ప్చ్.. మాకెప్పుడు?
ABN , Publish Date - Mar 31 , 2024 | 03:56 PM
గ్రేటర్ కాంగ్రెస్ నేతల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది.
కాంగ్రె్‌సలో ఆశావహుల అసంతృప్తి
లోక్‌సభ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు
వలస నేతలకు ప్రాధాన్యంతో నారాజ్
అయినా టికెట్ దక్కడం లేదని నిరాశ
గ్రేటర్‌లో మూడు టికెట్లు వలసదారులకే
కమలం పార్టీలోనూ అదే తీరు
హైదరాబాద్ సిటీ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ కాంగ్రెస్ నేతల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారిని కాకుండా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి ఎంపీ టికెట్లు ఇవ్వడంపై నిరాశ చెందుతున్నారు. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ఆనందం ఒకవైపు ఉండగా, ఎన్నికల ముంగిట ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు టికెట్లు ఎగురేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. ప్రధానంగా గ్రేటర్ పరిధిలో చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్లు ఆశించిన కాంగ్రెస్ నేతలు అధిష్ఠాన నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. అయితే అసంతృప్తి సెగను పట్టించుకోని అధికార కాంగ్రెస్.. ఇతర పార్టీ నేతలను ఆకర్షించడానికే ప్రాధాన్యమిస్తోందని వాపోతున్నారు.
అంతా మరిచి..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాహాటంగా విమర్శలు గుప్పించిన వారే...అన్నీ మరిచిఅధికార పార్టీకి దగ్గరవుతున్నారు. పెద్ద నేతల నుంచి చిన్న కార్యకర్తల వరకు గంటల వ్యవధిలో మారుతున్న కండువాలు, పార్టీ జెండాలను చూసి సాధారణ ఓటరు తన చేతివేలికి ఇంకా ఆరని సిరా చుక్కను చూసి ఆశ్చర్యపోతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీల్లో చేరికలు పెద్దగా లేనప్పటికీ..లోక్‌సభ ఎన్నికలు వచ్చేనాటికి జంప్ జిలానీ సంఖ్య మరింత పెరుగుతోంది. బీజేపీతో పోల్చితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రె్‌సలో చేరేందుకు విపక్షనేతలు మొగ్గుచూపుతున్నారు.
అధికార పార్టీలో ఉండాలన్న తాపత్రయం
గత పదేళ్లు బీఆర్‌ఎ్‌సలో పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ రాగానే వేగంగా అందులో చేరుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది చేరగా, మిగిలిన వారిలోనూ చాలా మంది కాంగ్రె్‌సలో ఎలా చేరాలనే దారులు వెతుకుతున్నారని తెలిసింది. మధ్యవర్తిత్వం కోసం కాంగ్రె్‌సలో పరిచయమున్న నేతలను రహస్యంగా కలుస్తున్నారని సమాచారం. ఎంపీ టికెట్ దక్కకున్నా ఏదో సముచిత స్థానం దక్కకపోతుందా అనే ధోరణిలో బడా, చోటా నేతలందరూ క్యూ కడుతున్నారు. మరోవైపు ఈడీ దాడులు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కూడా ప్రతిపక్ష బీఆర్‌ఎ్‌సను కుదిపేస్తున్నాయి. అధికార పార్టీలో ఉంటే ఎన్నికల్లో స్థానం దక్కకున్నా తమ వ్యాపారాలు సాఫీగా చక్కబెట్టుకోవచ్చన్నది వారి ఆలోచన.
పార్టీల ఆకర్షణే
అయితే అభ్యర్థులు, కార్యకర్తలు మారడానికి పార్టీలే కారణమనడంలో అనుమానం లేదు. ఆపరేషన్ ఆకర్ష్ పేరిట కాంగ్రెస్, ఆపరేషన్ లోటస్ అంటూ బీజేపీ ఇతర పార్టీ నేతలను చేర్చుకుంటున్నాయి. ఇలా ఒకరిని ఆఫర్ చేయగానే.. ఆయన వెంట ఉన్న కార్యకర్తలు సైతం క్షణాల్లో కండువాలు మార్చుకుంటున్నారు. అయితే జంపింగ్‌లకు కాంగ్రెస్ పెద్దపీట వేసిందనే చెప్పవచ్చు. ఇప్పటివరకు ముగ్గురికి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కాంగ్రెస్ టికెట్లు కేటాయించింది. దానం నాగేందర్, రంజిత్‌రెడ్డి, సునీతా మహేందర్‌రెడ్డిలకు టికెట్లు ఖరారయ్యాయి. అలాగే కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీలో చేరడానికి ఇతర పార్టీ నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఆ పార్టీలోనూ బయట నుంచి వచ్చిన నేతలకు ఆదరణ పెరగడంతో పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.