ఇదేం ‘దూకుడు‘?
ABN , Publish Date - Jul 03 , 2024 | 03:54 PM
గ్రేటర్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలు దర్జాగా సాగుతున్నాయి.
గ్రేటర్‌లో యథేచ్ఛగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన
ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్
చలానాలు విధిస్తున్నా మారని వాహనదారులు
నంబర్ ప్లేట్లు వంకర, హెల్మెట్లు బేఖాతర్
5 నెలల్లోనే 18.15 లక్షల కేసులు నమోదు
గతేడాదితో పోల్చితే 30 శాతం పెరుగుదల
యూటర్న్‌ల వద్ద తరచూ ప్రమాదాలు
హైదరాబాద్ సిటీ, జూలై 3 (ఆఽంధ్రజ్యోతి): గ్రేటర్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలు దర్జాగా సాగుతున్నాయి. సిగ్నల్ జంపింగ్, రాంగ్‌రూట్, ఓవర్‌స్పీడ్‌తో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, కేసులు నమోదు చేస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. సెల్‌ఫోన్ , హియర్ ఫోన్లలో మాట్లాడుతూ అత్యంత ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. హెల్మెట్ ధరించకుండా ట్రిఫుల్ రైడింగ్‌తో పోలీసుల కళ్లుగప్పి ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు కేవలం ఐదు నెలల్లో 18,15,721 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది ఐదు నెలలతో పోల్చితే ఈ కేసుల సంఖ్య 3,87,788 అధికం.
హెల్మెట్ లేకుండా..
కేవలం చలానాలు తప్పించుకోవడానికే అన్నట్లు కొందరు వాహనదారులు హెల్మెట్ ధరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎంతోమంది ద్విచక్ర వాహనదారులు తలకు తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. బైక్ రైడర్‌తో పాటు వెనుక కూర్చొన్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని పోలీసులు చెబుతుంటే.. ప్రస్తుతం వాహనం నడుపుతున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించకకపోవడం దారుణం. ఈ ఏడాది సిటీ కమిషనరేట్ పరిధిలో కేవలం ఐదునెలల్లో హెల్మెట్ ధరించకుండా 11,46,698 ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి.
సెల్‌ఫోన్ డ్రైవింగ్
ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా వాహనదారులు సెల్‌ఫోన్ డ్రైవింగ్‌తోనే దర్శనమిస్తున్నారు. పది వాహనాల్లో ముగ్గురు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నట్లు పోలీసులు అంటున్నారు. ఒక చేతిలో సెల్‌ఫోన్, మరొక చేతిలో స్టీరింగ్ పట్టుకొని కార్లు నడుపుతున్న దృశ్యాలు నగరంలో కోకొల్లలు. ద్విచక్ర వాహనదారులైతే ఏకంగా చెవిలో హియర్ ఫోన్ పెట్టుకొని, లేదా హెల్మెట్ చాటున సెల్‌ఫోన్ పెట్టుకొని మాటలు, పాటలతో ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతున్నారు. ఈ ఏడాది ఐదునెలల్లో సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు 31,711 నమోదయ్యాయి.
సిగ్నల్ జంపింగ్
రోడ్లపై రయ్‌మంటూ వాయువేగంతో దూసుకెళ్తున్న వాహనదారులు ట్రాఫిక్ పోలీసులను సైతం ఖాతరు చేయకుండా సిగ్నళ్లను జంప్ చేస్తున్నారు. సిగ్నల్ జంప్‌ను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నా పోకిరీలకు దూకుడుకు కళ్లెం వేయలేకపోతున్నారు. ఈ ఏడాది సిగ్నల్ జంపింగ్ కేసులు 34,181 నమోదైనట్లు తెలిపారు.
ఓవర్ స్పీడ్/డేంజరస్ డ్రైవింగ్
అడుగడుగునా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ నగరంలో ఇష్టానుసారంగా వాహనాలపై దూసుకెళ్తున్న పోకిరీల ఆగడాలు రోజురోజుకు పెచ్చరిల్లుతున్నాయి. ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్‌తో, వింత, విపరీత శబ్ధాలతో ఇతర వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కళ్లు మూసి తెరిచేలోపు రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది ఐదునెలల్లోనే ఓవర్ స్పీడ్/డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘన కేసులు 35,954 నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
ఐదు నెలల్లో నమోదైన కేసుల వివరాలు
1. హెల్మెట్ లేకుండా - 11,14,698
2. పార్కింగ్ ఆన్ సర్వీస్ రోడ్స్ - 1,16,815
3. రాంగ్ పార్కింగ్ - 1,05,504
4. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ - 37,655
5. రాంగ్ పార్కింగ్ - 76,008
6. ఓవర్ స్పీడ్/డేంజర్ డ్రైవింగ్ - 35,954
7. సిగ్నల్ జంపింగ్ - 34,181
8. సెల్‌ఫోన్ డ్రైవింగ్ - 31,711
9. విత్‌వుట్ డ్రైవింగ్ లైసెన్స్ - 28,327
10. డ్రంకెన్ డ్రైవ్ - 26,202