అయ్యో బల్దియా !
ABN , Publish Date - May 23 , 2024 | 03:43 PM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిధుల కటకట ఎదుర్కొంటోంది.
సంస్థ అప్పులు రూ.6,530 కోట్లు !
రూకల్లోతు కష్టాలతో జీతాలకు కటకట
అప్పులకు వడ్డీలు, వాయిదాలు కట్టలేని దుస్థితి
చిన్నచిన్న పనులకూ నిధులు లేని వైనం
బిల్లులు రాక పనులు ఆపిన కాంట్రాక్టర్లు
ప్రభుత్వ నిధుల కోసం ‘మహా’ తహతహ
హైదరాబాద్ సిటీ, మే 23 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిధుల కటకట ఎదుర్కొంటోంది. చేతిలో చిల్లిగవ్వ లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం నిధులు విడుదల చేయకుండా బల్దియాపై రుద్దడంతో చేసేది లేక దొరికిన చోటల్లా అప్పులు చేశారు. చేసిన అప్పులకు కిస్తీలు, వడ్డీలు చెల్లించలేక నానా తిప్పలు పడుతోంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్‌డీపీ), కాంప్రెహెన్సీవ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రొగ్రామ్ (సీఆర్‌ఎంపీ), వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఎన్‌డీపీ), జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్ల కోసం వివిధ బ్యాంకుల నుంచి బల్దియా రూ.6,530 కోట్ల రుణాలు తీసుకుంది. ఆస్తిపన్ను, భవన నిర్మాణ అనుమతుల జారీ, ఇతరత్రా మార్గాల్లో వచ్చే ఆదాయంతో నగరంలో రహదారుల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ, వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదల వంటి మౌలిక వసతులు కల్పించాలి. ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేలా వంతెనలు, అండర్‌పా్‌సల వంటి వాటి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి.
పేరుకే ఆర్భాటం..
మహానగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని గత బీఆర్‌ఎస్ పాలకులు గొప్పలకు పోయారు. ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దామని హంగామా చేశారు. 34 వంతెనలు, అండర్‌పా్‌సలు, ఆర్‌వోబీ/ఆర్‌యూబీలు నిర్మించామని చెప్పుకున్న గత సర్కారు ఆ పనుల కోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వలేదు. దీంతో ఎస్‌ఆర్‌డీపీ కోసం మునిసిపల్ బాండ్ల జారీ, రూపీ టర్మ్ లోన్ ద్వారా రూ.4,250 కోట్ల రుణం తీసుకున్నారు. రహదారుల నిర్మాణం, నిర్వహణను ప్రయోగాత్మకంగా సీఆర్‌ఎంపీలో భాగంగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. దీనికోసం రూ.1,460 కోట్ల అప్పు తీసుకుంది. నాలాల అభివృద్ధి, విస్తరణకు మరో రూ.680 కోట్లు తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల చెల్లింపునకూ జీహెచ్‌ఎంసీ ఇబ్బంది పడుతోంది. రోడ్ల మరమ్మతు, నాలాల పూడికతీత తదితర పనులకు సంబంధించి రూ.1320 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏడాదిగా బిల్లుల చెల్లించకపోవడంతో చేసేది లేక ఈనెల 18వ నుంచి కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. వచ్చేనెల నుంచి వానకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మాన్‌సూన్ బృందాల ఏర్పాటు, నాలాల పూడికతీత పనులు కూడా చేసేది లేదని స్పష్టం చేశారు.
అత్యవసర పనులకూ కటకటే
మహానగరంలో రోడ్డు మరమ్మతు చేయాలన్నా, నాలా పూడిక తీయాలన్నా, వాహనాల డీజిల్, నిర్వహణ, కార్యాలయాల మెయింటెనన్స్‌కు పైసలు ఉండడం లేదు. పేరుకు గ్రేటర్ కార్పొరేషన్ అని చెప్పుకుంటున్నా నిధులు ఎలా సర్దాలో అర్థం కావడం లేదని ఉన్నతాధికారులు వాపోతున్నారు. జీహెచ్‌ఎంసీకి వచ్చే ఆదాయం వేతనాలు, అప్పులకు వడ్డీ, వాయిదాలు చెల్లించేందుకు చాలడం లేదు. దీంతో కాంట్రాక్టర్ల బిల్లులను దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంచారు. ఇటీవల కొత్త మొత్తాన్ని విడుదల చేసి వారిని సముదాయించినట్లు తెలిసింది.
అప్పుల వివరాలు
ప్రాజెక్టు - అప్పు (రూ.కోట్లలో)
ఎస్‌ఆర్‌డీపీ - 4250
సీఆర్‌ఎంపీ - 1460
ఎస్‌ఎన్‌డీపీ - 680
హడ్కో గృహాలు - 140
మొత్తం - 6530