Share News

TDP-JSP First List: తొలి జాబితాలో కీలక నేతల పేర్లు కనిపించలేదేం.. సెకండ్ ఛాన్స్ ఉంటుందో లేదో..?

ABN , Publish Date - Feb 25 , 2024 | 01:03 PM

TDP-Janasena First List: మొదటి జాబితాలో (TDP- Janasena First List) పేర్లు కనిపించని టీడీపీ అభ్యర్థులు రెండో విడుత జాబితా (Second List) కోసం ఎదురు చూస్తున్నారు. టికెట్‌ తమకే ఖాయమని భావిస్తున్న సీనియర్‌ టీడీపీ నాయకుల్లో టెన్షన్‌ నెలకొంది. ఎందుకు తమ పేరు లేదోనని రాష్ట్ర స్థాయి నాయకులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు...

TDP-JSP First List: తొలి జాబితాలో కీలక నేతల పేర్లు కనిపించలేదేం.. సెకండ్ ఛాన్స్ ఉంటుందో లేదో..?

కర్నూలు: మొదటి జాబితాలో (TDP- Janasena First List) పేర్లు కనిపించని టీడీపీ అభ్యర్థులు రెండో విడుత జాబితా (Second List) కోసం ఎదురు చూస్తున్నారు. శనివారం టీడీపీ-జనసేన ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో కర్నూలు, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాలే ఉన్నాయి. ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆశావహుల్లో నిరుత్సాహం నెలకొంది. టికెట్‌ తమకే ఖాయమని భావిస్తున్న సీనియర్‌ టీడీపీ నాయకుల్లో టెన్షన్‌ నెలకొంది. ఎందుకు తమ పేరు లేదోనని రాష్ట్ర స్థాయి నాయకులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. అయితే.. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు టికెట్‌ ఆశిస్తుండడం.. సామాజిక సమీకరణలు, పార్టీల పొత్తుల నేపథ్యంలో గెలుపు గుర్రాలు ఎంపికపై తుది కసరత్తు జరగలేదని తెలుస్తోంది.


kotla.jpg

కారణాలు ఇవేనా..?

కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మలు 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. కర్నూలు ఎంపీగా కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా కోట్ల సుజాతమ్మలు పోటీ చేసి ఓడిపోయారు. ఆలూరు ఇన్‌చార్జిగా సుజాతమ్మ ఐదేళ్లుగా పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వర్తిస్తూ వచ్చారు. అయితే.. కుటుంబానికి ఒకే టికెట్‌ అనే విధానం టీడీపీ తీసుకొచ్చింది. కర్నూలు ఎంపీ స్థానాన్ని బీసీలకు కేటాయిస్తామని రెండేళ్లుగా టీడీపీ నాయకులు చెబుతూ రావడంతో ఆలూరు టికెట్‌ సుజాతమ్మకు ఖాయమని భావించారు. అయినప్పటికీ ఆలూరు నుంచి టికెట్‌ కోసం పార్టీ మాజీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు వీరభద్రగౌడ్‌, వైకుంఠం మల్లికార్జున, వైకుంఠం జ్యోతిలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే.. డోన్‌ నియోజకవర్గం నుంచి వైసీపీకి చెందిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిపైన ప్రస్తుత టీడీపీ ఇన్‌చార్జి ధర్మావరం సుబ్బారెడ్డి గెలవలేరని డోన్‌ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఆలూరును పెండింగ్‌లో పెట్టారు. రెండో జాబితాలో వీరభద్రగౌడ్‌, వైకుంఠం కుటుంబంలో ఒకరికి చాన్స్‌ వస్తుందా..? మరో కొత్త వ్యక్తి తెరపైకి వస్తాడా..? అన్న చర్చ జరుగుతోంది.

Chandrababu.png


kurnool4.jpg

ఎందుకిలా..?

  • ఆదోని టీడీపీ టికెట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు సహా ఆ పార్టీ నాయకులు గుడిసె కృష్ణమ్మ, మదిరె భాస్కరరెడ్డిలతోపాటు ఇటీవలే టీడీపీలో చేరిన బస్సాపురం శ్రీకాంత్‌రెడ్డి ఆశిస్తున్నారు. మరోవైపు పొత్తులో భాగంగా ఆదోని టికెట్‌ జనసేన ఆశిస్తోందన్న ప్రచారం కూడా ఉంది. టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని జనసేన నియోజకరవ్గం ఇన్‌చార్జి మల్లప్ప తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేగాకుండా బీజేపీతో పొత్తు అనివార్యమైతే ఆ పార్టీ కూడా ఆదోని టికెట్‌ ఆశించనున్నట్లు సమాచారం. టీడీపీ అంతర్గత సర్వేలు మీనాక్షినాయుడుకే అనుకూలంగా ఉన్నప్పటికీ.. సామాజిక సమీకరణాలు, పొత్తుల కారణంగానే ఆదోని అభ్యర్థిని ప్రకటించలేదని తెలుస్తోంది.

tdp.jpg

  • ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఖరారైందని, ప్రచారం చేసుకోమని ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. తొలి జాబితాలో బీవీ పేరు ఉంటుందని ఆయనతోపాటు సన్నిహితులు భావించారు. అయితే.. కొన్నాళ్లుగా ఎమ్మిగనూరు టికెట్‌ తనకు వస్తుందనే విశ్వాసంతో ఎంజీ కుటుంబానికి చెందిన డాక్టర్‌ మాచాని సోమనాథ్‌ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నాడు. ఈయన వైసీపీ అభ్యర్థిగా ఎంపికైన బుట్టా రేణుకకు స్వయాన అల్లుడు. వైసీపీ బీసీలకు టికెట్‌ ఇచ్చిందని, టీడీపీ కూడా బీసీలకే ఇస్తుందనే ఆశాభావంతో సోమనాథ్‌ ముందుకు వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో రెండో జాబితాలో అవకాశం ఎవరికి ఉంటుందోనని కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.

  • మంత్రాలయం నియోజకవర్గం నుంచి టీడీపీ ఇన్‌చార్జి పి.తిక్కారెడ్డి రెండు పర్యాయాలు ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఐదేళ్లుగా టీడీపీ ఇన్‌చార్జిగా ఉంటూ అధిష్టానం నిర్దేశించిన కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించారు. తమకు ఒక అవకాశం ఇవ్వాలని వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఉలిగయ్య ఆశిస్తున్నారు. అదే వాల్మీకి వర్గానికి చెందిన వైసీపీ నాయకుడు మాధవరం రాఘవేంద్రరెడ్డి ఇటీవలే టీడీపీలో చేరారు. తనకే టికెట్‌ వస్తుందని బాహటంగానే ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అధిష్టానం టికెట్‌ ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి పార్టీలోకి చేర్చుకుందని అంటున్నారు.

  • అధికార పార్టీ దౌర్జన్యాలు, అక్రమ కేసులు దౌర్యంగా ఎదుర్కొని ఐదేళ్లు పార్టీని బలోపేతం చేయడమే కాకుండా చంద్రబాబు చేపట్టిన బాదుడే బాదుడు, లోకేశ్‌ పాదయాత్ర, నారా భువనేశ్వరి నిజం గెలవాలి.. వంటి కార్యక్రమాలు సహా వివిధ కార్యక్రమాలు దిగ్విజయం చేయడం, పార్టీ బలోపేతం కోసం రూ.కోట్లు ఖర్చు చేశారని, తొలి జాబితాలో పేరు లేకపోగా కొత్త వాళ్లకు ఇస్తారనే ప్రచారంతో మీనాక్షినాయుడు, బీవీ జయనాగేశ్వరరెడ్డి, తిక్కారెడ్డి వర్గీయులు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 01:06 PM