానంలో నగరి నుంచి నియోజకవర్గంలో రోజా తర్వాత స్థానంలో ఉన్న చక్రపాణిరెడ్డిని దాదాపు ఖరారు చేశారట. చక్రపాణినికి రామచంద్రారెడ్డి అండదండలు మెండుగానే ఉన్నాయట. పరిస్థితులు ఈ రేంజ్‌లో ఉంటే జగన్ కూడా పెద్దిరెడ్డి మాటను అస్సలు జవదాటరు. రోజాను అడ్రస్ లేని నియోజకవర్గానికి పంపాలన్నదే బహుశా పెద్దాయన టార్గెట్ అని జిల్లాలో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే సైలెంట్‌గా రోజాను ఒంగోలుకు పంపేస్తున్నారట. అయితే.. ఎంపీగా పోటీచేయడంపై ఇంతవరకూ రోజా స్పందించలేదు.. కానీ.. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి తిరుగుబాటు చేసే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయని నగరిలో రోజా అనుచరులు చెవులు కొరుక్కుంటున్నారు. ఏం చేసినా సైలెంట్‌గా ఎందుకు ఉండాలి..? మనకు వేరే పార్టీలు లేవా..? టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరా..? అని అనుచరులు రోజాపై గట్టిగానే ఒత్తిడి తెస్తున్నారట. ఒకానొక సందర్భంలో ఎమ్మెల్యే టికెట్ గురించి మాట్లాడిన రోజా.. తనకు సీటు ఇవ్వకపోయినా ఇబ్బందేమి లేదని.. తాను జగనన్న సైనికురాలినని.. జగనన్న కోసం ప్రాణాలైన ఇవ్వడానికి రెడీగా ఉన్నాని చెప్పుకొచ్చారు.
ఎందుకీ పరిస్థితి..?
2014లో రోజా గెలిచినప్పట్నుంచి నుంచే నగరి వైసీపీలో పరిస్థితులు సర్లేవు. సొంత పార్టీలోనే అసమ్మతిని ఎదుర్కొంటూ.. ఎప్పుడూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉండేది. అలా పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఈ వర్గ రాజకీయాలు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగానే మారాయి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ పెద్దిరెడ్డి, నేరుగా వైఎస్ జగన్ కలుగజేసుకోవడంతో అతి కష్టమ్మీద రోజా గట్టెక్కారు. అయితే వర్గపోరు మాత్రమే మరింత ఎక్కువయ్యిందేగానీ తగ్గలేదు. ఆఖరికి రోజాకు టికెట్ ఇస్తే ఓడించేస్తామని సొంత పార్టీ నేతలే చెప్పిన పరిస్థితి. తాజాగా.. పుత్తూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి కోసం మంత్రి రోజా సోదరుడికి తాను రూ.40 లక్షలు ఇచ్చానని కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయ్.. ఇవన్నీ రోజాకు మైనస్‌గా మారాయి. దీంతో రోజాకు టికెట్ ఇచ్చి చేజేతులారా పోగొట్టుకోవడం ఎందుకని ఆలోచనలో పడిన అధిష్టానానికి పెద్దిరెడ్డి ఇచ్చిన సలహానే చక్రపాణిని బరిలోకి దింపడమట. ఎన్నిసార్లు సర్వే చేయించిన ఫలితం రోజాకు అనుకూలంగా రాకపోడంతో ఇక మార్పు మంచిదేనని హైకమాండ్ ఫిక్స్ అయ్యిందట. పైగా రోజాను ఒంగోలు ఎంపీగా పోటీ చేయిస్తే.. నగరి గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టడంతోపాటు.. ఒంగోలులో సైతం మాగుంట కోసం పట్టుబడుతున్న బాలినేని శ్రీనివాస రెడ్డిని తేలిగ్గా ఒప్పించొచ్చనేది వైసీపీ వ్యూహమనే టాక్ కూడా నడుస్తోంది. రేపో మాపో రోజా ఎంపీగా పోటీపై అధికారిక ప్రకటన వస్తే పరిస్థితేంటి..? ఎంపీగానే పోటీచేస్తారా లేకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారా..? అనేది తెలియాలంటే ఒకట్రెండు రోజులు ఆగాల్సిందే మరి.
YSRCP: మాకొద్దు బాబోయ్.. అని దండం పెట్టిన అలీ, వినాయక్.. తెరపైకి సుమన్!
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..